‘ఇరానీ’
గొలుసు చోరీలు ఈ ముఠాల పనేనా?
వరుస సంఘటనలకు కారకులు వీరే?
నగరంలోనిగ్యాంగుల పైనా నిఘా
రంగంలోకి 15 ప్రత్యేక పోలీసు బృందాలు
సిటీబ్యూరో: బ్యాంకులు, వాణిజ్య సముదాయాల వద్ద మాటు వేసి.. మన దృష్టి మరల్చి అందినకాడికి ఎత్తుకుపోయే ఇరానీ గ్యాంగ్‌లు పంథా మార్చాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు... మంగళవారం జంట కమిషనరేట్లలో చోటు చేసుకున్న 11 వరుస గొలుసు చోరీలు వీరి పనేననిచెబుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సహా ఉత్తరాది నుంచి వస్తున్న ఈ ముఠాలు ఒక్కసారిగా పంజా విసిరి... గుట్టుచప్పుడు కాకుండా తిరిగి వెళ్తున్నట్లు భావిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లకు అవసరమైన సహకారం అందించే వారు స్థానికంగానే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. రెండు కమిషనరేట్లకు చెందిన 15 ప్రత్యేక బృందాలు ఇరానీ గ్యాంగ్‌ల కోసం వేటాడుతున్నాయి. వీరి వ్యవహార శైలిపై ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించాయి. మరోపక్క ఈ నేరాల్లో స్థానిక గ్యాంగుల ప్రమేయాన్నీ కొట్టి పారేయలేమని చెబుతున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. రెండో రోజైన బుధవారమూ నగరంలో రెండు గొలుసు చోరీలు జరిగాయి. వనస్థలిపురం, మల్కాజ్‌గిరిల్లో దొంగలు పంజా విసిరారు.
నగరంలో శాశ్వత షెల్టర్
ఇరానీ గ్యాంగ్‌లు జంట కమిషనరేట్ల పరిధిలో నేరాలకు పాల్పడటం ఏళ్లుగా జరుగుతోంది. ఒకప్పుడు రైల్వేస్టేషన్లకు సమీపంలోని ప్రాంతాల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ‘అటెన్షన్ డైవర్షన్స్’ (దృష్టి మళ్లించి చోరీల)కు పాల్పడేవారు. ఆ తరవాతి కాలంలో పొరుగు రాష్ట్రాల్లో చోరీ చేసిన వాహనాలతో నగరానికి చేరుకుని... నెంబర్ ప్లేట్లు మార్చడం ద్వారా ఇదే తరహా నేరాలు చేసేవారు.