అమాత్యా.. పవరేదీ?
చేవెళ్ల: ‘ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు ఉంది విద్యుత్ అధికారుల పరిస్థితి. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈర్లపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మంత్రి ప్రారంభించి నెలరోజులవుతున్నా ఇప్పటికీ దిష్టిబొమ్మలా మారింది. ఆపరేటర్లు లేరన్న నెపంతో నెల రోజులనుంచి ఇంకా విద్యుత్ సరఫరాను ఆ సబ్‌స్టేషన్ నుంచి ప్రారంభించలేదు.
వివరాలోకి వెళితే.. ఈ ప్రాంతంలోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయంపైనే అధికంగా ఆధార పడడంతో విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్య తీవ్రంగా ఉంది. లో ఓల్టేజీతో బోరు మోటార్లు కాలిపోతుండడంతో రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎట్టకేలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి, అప్పటి హోంమంత్రి సబితారెడ్డి శంఖుస్థాపన చేశారు.
సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏపీసీపీడీసీఎల్ సాధారణ నిధుల నుంచి 33-11కేవీ సబ్‌స్టేషన్‌కు సుమారుగా రూ.రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. కాగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో పనులను పూర్తి చేశారు. ఆపరేటర్లు, సిబ్బందిని కేటాయించకుండానే మంత్రి మెప్పు పొందడానికి పనులు పూర్తయిన నెలరోజుల తరువాత అక్టోబరు 14వ తేదీన రాష్ట్ర రవాణామంత్రి మహేందర్రెడ్డిచే అట్టహాసంగా ప్రారంభింపజేశారు.
ఉపయోగం ఇదే..
ఈ సబ్‌స్టేషన్‌తో ఈర్లపల్లి, ఎనికెపల్లి, కమ్మెట చౌరస్తా, కమ్మెట, గొల్లగూడ, శంకర్పల్లి మండలంలోని కొత్తపల్లి తదితర గ్రామాలకు విద్యుత్ లో ఓల్టేజీ సమస్య తీరనుంది. ఈ సబ్‌స్టేషన్ ద్వారా సరఫరా అయితే 100 యామ్స్ విద్యుత్ దేవునిఎర్రవల్లి సబ్‌స్టేషన్ నుంచి లోడ్ తగ్గి, విద్యుత్ హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉండదు.
కారణమేమిటంటే..
ఏదైనా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభం కావడానికి ప్రాథమిక అంశాలను పూర్తి చేసుకోవాలి. మంత్రులుగానీ, ఇతర ప్రజాప్రతినిధుగానీ ప్రారంభించిన వెంటనే ఆ యా గ్రామాలకు ఈ సబ్‌స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా వెంటనే ప్రారంభం కావాలి. ఆపరేటర్లను నియమించాలి. కానీ నలుగురు ఆపరేటర్లు, సిబ్బందిని కేటాయించకుండానే విద్యుత్ అధికారుల అనాలోచిత నిర్ణయం, అత్యుత్సాహం మూలంగా మంత్రి మహేందర్‌రెడ్డితో ఈ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. కానీ ఆపరేటర్లను నియమించలేదన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ సరఫరా మాత్రం జరగలేదు. దీంతో ఈ సబ్‌స్టేషన్ సాంకేతికంగా పనులు ప్రారంభం కాలేదు.