Ipca Labs
-
యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో ఇప్కా ల్యాబ్స్‌కు 33.38% వాటా!
న్యూఢిల్లీ: ఔషధ రంగంలో ఉన్న ఇప్కా ల్యాబొరేటరీస్ తాజాగా యూనికెమ్ ల్యాబొరేటరీస్‌లో 33.38 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,034 కోట్లు. యూనికెమ్ ప్రమోటర్ నుంచి 2,35,01,440 షేర్లను ఒక్కొక్కటి రూ.440 చొప్పున ఇప్కా దక్కించుకుంటోంది. అలాగే యూనికెమ్లో పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి మరో 26 శాతం వరకు వాటాలను ఒక్కో షేరుకు రూ.440 చెల్లించి కొనుగోలు చేసేందుకు ఇప్కా ఓపెన్ ఆఫర్ ఇవ్వనుంది. ఎంచుకున్న వృద్ధి మార్కెట్లలో కంపెనీ పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచడానికి తాము నిర్ధేశించుకున్న వ్యూహానికి అనుగుణంగా ఈ డీల్ ఉందని ఇప్కా ల్యాబొరేటరీస్ ప్రమోటర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రేమ్‌చంద్ గోధా ఈ సందర్భంగా తెలిపారు. 1949లో ఇప్కా ప్రారంభం అయింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఎగుమతుల వాటా 50 శాతం. ఫినిష్డ్ డోసెజెస్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ను తయారు చేస్తోంది. -
ఎల్జీ బాలకృష్ణన్- ఇప్కా ల్యాబ్స్ జూమ్
ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ మార్కెట్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 187 పాయింట్లు పెరిగి 40,332కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,831 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించింది. ఈ బాటలో క్యూ3పై అంచనాలు పెరగడంతో ఈ ఆటో విడిభాగాల కంపెనీ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క క్యూ2లో ఆకర్షణీయ పనితీరు చూపనున్న అంచనాలతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఇప్కా ల్యాబొరేటరీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఎల్జీ బాలకృష్ణన్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఎల్జీ బాలకృష్ణన్ నికర లాభం దాదాపు 24 శాతం క్షీణించి రూ. 28 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 412 కోట్లను తాకింది. అయితే ఇటీవల ఆటో రంగం జోరందుకోవడంతో క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో మరింత మెరుగైన పనితీరును చూపవచ్చన్న అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎల్జీ బాలకృష్ణన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం దూసుకెళ్లి రూ. 272 వద్ద ట్రేడవుతోంది. ఇప్కా ల్యాబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఇప్కా ల్యాబొరేటరీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించనున్న అంచనాలు పెరిగాయి. దీంతో ఎన్ఎస్ఈలో తొలుత ఇప్కా ల్యాబ్ షేరు 9 శాతం దూసుకెళ్లింది. రూ. 2,319 సమీపంలో సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం కొంత వెనకడుగు వేసి 5.5 శాతం లాభంతో రూ. 2,240 వద్ద ట్రేడవుతోంది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో కంపెనీ నికర లాభం మూడు రెట్లు జంప్‌చేసి రూ. 129 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 41 శాతం పెరిగి రూ. 1,546 కోట్లకు చేరింది. కాగా.. యాంటీమలేరియల్ బిజినెస్‌లో గ్లోబల్ ఫండ్ నుంచి మద్దతు లభించడం, యూఎస్ఎఫ్డీఏ నుంచి దిగుమతులపై అడ్డంకులు తొలగిపోవడం వంటి అంశాలు కంపెనీ పనితీరుకు దోహదపడగలవని ఆగస్ట్ నివేదికలో రేటింగ్ దిగ్గజం క్రిసిల్ పేర్కొంది. ఇది ఇన్వెస్టర్లకు హుషారునిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
