Irani gang
-
మహా నగరంలో మాయగాళ్లు!
పీఎంపాలెం(భీమిలి): మహా నగరంలోకి మాయగాళ్లు ప్రవేశించారు. అత్యాశకు పోయేవారిని లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారు. చౌకగా బంగారం విక్రయిస్తామని నమ్మించి సుమారు రూ.20 లక్షలు దోచుకుపోయిన సంఘటన సోమవారం పీఎం పాలెం పరిసరాల్లో తీవ్ర అలజడి సృష్టించింది. స్థానిక నేర విభాగం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి మరో ముగ్గురుతో కలసి సోమవారం మధ్యాహ్నం పీఎంపాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో చౌకగా బంగారం విక్రయిస్తామని చంద్రశేఖర్ అనే వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి వచ్చాడు. కోటేశ్వరరావు తన వెంట రూ. 20లక్షలు కూడా తీసుకొచ్చాడు. అప్పటికే అక్కడ ఇరానీ గ్యాంగ్ సభ్యులు మాటు వేసి ఉన్నారు. చంద్రశేఖర్ కూడా ఆ గ్యాంగ్ సభ్యుడే. పోలీసులు ఆ ప్రాంతానికి వస్తున్నట్టుగా అలజడి సృష్టించి కోటేశ్వరరావు చేతిలోని రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌ను లాక్కుని అక్కడి నుంచి వారు వచ్చిన వాహనంలో పరారయ్యారు. వారి వెంట చంద్రశేఖర్ కూడా ఉడాయించాడు. అయితే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం ఈ ప్రాంతంలో స్థలం కొనడానికి నగదు తీసుకొచ్చామని, తమను రప్పించిన రియల్ ఎస్టేట్ బ్రోకర్, మరికొంత మంది బలవంతంగా డబ్బు ఉన్న బ్యాగును లాక్కుని పరారయ్యరని బాధితుడు పేర్కొన్నా డు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక సీఐ రామచంద్రరావు తెలిపారు. అయితే ఫిర్యాదులో అనేక అనుమానాలున్నాయని, వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
చైన్ స్నాచింగ్ ఇరానీ గ్యాంగ్ పనే..
సాక్షి, జోగిపేట : జోగిపేట పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్‌లతో బెంబేలెత్తించిన బీదర్ దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుసగా మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్న సంఘటనలు జరుగుతుండడంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. అనుమానంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోని తీసుకొని విచారించగా పట్టణంలో జరిగిన దొంగతనాలను తామే చేశామని, తమతో పాటు మహేష్, మమ్ములు ఉన్నారని ఒప్పుకున్నారు. బీదర్‌లోని ఇరానీ గ్యాంగ్‌గా పోలీసులు నిర్దారణకు వచ్చారు. పట్టణంలో ఇప్పటి వరకు జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో సుమారుగా 35 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దొంగతనాన్ని అంగీకరించిన ఇద్దరు దొంగలు బంగారం తమ వద్ద లేదని, అమ్ముకొని ఖర్చు చేశామని చెప్పినట్లు సమాచారం. నిందితుల వద్ద ఉన్న బైకు, రూ.3 వేలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దొంగల వద్ద నుంచి రికవరీ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డా లాభం లేకుండా పోయింది. అయితే మరో ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుంచి రికవరీ చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. చైన్ స్నాచింగ్ దొంగలు దొరకడంతో స్థానికంగా మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కచ్చితంగా ఇరానీ గ్యాంగ్ పనే.. జోగిపేటలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జోగిపేట సీఐ తిరుపతిరాజు తెలిపారు. సోమవారం సీఐ కార్యాలయంలో ఎస్ఐలు వెంకటరాజాగౌడ్, ప్రభాకర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దొంగతనాలకు పాల్పడింది బీదర్‌లోని ఇరానీ గ్యాంగ్ సభ్యులేనని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ వివరిస్తూ.. జోగిపేటలో ఆదివారం హనుమాన్ చౌరస్తాలో ఎస్ఐ వాహనాలను తనిఖీ చేస్తుండగా బీదర్‌కు చెందిన జాఫర్ అలీ, సత్తాజ్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు బైకుపై అనుమానస్పదంగా కనిపించారని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా జోగిపేట, జహీరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, తాండూర్, బాల్కిలలో ఇప్పటి వరకు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. జనవరిలో జోగిపేట క్లాక్‌టవర్ వద్ద మూడున్నర తులాలు, వడ్డెర బస్తీ వద్ద మూడు తులాలు, మేలో వాసవీనగర్‌లో తొమ్మిదిన్నర తులాల బంగారు గొలుసులు, అదే నెలలో నారాయణఖేడ్‌లో రెండు తులాల బంగారు గొలుసులు దొంగిలించినట్లుగా ఒప్పుకొని దొంగతనం చేసిన ప్రదేశాలను సైతం చూపించారని సీఐ వివరించారు. వట్పల్లి బ్యాంకు వద్ద గత నెల ప్రస్తుతం దొరికిన జాఫర్‌తో పాటు బీదర్‌కు చెందిన నవాబ్లు బ్యాంకు వచ్చిన వ్యక్తికి మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టించి రూ.15 వేలు ఎత్తుకెళ్లారని తెలిపారు. పరారీలో ఉన్న మమ్ము, మహేష్ అలియాస్ సోనియాలను కూడా పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో జోగిపేట, వట్పల్లి ఎస్ఐలు కష్టపడ్డారని, వీరితో పాటు కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్లు రశీద్, ఏసయ్యలు కూడా దొంగలను పట్టుకోవడానికి కృషి చేశారని తెలిపారు. వీరికి అవార్డు ఇచ్చేందుకు ఉన్నత అధికారులకు లెటర్ రాసినట్లు సీఐ తెలిపారు. -
మంగళ సూత్రాలు దోచేస్తారు ఇలా..
