ఇంటర్ నోటిఫికేషన్ ఇంకెప్పుడు?
ఆన్లైన్ ప్రవేశాలపై తేలనందునే జాప్యం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రవేశాల నోటిఫికేషన్ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్ జారీకి నిర్ణయం తీసుకోవాలంటూ ఇంటర్ బోర్డు పంపించిన ఫైలును పక్కన పడేసింది. గతేడాది టెన్త్ ఫలితాల తర్వాత వారం రోజుల్లోనే ఇంటర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసిన బోర్డు... ఈసారి పదో తరగతి ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా చర్యలు తీసుకోలేకపోతోంది. ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాల వ్యవహారాన్ని ఎటూ తేల్చకుండా సంబంధిత ఫైలును పక్కన పడేయడమే ఇందుకు కారణం. బోర్డు నిబంధనల ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది.
అయితే ఇప్పటివరకు ప్రవేశాల ప్రక్రియే ప్రారంభం కాకపోవడంతో ఈసారి ఫస్టియర్ తరగతులు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రముఖ ప్రైవేటు కాలేజీలు తమ ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ ప్రవేశాలు వద్దంటూ ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నందునే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన ఫైలును ఇంటర్ బోర్డు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి పంపించి 45 రోజులు అవుతున్నా.. తొందరపడవద్దంటూ పక్కన పెట్టేశారు. దీంతో ఈసారి ప్రవేశాలు ఆన్లైన్లో చేపడతారా? ఆఫ్లైన్లో చేపడతారా? అన్న గందరగోళం నెలకొంది.