జైడస్ వెల్నెస్- ఇప్కా ల్యాబ్స్ భలే జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో హెల్త్‌కేర్ రంగ కంపెనీ జైడస్ వెల్నెస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే సమయంలో బీమా రంగ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో వాటాలను పెంచుకున్న వార్తలతో ఫార్మా రంగ దిగ్గజం ఇప్కా ల్యాబ్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జైడస్ వెల్నెస్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో జైడస్ వెల్నెస్ నికర లాభం 11 శాతం పెరిగి రూ. 89 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 537 కోట్లకు చేరింది. ఇబిటా దాదాపు యథాతథంగా రూ. 122 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో జైడస్ వెల్నెస్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1640 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1690 వరకూ ఎగసింది. ఇప్కా ల్యాబ్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో బీమా రంగ కంపెనీల వాటా ఇప్కా ల్యాబ్స్‌లో 2.22 శాతం నుంచి 4.23 శాతానికి పెరిగింది. కంపెనీలో హెచ్డీఎఫ్సీ లైఫ్‌కు 1.82 శాతం, ఎస్బీఐ లైఫ్‌కు 1.1 శాతం వాటా ఉంది. ఈ బాటలో ఎంఎఫ్‌లు యాక్సిస్ ట్రస్టీ మిడ్ క్యాప్ ఫండ్ 1.68 శాతం నుంచి 1.9 శాతానికి, ఎల్అండ్టీ ట్రస్టీ మిడ్‌క్యాప్ ఫండ్ 2.74 శాతం నుంచి 3.34 శాతానికి ఇప్కా ల్యాబ్స్‌లో వాటా పెంచుకున్నాయి. ఈ నేపథ్యలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఇప్కా ల్యాబ్స్ షేరు 8 శాతం దూసుకెళ్లి రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1902 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకావడం గమనార్హం! -
ఇప్కా ల్యాబ్స్ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ
న్యూఢిల్లీ: ఇప్కా ల్యాబొరేటరీస్ అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ బేషోర్ ఫార్మాస్యూటికల్స్ ఎల్ఎల్సీలో 80 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను అమెరికాలోని తమ అనుబంధ కంపెనీ ఇప్కా ఫార్మాస్యూటికల్స్ ఇన్‌కార్పొ రూ.74.40 కోట్లకు (10.286 మిలియన్ డాలర్లకు) కొనుగోలు చేసిందని ఇప్కా ల్యాబొరేటరీస్ వెల్లడించింది. తమ జనరిక్స్ ఔషధాలను అమెరికాలో బేషోర్ ఫార్మా ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. కాగా, 2017 డిసెంబర్ 31తో ముగిసిన ఏడాది కాలానికి బేషోర్ ఫార్మా కంపెనీ 7.05 మిలియన్ డాలర్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. -
ఇప్కా లాబ్స్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
ముంబై: దేశీయ ఫార్మా సంస్థ ఇప్కా లేబ్స్ తయరు చేసిన మందును అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ షాక్ తగిలింది. రత్లాం, సిల్వస్సా, పీతంబూర్ మూడు యూనిట్లలో తయారయ్యే అన్ని రకాల ఔషధాల దిగుమతులపై యూఎస్ఎఫ్డీఏ బ్యాన్ విధించడంతో ఇప్కా లేబ్స్ షేర్ భారీ పతనాన్ని నమోదు చేసింది. బీఎస్ఈలో ఈ షేరు 15 శాతం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని పీతంపూర్, రత్లాం, సిల్వస్సా (దాద్రా నగర్ హవేలి) లో తయరుచేసిన అన్ని ఔషధాలపై నిషేధం కొనసాగుతుందని ఇప్కా లాబొరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది . ఈ తయారీ కేంద్రాల నుండి తయారైన ఔషధ ఉత్పత్తులు , అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన మందులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ప్రకటించేదాకా బ్యాన్ కొనసాగుతుందని పేర్కొంది. కాగా రత్లాం యూనిట్లో క్లోరోక్విన్ ఏపీఐ తయారీకి మాత్రం యూఎస్ఎఫ్డీఏ వెసులుబాటు కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా మార్కెట్లో ఈ ఏపీఐకు కరవు ఏర్పడినా లేదా అవసరం ఏర్పడినా వీటి విక్రయాలను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయ మార్కెట్లో పార్మా బలహీనత కొనసాగుతోంది. దీంతో ఫార్మాసెక్టార్కు దూరంగా ఉండాలని కూడా ఎనలిస్టులు సూచిస్తున్నారు.