పొగడ్తను మించిన మత్తు పదార్థం లేదు!
విద్య - విలువలు
ఆవు ఎక్కడెక్కడో పచ్చిగడ్డి మేస్తుంది. ఎవరూ తాగడానికి పనికిరాని నీళ్లను తాగి అందరికీ పనికివచ్చే పాలను ఇస్తుంది. ఆ పాలను విడిచి పెట్టడానికి దానికి ఒక లక్షణం ఉంటుంది. పొదుగు దగ్గరకు దూడ వెళ్లి, దాని సిరములు నోటితో పట్టుకుని ముట్టెతో నాలుగు గుద్దులు గుద్దితే చాలు ఆవు పాలు విడిచిపెట్టేస్తుంది. ఒకసారి విడిచిపెట్టిన పాలను మళ్లీ వెనక్కి తీసుకోలేదు. అదే ఆవు అది త్వరత్వరగా తిన్న ఆహారాన్ని కడుపులోకి పంపి, తర్వాత తీరిగ్గా దానిని మళ్లీ ఉండలుండలుగా నోట్లోకి తెచ్చుకుని నెమరు వేసుకుని తిరిగి కడుపులోకి పంపగలదు.
కానీ అలా పాలధారలను వెనక్కి తీసుకోలేదు. అలా వదిలి పెట్టినప్పుడే జాగ్రత్తగా పట్టుకోవాలి. దూడైనా, పాలు పితికే పశుపోషకుడైనా కచ్చితంగా పాలధారని అలా ఒడిసి పట్టుకోవాల్సిందే. ఏ మాత్రం స్థాన చలనమైనా పాలు నేలపాలైపోతాయి. గురువు కూడా ఇలాగే ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సముపార్జిస్తాడు. ఏ విధమైన స్వార్థమూ లేకుండా గురువు జ్ఞానధారను వదలడం మొదలుపెడితే శిష్యుడు అంతే జాగ్రత్తగా చెవులను దొప్పలుగా చేసుకుని ఆ ధారలను ఒడిసి పట్టుకోవాలి.
మీరందరూ విద్యార్థులు. మీకు సరస్వతీ కటాక్షం ఉండాలనీ, వాగ్దేవి కటాక్షం ఉండాలని మీ పెద్దలు, మీ గురువులు నిత్యం ప్రార్థిస్తుంటారు. వాగ్దేవి సరస్వతి స్వరూపమే. కానీ వాగ్దేవిలో ఉండే లక్షణం వేరు. వాగ్దేవి అంటే వాక్కుకు అధిష్ఠానమైన దేవి అని. దివ్ అనే ధాతువులోంచి వచ్చిన పదం దేవి. దివ్ అంటే కాంతి. కాంతి ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉండదు. తెలుసుకోవడం అనేది ఒక విశేషం. గతంలో ఎన్నో మంచి విశేషాలుంటాయి. వాటిని తెలుసుకోవడం ఎలా సాధ్యమౌతుందంటే - ప్రవాహం వలన సాధ్యమౌతుందని వేదం చెబుతున్నది. సరస్వతీ సూక్తం ప్రకారం సరస్వతి అంటే ప్రవహించునది. సరస్వతి అలా ప్రవహించకపోతే ఏమవుతుంది! అలా ప్రవహించకుండా ఎవరిలోనైనా ఉండిపోతే వాడు దుర్మార్గుడైపోతాడని శాస్త్ర వాక్కు.
ఎవరికైనా ఒక విషయం తెలుసనుకోండి. దానిని ఇతరులకు చెప్పి తీరాలి. అది ప్రవాహం చేతనే సాధ్యమౌతుంది. కానీ అలా అతను చెప్పలేదనుకోండి. ఆయన మూగవాడా ? కాదే ! కానీ చెప్పడు. ఎందుకలా అంటే అది లోభకారకం కావాలి. అంటే ఆయన సంతోషించడానికి ఏదో ఉండాలక్కడ. ’’ఇది నేను ఇతరులకు చెప్తే నాకేం వస్తుంది?’’ అన్న ఆలోచన ఉంటుంది. అలా పుచ్చుకున్న దానిని బట్టి చెప్పడం ఉంటుంది తప్ప, నేను చెప్పడమే ప్రయోజనం అన్నట్లుండదు. అటువంటి వారిలో సరస్వతి-వాగ్దేవిగా మారిందని చెప్పడం సాధ్యం కాదు.