-
మంగళ సూత్రాలు దోచేస్తారిలా...
సాక్షి, సైబరాబాద్ : గత అక్టోబర్‌లో సంచలనం సృష్టించిన ఇరానీ గ్యాంగ్ (డైవర్టింగ్ గ్యాంగ్) కేసును తమ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. ఇరానీ గ్యాంగ్ లీడర్ వసీం అబ్బాస్ సిరాజ్, జై కుమార్ రాజక్, నియాజ్ మొహమ్మద్ ఖాన్, జావీద్ బాలీలను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ముంబై, వారణాసి, అలహాబాద్, పట్నాలలో ఈ గ్యాంగ్ నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మొత్తం 11 లక్షల విలువ చేసే 32 తులాల మంగళ సూత్రాలను ఇరానీ ముఠా దోచుకెళ్లిందని.. వారి వద్ద నుంచి 100 శాతం ప్రాపర్టీని రికవరీ చేశామని పేర్కొన్నారు. ఇక ఇరానీ గ్యాంగ్ లీడర్ వసీం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, అతడిపై 58 దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. మంగళ సూత్రాలు దోచేస్తారు ఇలా.. దేవాలయాలకు దగ్గరలో ఉన్న ఒంటరి మహిళలను గ్యాంగ్ టార్గెట్ చేసి ఇరానీ గ్యాంగ్ కొత్త తరహా మెసానికి పాల్పడిందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ‘ మొదట పూజా సామగ్రిని దేవాలయంలో ఇవ్వాలని మహిళలను ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత మంగళసూత్రం పూజా సామాగ్రి పైన పెడితే మంచి జరుగుతుందని నమ్మిస్తారు. ఈ క్రమంలో మహిళలు మెడలో నుంచి మంగళసూత్రం తీసిన వెంటనే వెయ్యి రూపాయల నోటులో మడత పెట్టి పూజా బ్యాగులో పెడతారు. ఆ తర్వాత మహిళలను మాటల్లో పెట్టి వాటిని దోచుకెళ్తారు’ అని సీపీ వెల్లడించారు. -
‘ఇరానీ’
గొలుసు చోరీలు ఈ ముఠాల పనేనా? వరుస సంఘటనలకు కారకులు వీరే? నగరంలోనిగ్యాంగుల పైనా నిఘా రంగంలోకి 15 ప్రత్యేక పోలీసు బృందాలు సిటీబ్యూరో: బ్యాంకులు, వాణిజ్య సముదాయాల వద్ద మాటు వేసి.. మన దృష్టి మరల్చి అందినకాడికి ఎత్తుకుపోయే ఇరానీ గ్యాంగ్‌లు పంథా మార్చాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు... మంగళవారం జంట కమిషనరేట్లలో చోటు చేసుకున్న 11 వరుస గొలుసు చోరీలు వీరి పనేననిచెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సహా ఉత్తరాది నుంచి వస్తున్న ఈ ముఠాలు ఒక్కసారిగా పంజా విసిరి... గుట్టుచప్పుడు కాకుండా తిరిగి వెళ్తున్నట్లు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లకు అవసరమైన సహకారం అందించే వారు స్థానికంగానే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రెండు కమిషనరేట్లకు చెందిన 15 ప్రత్యేక బృందాలు ఇరానీ గ్యాంగ్‌ల కోసం వేటాడుతున్నాయి. వీరి వ్యవహార శైలిపై ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించాయి. మరోపక్క ఈ నేరాల్లో స్థానిక గ్యాంగుల ప్రమేయాన్నీ కొట్టి పారేయలేమని చెబుతున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రెండో రోజైన బుధవారమూ నగరంలో రెండు గొలుసు చోరీలు జరిగాయి. వనస్థలిపురం, మల్కాజ్‌గిరిల్లో దొంగలు పంజా విసిరారు. నగరంలో శాశ్వత షెల్టర్ ఇరానీ గ్యాంగ్‌లు జంట కమిషనరేట్ల పరిధిలో నేరాలకు పాల్పడటం ఏళ్లుగా జరుగుతోంది. ఒకప్పుడు రైల్వేస్టేషన్లకు సమీపంలోని ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ‘అటెన్షన్ డైవర్షన్స్’ (దృష్టి మళ్లించి చోరీల)కు పాల్పడేవారు. ఆ తరవాతి కాలంలో పొరుగు రాష్ట్రాల్లో చోరీ చేసిన వాహనాలతో నగరానికి చేరుకుని... నెంబర్ ప్లేట్లు మార్చడం ద్వారా ఇదే తరహా నేరాలు చేసేవారు. -
మోస్ట్ వాంటెడ్ బాకర్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : మోస్ట్ వాంటెడ్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరానీ గ్యాంగ్ ప్రధాన నిందితుడు బాకర్ అలీని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి మూడున్నర కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే బాకర్ అలీ నుంచి బంగారం కొనుగోలు చేస్తున్న కర్ణాటక వ్యాపారి రాంప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇరానీ గ్యాంగ్‌కు హైదరాబాద్, సైబరాబాద్, మెదక్ పరిధిలో 102 కేసుల్లో సంబంధం ఉందని, మరో ఐదుగుర్ని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని సీపీ తెలిపారు. వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 103 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. పీడీ యాక్ట్ మంచి సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు. 2014లో 220 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా, గత 4 నెలల్లో 120 కేసులు నమోదయ్యాయన్నారు. కాగా చోరీ సొత్తుతో బాకర్ వివిధ ప్రాంతాల్లో జల్సాలు చేసేవాడని సీపీ వెల్లడించారు. -
మోస్ట్ వాంటెడ్ ఇరానీ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్:నగరంలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇరానీ గ్యాంగ్ ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ఇరానీ గ్యాంగ్ ఎట్టకేలకు రాష్ట్ర పోలీసులకు చిక్కింది. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో 3.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇరానీ గ్యాంగ్ పై ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 100 పైగా కేసులు ఉండటం గమనార్హం. -
ఇరానీ గ్యాంగ్ లీడర్ అరెస్టు
- అరకిలో బంగారు నగలు స్వాధీనం రాంగోపాల్‌పేట్: పోలీసులమని చెప్పి అమాయకులను మోసగిస్తూ డబ్బు, బంగారు నగదును తస్కరిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఇరానీ గ్యాంగ్‌కు చెందిన ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. శనివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి, సెంట్రల్‌జోన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మార్కెట్ అదనపు ఇన్స్పెక్టర్ సుధాకర్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన తన్వీర్ హుస్సేన్ అలీ చోటా అలియాస్ షుల్షుల్ (48) కరుడుగట్టిన నేరస్తుడు. ఏడుగురు సభ్యులతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. ఈ గ్యాంగ్‌నే ఇరానీ గ్యాంగ్‌గా పిలుస్తారు. ఈ ముఠా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతోంది. ఈ ముఠాపై నగరంలోని మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 3, చార్మినార్‌లో 3, సుల్తాన్‌బజార్, హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఒక్కో కేసు నమోదై ఉంది. గ్యాంగ్ లీడర్ తన్వీర్ చందానగర్, కూకట్పల్లి, సనత్‌నగర్ పోలీస్స్టేషన్ల పరిధిల్లో చోరీలకు పాల్పడి 2010 సంవత్సరంలో అరెస్టయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ చోరీలు మొదలెట్టాడు. కాగా, పరారీలో ఉన్న ఇతడిపై చందానగర్, కూకట్పల్లి, సనత్‌నగర్ పోలీస్స్టేషన్లలో నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ గ్యాంగ్‌లో ఖాసిం అలీ, గులాం అలీ, నఖ్వీ అలీ, నజీర్‌హుస్సేన్, సర్తాజ్ హుస్సేన్, జాఫర్ హుమాయూన్ పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా... ప్రధాన నిందితుడు తన్వీర్ శనివారం సికింద్రాబాద్ జనరల్ బజార్లో చోరీ సొత్తు విక్రయించేందుకు రాగా పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముఠా నేరాల