Jai Bhim
-
హీరోగా నటిస్తున్న జైభీమ్ నటుడు.. ఫస్ట్‌లుక్ రిలీజ్
తమిళసినిమా: జైభీమ్ చిత్రం ఫేమ్ మణికంఠన్ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రానికి గుడ్‌నైట్ అనే పేరును నిర్ణయించారు. వినాయక్ చంద్రశేఖరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని డాలర్ స్టూడియోస్ సంస్థ, ఎంఆర్పీ ఎంటర్టెయిన్మెంట్ సంస్థల అధినేతలు నజ్రేద్ పసిలియాన్, మహేశ్‌రాజ్ పసిలియాన్, యువరాజ్ గణేషన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు ఎస్పీ శక్తివేల్ క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నటి మితారఘునాథ్ నాయకిగా నటించగా రమేష్ తిలక్, దర్శకుడు, నటుడు బాలాజీ శక్తివేల్, బుక్స్, రేచ్చల్ రేబాకా ముఖ్యపాత్రలు పోషించారు. జయంత్ సేతుమాధవన్ చాయాగ్రహణం, శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ షూటింగ్ పూర్తయిందని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసినట్లు చెప్పారు. ఇది గురక ప్రధాన అంశంగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. నిద్రలో ఒక వ్యక్తి గురక ఇతరులను ఏ విధంగా బాధిస్తుంది అన్న అంశాన్ని వినోదాన్ని జోడించి రూపొందించినట్లు తెలిపారు. చిత్రంలో కుటుంబ అనుబంధాలకు ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దీన్ని చక్కని అర్థవంతమైన కథాంశంతో రపొందించినట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి, చిత్ర వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు తెలిపారు. -
మరో సంచలనమైన కొత్త కేసుతో జై భీమ్-2 ..!
-
King Dosa: భర్తను చంపిన మూర్ఖుడిపై పోరాటమే సినిమాగా..
కొన్ని కథలు సినిమా కంటెంట్‌గా మారుతుంటాయి. కొన్నిసార్లు ఆడియొన్స్‌ను మెప్పిస్తుంటాయి. మరికొన్నిసార్లు బోల్తా పడుతుంటాయి. కానీ, వ్యథలు, పోరాటాలతో కూడిన వాస్తవ గాథలు మాత్రం తెరపై భావోద్వేగాలను పండించి ఆడియొన్స్‌ను మెప్పించిన సందర్భాలే ఎక్కువ!. సూర్య ‘జై భీమ్’ ద్వారా అలాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. ఇప్పుడు ‘దోశ కింగ్’ అంటూ మరో వాస్తవ ఘటనను సిల్వర్ స్క్రీన్‌పైకి తేబోతున్నాడు. దోశ కింగ్.. వ్యవస్థలో పెద్ద మనిషిగా చెలామణి అయిన ఓ వ్యక్తికి ఎదురు తిరిగి ఓ ఒంటరి అబల చేసిన పోరాటం. జాతకాల పిచ్చితో తన జీవితాన్ని నాశనం చేసిన ఓ మూర్ఖుడిపై సాధించిన విజయం. పీ రాజగోపాల్.. శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్ల వ్యవస్థాపకుడు. తమిళనాడు ట్యూటికొరిన్ జిల్లాలో ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. రాజగోపాల్ తండ్రి ఉల్లిపాయల వ్యాపారి.. తల్లి గృహిణి. వ్యవసాయంలో కూడబెట్టిన తల్లిదండ్రుల డబ్బు తీసుకుని మద్రాస్ రైలెక్కాడు. కేకే నగర్లో పచారీ కొట్టుతో మొదలుపెట్టి.. చిరు వ్యాపారిగా ఎదిగాడు. శరవణ భవన్ పేరిట ఓ రెస్టారెంట్ మొదలుపెట్టి.. 22 దేశాల్లో 111 రెస్టారెంట్లున్న ఫ్రాంచైజీగా దానిని విస్తరించాడు. హోటల్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగిన రాజగోపాల్ అంటే అందరికీ గౌరవమే అయినా.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదం.. విమర్శల మయమే!. జాతకాల పిచ్చితో ఓ జ్యోతిష్యుడు చెప్పాడని.. మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. అదీ తన దగ్గర అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న రామసామి చిన్న కూతురిని పెళ్లాడాలని ప్రయత్నించాడు. అయితే అప్పటికే జీవజ్యోతికి పెళ్లి అయ్యింది. అందుకే రాజగోపాల్ ప్రతిపాదనను ఆమె ఛీ కొట్టింది. దీంతో పగ పెంచుకున్న రాజగోపాల్.. బెదిరింపులు, దాడులు, చేతబడి లాంటి పిచ్చి ప్రయత్నాలెన్నో చేశాడు. అయినా జీవజ్యోతి లొంగలేదు. దీంతో.. ఆ భర్త అడ్డు తొలగించుకుని వివాహం చేసుకోవాలనుకున్నాడు. 