అందుకే సరస్వతీ కటాక్షం గొప్పదా? వాగ్దేవి కటాక్షం గొప్పదా? అంటే శాస్త్రం వాగ్దేవి కటాక్షమే గొప్పదని చెప్పింది. వాక్ అన్నదానిని అగ్నిహోత్రంతో పోలుస్తారు. అగ్ని ఏ వస్తువునైనా కాల్చివేస్తుంది. వాక్కు అజ్ఞాన దాహంతో ఉంటుంది. ఎదుటివాడిలో ఉన్న అజ్ఞానాన్ని కాల్చగలిగినదేదో దానికే వాక్కు అని పేరు. ఏదో నోరుంది గదా అని చెప్పి అక్కరలేని మాటలను మాట్లాడేవాటిని వాక్కులని పిలవరు. భగవంతుడు నోరిచ్చాడు కాబట్టి అంతకంటే మరో ప్రయోజనం ఉంటుందని తెలియనివాడు అలా ప్రవర్తిస్తాడు. అవి అవతలివాడిని పాడు చేస్తాయంతే.
అందుకే వాక్కులో ఎప్పుడూ రెండు లక్షణాలుంటాయి. వాక్కుని సక్రమంగా వినియోగించకపోతే ఆ వాక్కు మత్తు కల్పిస్తుంది. నేను నిష్కారణంగా మిమ్మల్ని పొగిడాననుకోండి. పొగడ్తను మించిన మత్తు లోకంలో మరొకటి లేదు. ఏదైనా ఒక మత్తు పానీయాన్ని ఎవరైనా స్వీకరిస్తే దాని తాలూకు ప్రభావం వారి శరీరంలో కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కానీ విశేషమైన పొగడ్త జీవితాంతం జ్ఞాపకం ఉండి పాడుచేయడానికి పనికొస్తుంది. అంటే వాక్కులు హితకరం కావాలి. అవతలివాడి అభ్యున్నతికి పనికి వచ్చేవై ఉండాలి తప్ప కేవలం అవతలివాడిని పొగడడానికి మాత్రమే పనికివచ్చేటట్లుగా వాక్కు ఎప్పుడూ ఉండకూడదు.
వాక్కులు హితకరం కావాలంటే... సంస్కారముండాలి. మనమిలా మాట్లాడితే అవతలివాడికి హితం కలుగుతుందా లేదా అని ఆలోచించి ఎప్పుడు ఎక్కడ అవతలివాడికి హితం కల్పించాలో అటువంటి మాట మాట్లాడాలంటే వారిలో సంస్కార బలం ఉండాలి. సంస్కార బలమంటే కేవలం చదువుకుని ఉండడం కాదు. అవతలివాడి అభ్యున్నతిని ఆపేక్షించగలిగినవాడై ఉండాలి. ‘‘నా వాక్కుతో అవతలివాడికి ఉపయోగం కలగాలి. వాడికి మంచి జరగాలి’’ అని లోపల ఎవరిలో త్యాగబుద్ధి ఉంటుందో అటువంటివారు మాత్రమే హితకరమైన వాక్కు పలకగలరు. అవతలివాడు హితకరమైన వాక్కు పలికినా ఇవతలివాడికి అది ఎప్పుడు హితమౌతుంది... అంటే వినయం కలిగినవాడైతేనే అది సాధ్యపడుతుంది.
ఈరోజుల్లో మనం గురువు, శిష్యుడు, అధ్యాపకుడు, విద్యార్థి, ఉపాధ్యాయుడు... ఇటువంటి మాట వాడుతున్నాం గానీ, ఒకానొకప్పుడు ఈ దేశంలో కులవిద్య ఉన్న రోజుల్లో గురువు-శిష్యుడు అన్న పదబంధం కన్నా ముందు వాడబడిన పదాలు వినీతుడు, వినీయుడు. గురువు చెప్పిన మాటలను సరిగా అర్థం చేసుకున్నవాడు మాత్రమే విద్యార్థి కాగలిగిన అర్హత ఉన్నవాడు. గురువు అంటే బరువు అని అర్థం. దానికి వ్యతిరేక పదం- లఘువు. అంటే చిన్నది అని. అంటే గురువు స్పర్శ, గురువు స్మరణంతో పాటూ ‘‘ఆయన నాకు హితకరుడు, ఆయన మాట నాలోని అజ్ఞానాన్ని దహింప చేస్తుంది. ఆయన మాటలను నేను ఒడిసి పట్టుకోవాలి’’ అన్న పద్ధతిలో శిష్యుడి ఆలోచన సాగాలి. గురువు మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత చెవులను దొప్పలుగా చేసుకుని జ్ఞానధారలను లోనికి పుచ్చేసుకోగలగాలి.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు