ఐవైఆర్ కృష్ణారావు తొలగింపు అప్రజాస్వామికం
ఓటుకు నోటు వీడియో టేపుల ఆధారంతో చంద్రబాబును బర్తరఫ్ చేయాలి
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం(కొత్తపేట) : సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశారనే నెపంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించడం అప్రజాస్వామికమని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. నిజంగా ఇదే కారణమైతే ఓటుకు నోటు వ్యవహారంలో వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రావులపాలెం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయనను కొత్తపేట నియోజకవర్గ బ్రాహ్మణ సంఘ నాయకులు కలిశారు. వారి ఆవేదనను జగ్గిరెడ్డికి వినిపించారు. దీనిపై ఎమ్మెల్యే మట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో బ్రాహ్మణులను ఎంతగానో గౌరవించే సంస్కృతి ఉందన్నారు. నాడు కళా వెంకట్రావు, భాను తిలకం వంటి బ్రాహ్మణ నాయకులను ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బ్రాహ్మణులను కించపర్చేలా ఉందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో జన్మభూమి కమిటీ ప్రమేయం ఉండకూడదన్న ఐవైఆర్ సూచనలు నచ్చక దానిని పచ్చచొక్కా కార్పొరేషన్‌గా మార్చేందుకే ఆయనను తొలగించారన్నారు. కులాలతో ఆడుకోవడం చంద్రబాబు మానుకోవాలన్నారు. తెలంగాణాలో ఉన్న వారిని ఇక్కడి చైర్మన్‌గా చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు బ్రాహ్మణులను బహిరంగ క్షమాపణ కోరి తప్పును సరి చేసుకోవాలన్నారు. అనంతరం స్థానిక జాతీయ రహదారి చెంతన ఉన్న మాజీ మంత్రి కళావెంకట్రావు విగ్రహానికి బ్రహ్మణ సంఘ నాయకులతో కలసి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్, ఎంపీపీ కోట చెల్లయ్య, బ్రాహ్మణ సంఘ నాయకుల చావలి సుబ్బరాయశాస్త్రి, దొంతికుర్తి సాంబమూర్తి, భమిడిపాటి లక్ష్మీనారాయణ, రాణి శర్మ, ఎం.సుబ్బారావు, రాణి రమేష్, ద్రోణంరాజు రంగమన్నాల్, ఎం.కుమార్‌రాజా గోటేటి మార్కండేయులు, కంభంపాటి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.