వరకట్న దాహానికి యువతి బలి
జమ్మలమడుగు : వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కనీసం నాలుగు నెలలైనా దాంపత్య జీవితం గడవక ముందే ఆ యువతికి నిండు నూరేళ్లు నిండాయి. భర్త, అత్తమామలు అదనపు కట్నం తీసుకుని రావాలంటూ వేధించడంతో పాటు తీవ్రంగా కొట్టి చంపి ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పట్టణంలోని నశ్యం వారి వీధికి చెందిన న్యామత్ కుమార్తె మాబుచాన్ ప్రైవేట్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదువుతోంది. బెల్లాల వీధికి చెందిన బాషా మోదీన్ కుమారుడు ఇంతియాజ్ అమ్మాయిని ప్రేమిస్తున్నాని వెంటపడుతుండటంతో తల్లిదండ్రులు ఇంతియాజ్ తండ్రి దృష్టికి తీసుకెళ్లి కుమారుడిని మందలించాలని సూచించారు.
అయితే అమ్మాయి కూడా అతని ప్రేమలో పడి పారిపోయే ప్రయత్నం చేయడంతో తల్లిదండ్రులు తెలుసుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 8వతేదిన వీరికి వివాహం జరిపించారు. కట్నకానుకల కింద పదితులాల బంగారంతో పాటు, నగదును కూడా సమర్పించారు. వివాహం చేసుకున్నప్పటినుంచి తమ కుమార్తెను వేధించడంతోపాటు అదనపు కట్నం తీసుకుని రావాలంటూ భర్త ఇంతియాజ్, మామ బాషామొహిద్దీన్, అత్త హబీబూన్లు మాబూచాన్కు కొట్టడంతో పాటు కట్నం తీసుకుని రావాలంటూ ఇంటికి పంపించేవారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు అదనంగా మరో 50వేల రూపాయలు కుమార్తెకు ఇచ్చి పంపించారు. ఇంకా డబ్బులు తీసుకుని రావాంటూ సోమవారం రాత్రి భర్త ఇంతియాజ్, మామ అత్త హత్య చేసి ఆమెను ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి తండ్రి న్యామత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.