- అరకిలో బంగారు నగలు స్వాధీనం
రాంగోపాల్‌పేట్: పోలీసులమని చెప్పి అమాయకులను మోసగిస్తూ డబ్బు, బంగారు నగదును తస్కరిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఇరానీ గ్యాంగ్‌కు చెందిన ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్, మార్కెట్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడ్డాడు. శనివారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో డీసీపీ లింబారెడ్డి, సెంట్రల్‌జోన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, మార్కెట్ అదనపు ఇన్‌స్పెక్టర్ సుధాకర్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రం బీదర్‌కు చెందిన తన్వీర్ హుస్సేన్ అలీ చోటా అలియాస్ షుల్‌షుల్ (48) కరుడుగట్టిన నేరస్తుడు. ఏడుగురు సభ్యులతో కలిసి గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు.
ఈ గ్యాంగ్‌నే ఇరానీ గ్యాంగ్‌గా పిలుస్తారు. ఈ ముఠా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతోంది. ఈ ముఠాపై నగరంలోని మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 3, చార్మినార్‌లో 3, సుల్తాన్‌బజార్, హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధుల్లో ఒక్కో కేసు నమోదై ఉంది. గ్యాంగ్ లీడర్ తన్వీర్ చందానగర్, కూకట్‌పల్లి, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిల్లో చోరీలకు పాల్పడి 2010 సంవత్సరంలో అరెస్టయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ చోరీలు మొదలెట్టాడు.
కాగా, పరారీలో ఉన్న ఇతడిపై చందానగర్, కూకట్‌పల్లి, సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్లలో నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ గ్యాంగ్‌లో ఖాసిం అలీ, గులాం అలీ, నఖ్వీ అలీ, నజీర్‌హుస్సేన్, సర్తాజ్ హుస్సేన్, జాఫర్ హుమాయూన్ పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా... ప్రధాన నిందితుడు తన్వీర్ శనివారం సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో చోరీ సొత్తు విక్రయించేందుకు రాగా పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ముఠా నేరాల తీరిదీ....
ముఠా సభ్యుల్లో నలుగురు లేదా ఐదుగురు చోరీకి తమకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అక్కడ తిష్టవేస్తారు. ఆ మార్గంలో ఎవరైనా నగదు, నగల బ్యాగుతో వెళ్తుంటే వీరు ఇట్టే పసిగట్టేస్తారు. వారి వద్దకు వెళ్లి తాము పోలీసులమని, ఇక్కడ మర్డర్ జరిగిందని చెప్తారు. ఒంటిపై ఉన్న నగలు తీసి జాగ్రత్త చేసుకోవాలని సూచించి దృష్టి మరల్చి వాటిని ఎత్తుకెళ్తారు. అలాగే కొన్ని చోట్ల పోలీసులమని బ్యాగులు సోదా చేస్తున్నట్టు నటించి దృష్టి మళ్లించి నగలు, నగదు మాయం చేస్తారు.
ఇరానీ గ్యాంగ్ లీడర్ అరెస్టు
Published Sun, May 3 2015 1:09 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement