isis threats
-
రొనాల్డోకు బుల్ ఫైటర్‌తో భద్రత
మాస్కో: పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన భద్రత కోసం కాకలు తీరిన వీరుల్ని నియమించుకున్నాడు. వీళ్లు ఏ సాదాసీదా సెక్యూరిటీ ఆఫీసర్‌లో లేదంటే సాయుధులైన అధికారులో అనుకుంటే పొరపాటు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఐసిస్ ఉగ్రవాదుల నుంచి అతనికి ముప్పు పొంచి ఉండటంతో ఈ రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ సొంత బలగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరేమో మేటి బుల్ ఫైటర్ నునో మారెకొస్ అయితే మరొకరు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) ఫైటర్ గొంకలో సాల్గడో. అర టన్ను బరువుండే దున్నపోతులతో పోరాడే నునో ఇటీవల జరిగిన చాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లోనూ రొనాల్డోకు రక్షణ కవచంగా వ్యవహరించాడు. ఇతనికి సహాయంగా ఎమ్ఎమ్ఏ ఫైటర్ సాల్గడో ఎప్పటికప్పుడు డేగ కళ్లతో రొనాల్డోను కనిపెట్టుకోనున్నారు. రొనాల్డో, అర్జెంటీనా స్టార్ మెస్సీలపై ఐసిస్ ఉగ్రవాదులు కన్నేశారు. స్టేడియాన్ని మీ రక్తంతో తడిపేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రష్యాలో దిగే పలు సాకర్ జట్లకు పటిష్ట భద్రత కల్పించేందుకు రష్యా సెక్యూరిటీ రేయింబవళ్లు శ్రమించనుంది. -
''వైట్‌హౌస్‌లోనే ఒబామా తల తీసేస్తాం''
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తలను ఆయన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోనే తీసేస్తామంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సభ్యుడొకరు హెచ్చరించాడు. అమెరికాను ముస్లిం దేశంగా మార్చేస్తామని కూడా అన్నాడు. కుర్దిష్ సైనికుడిని అత్యంత క్రూరంగా చంపిన వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యానాలు చేశాడు. 'మోసుల నగరంలో శాంతియుత ముస్లింల మీద బాంబుల వర్షం' అనే శీర్షికతో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇరాక్ లోని మోసుల్ నగరంలో బాంబు దాడుల కారణంగా జరిగిన నష్టాన్ని ప్రధానంగా ఈ వీడియోలో చూపించారు. అమెరికా, ఫ్రాన్స్, బెల్జియం, కుర్దుల మీద దాడి చేస్తామని ముసుగు వేసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాది హెచ్చరించాడు. తమవాళ్లు అమెరికా, కుర్దిష్ అధ్యక్షులను హతమారుస్తారని, యూరోపియన్ దేశాల్లో కారుబాంబుల మోతలు వినిపిస్తాయని కూడా ఆ వీడియోలో హెచ్చరిక జారీ చేశాడు.