తీరిదీ.... ముఠా సభ్యుల్లో నలుగురు లేదా ఐదుగురు చోరీకి తమకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అక్కడ తిష్టవేస్తారు. ఆ మార్గంలో ఎవరైనా నగదు, నగల బ్యాగుతో వెళ్తుంటే వీరు ఇట్టే పసిగట్టేస్తారు. వారి వద్దకు వెళ్లి తాము పోలీసులమని, ఇక్కడ మర్డర్ జరిగిందని చెప్తారు. ఒంటిపై ఉన్న నగలు తీసి జాగ్రత్త చేసుకోవాలని సూచించి దృష్టి మరల్చి వాటిని ఎత్తుకెళ్తారు. అలాగే కొన్ని చోట్ల పోలీసులమని బ్యాగులు సోదా చేస్తున్నట్టు నటించి దృష్టి మళ్లించి నగలు, నగదు మాయం చేస్తారు. -
పోలీసులకు చిక్కిన ఇరానీ గ్యాంగ్
వరంగల్ క్రైం : వరంగల్‌లో మహిళల దృష్టి మరల్చి పలుదోపిడీలు చేసిన ఇరానీగ్యాంగ్ ఇటీవల హైదరాబాద్ పోలీసులకు చిక్కింది. రెండు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఈ గ్యాంగ్ సభ్యుల్లోని ముగ్గురిని వారం రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేయడంతో వారు చేసిన నేరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నారుు. మహారాష్ర్ట భీమండి ప్రాంతానికి ఈ ముఠాలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి వీరిపై మొత్తం 18 కేసులు ఉన్నాయి. వరంగల్ నగరంతోపాటు కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్టణం, రాజమండ్రి, కర్నూలు తదితర జిల్లాల్లో వీరిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యా యి. వరంగల్ నగరంలో మూడు కేసుల్లో వీరిని నిందితులుగా గుర్తించారు. ఒంటరి మహిళలే వారి టార్గెట్.. వరంగల్ నగరంలో కొన్నేళ్లుగా దృష్టి మళ్లింపు కేసులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల పేరుతో నమ్మించి.. వారి ఆభరణాలు కాజేయడం వీరి పని. ఒంటరిగా ఆభరణాలతో వెళుతున్న మహిళలను ఈ గ్యాంగ్ టార్గెట్ చే స్తుంది. తాము పోలీసులమని.. ముందు చెకింగ్ జరుగుతుందని లేదా హత్య జరిగిందని చెబుతారు. తర్వాత మెడలోని ఆభరణాలు తీసి సంచిలో వేసుకొండి అని హడావుడి చేస్తారు. సదరు మహిళ భయభ్రాంతులకు లోనైన తర్వాత ముందు మా సార్ ఉన్నాడంటూ అక్కడికి తీసుకువెళ్తారు. అప్పటికే అక్కడ ఉండే మరో వ్యక్తి ముందు గొడవ జరుగుతుందని, మెడలోని బంగారు నగలు తీసి బ్యాగులో వేసుకోమని సలహా ఇస్తాడు. వెంటనే మొదటి వ్యక్తి ఆ మహిళ బంగారు ఆభరణాలు తీయగానే వాటిని ఒక సంచిలో వేసి ఆమెకు చూపెడతాడు. తన వద్ద రాళ్లు నింపిన అచ్చు అలాంటి సంచినే ఆమెకు ఇచ్చి బ్యాగులో పెట్టుకోవాలని సూచిస్తారు. తీరా బాధితురాలు ఇంటికి వెళ్లి చూసుకుంటే అందులో రాళ్లు ఉంటాయి. ఇలాంటి కేసులు వరంగల్, హన్మకొండ, కాజీపేటలో అనేకం జరిగాయి. కొద్ది నెలల క్రితం హన్మకొండ అలంకార్ సెంటర్, వరంగల్ మర్రి వెంకటయ్య కాలనీ, హన్మకొండ సమయ్య కాలనీలో జరిగాయి. కొన్నేళ్లుగా నగరంలో ఇవి జరుగుతూనే ఉన్నాయి. అయితే దృష్టి మరలింపు కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పట్టుబడింది ఇలా.. అత్యంత చాకచక్యంగా వ్యవహరించే వీరిని పోలీసు లు పట్టుకోవడం సవాల్‌గా మారింది. ఓ మహిళ దృష్టిని మరల్చి దోపిడీకి పాల్పడ్డ ఈ ముఠా సభ్యులు బైక్‌లు మారుస్తూ పరారై చివరకు ఒక ప్రదేశంలో కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ సెంటర్లో జరిగిన ఈ తతంగం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డరుుంది. ఆ తర్వాత సెంటర్లలోని సీసీ కెమెరాల పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన అక్కడి పోలీసు లు వారిపై నిఘా పెట్టి పట్టుకున్నారు. మిగతా నలుగురిని కూడా త్వరలోనే పట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.