2001 అక్టోబర్ 26న బలవంతంగా కిడ్నాప్ చేయించి మరీ జీవజ్యోతి భర్త ప్రిన్స్ శాంతకుమార్‌ను హత్య చేయించాడు. జీవజ్యోతిని లైంగిక వేధించడం, హత్యా నేరారోపణలపై దోశ కింగ్‌గా పేరున్న రాజగోపాల్ పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ నేరారోపణలతో శరవణ భవన్ పేరు ప్రతిష్టలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. మద్రాస్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే అనారోగ్యంతో బెయిల్ మీద కొన్నాళ్లూ బయట తిరిగాడు. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో.. తిరిగి 2019లో పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది. పోలీసులకు లొంగిపోయిన నాలుగు రోజులకే గుండెపోటు.. ఆపై మరో ఐదు రోజులకే చికిత్స పొందుతూ కన్నుమూశాడు దోశ కింగ్ రాజగోపాల్. అతను (రాజగోపాల్) తన ఉద్యోగులతో సన్నిహితంగా ఉండేవాడు. ఆ కారణంతో నా పోరాటాన్ని చాలామంది తప్పుబట్టారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. అందుకే సినిమా తెర మీదకు రావాల్సిన అవసరం ఉందని జీవజ్యోతి చెబుతోంది. ప్రస్తుతం ఆమె తంజావూర్లో ఓ టైలరింగ్ యూనిట్ నడిపిస్తూ.. తల్లి నడిపిస్తున్న హోటల్ వ్యవహరాలను చూసుకుంటోంది. ఆమె పోరాటమే ఇప్పుడు సినిమాగా రాబోతోంది. -
బర్త్‌డే స్పెషల్: సూర్య ఫ్యాన్స్‌కు క్రేజీ సర్ప్రైజ్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు గుడ్‌న్యూస్. ఆయన నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ఇప్పుడు అభిమానుల కోసం థియేటర్లో విడుదల కానున్నాయి. లాక్డౌన్ టైమ్‌లో డైరెక్ట్‌గా డిజిటల్ రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా చిత్రం సూర్య కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఇక గతడాది సూర్య నటించి మరో చిత్రం ‘జై భీమ్’ సైతం ఓటీటీలో విడుదలైన దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా తమిళనాడులోని థియేటర్స్‌లో జులై 22 నుంచి రెండు రోజుల వరకు ప్రత్యేకంగా ఈ చిత్రాలు స్క్రీనింగ్ కానున్నాయి.దీంతో పాటు తమిళనాడు వ్యాప్తంగా సూర్య అభిమానులు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
జై భీమ్ నినాదకర్త హర్దాస్
అంబేడ్కర్‌వాదులు ఒకరినొకరు పలకరించుకోవడానికి జై భీమ్ అనడం పరిపాటి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో అనేక నినాదాలు పౌరుల్లో దేశభక్తిని పెంచాయి. వాటిల్లో జై హింద్ ఒకటి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీన్ని విరివిగా ఉపయోగించారు. ఈ నినాదాన్ని నేతాజీ అనుచరుడు అబిద్ హసన్ సఫ్రానీ సృష్టించారు. తొలుత దీన్ని భారతదేశానికి విజయం కలగాలి అనే అర్థంలో ఉపయోగించేవారు. ఇప్పుడు దేశానికి వందనం అనే భావంలో ఉపయోగిస్తున్నారు. అలాగే జై భీమ్ నినాదం అంబేడ్కర్ జీవితంతో ముడిపడి ఉన్నప్పటికీ, దీన్ని ఆయన అనుచరుడు బాబు హర్దాస్(హర్దాస్ లక్ష్మణ్ రావు నగ్రాలే) సృష్టించారు. ఈయన 1904 జనవరి 6న బ్రిటిష్ ఇండియాలో జన్మిం చారు. వీర్ బాలక్, మండల్ మహాత్మా, సాంగ్స్ ఆఫ్ ద మార్కెట్ వంటి రచనలు చేశారు. చిన్న తనం నుంచే విగ్రహారాధనను ఖండించారు. మూఢ నమ్మకాలను వ్యతిరేకించారు. నిరక్షరా స్యత నిర్మూలన కోసం రాత్రి బడులు నడిపారు. 1928లో ఆయన మొదటిసారి అంబేడ్కర్‌ను కలుసుకున్నారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. పార్టీ సభ్యులు ఒకరినొకరు పలకరించుకోవడానికి ఏదైనా మంచి నినాదం ఉంటే బావుంటుందని ఆలోచించారు. అలా 1935లో జై భీమ్ అని ప్రయో గించారు. చీకటి నుంచి వెలుగులోకి రావడం... అంబేడ్కర్‌కు విజయం కలగాలి... అని దీనికి అర్థం చెప్పొచ్చు. ఇది అణగారిన వర్గాల హక్కుల సాధనకు ఒక అక్షర ఆయుధంగా ఉపకరిస్తోందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బాబు హర్దాస్ చిరుప్రాయంలోనే 1939 జనవరి 12న తుదిశ్వాస విడిచారు. ఆయన నినాదం మాత్రం దేశ మంతటా మారుమోగుతూనే ఉంది. – ఎం. రాంప్రదీప్, తిరువూరు (జనవరి 6న బాబు హర్దాస్ జయంతి)