
అంబేడ్కర్‌వాదులు ఒకరినొకరు పలకరించుకోవడానికి జై భీమ్ అనడం పరిపాటి. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో అనేక నినాదాలు పౌరుల్లో దేశభక్తిని పెంచాయి. వాటిల్లో జై హింద్ ఒకటి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీన్ని విరివిగా ఉపయోగించారు. ఈ నినాదాన్ని నేతాజీ అనుచరుడు అబిద్ హసన్ సఫ్రానీ సృష్టించారు. తొలుత దీన్ని భారతదేశానికి విజయం కలగాలి అనే అర్థంలో ఉపయోగించేవారు. ఇప్పుడు దేశానికి వందనం అనే భావంలో ఉపయోగిస్తున్నారు.
అలాగే జై భీమ్ నినాదం అంబేడ్కర్ జీవితంతో ముడిపడి ఉన్నప్పటికీ, దీన్ని ఆయన అనుచరుడు బాబు హర్‌దాస్(హర్‌దాస్ లక్ష్మణ్ రావు నగ్రాలే) సృష్టించారు. ఈయన 1904 జనవరి 6న బ్రిటిష్ ఇండియాలో జన్మిం చారు. వీర్ బాలక్, మండల్ మహాత్మా, సాంగ్స్ ఆఫ్ ద మార్కెట్ వంటి రచనలు చేశారు. చిన్న తనం నుంచే విగ్రహారాధనను ఖండించారు. మూఢ నమ్మకాలను వ్యతిరేకించారు. నిరక్షరా స్యత నిర్మూలన కోసం రాత్రి బడులు నడిపారు.
1928లో ఆయన మొదటిసారి అంబేడ్కర్‌ను కలుసుకున్నారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో చురుగ్గా పనిచేశారు. పార్టీ సభ్యులు ఒకరినొకరు పలకరించుకోవడానికి ఏదైనా మంచి నినాదం ఉంటే బావుంటుందని ఆలోచించారు. అలా 1935లో జై భీమ్ అని ప్రయో గించారు. చీకటి నుంచి వెలుగులోకి రావడం... అంబేడ్కర్‌కు విజయం కలగాలి... అని దీనికి అర్థం చెప్పొచ్చు. ఇది అణగారిన వర్గాల హక్కుల సాధనకు ఒక అక్షర ఆయుధంగా ఉపకరిస్తోందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బాబు హర్‌దాస్ చిరుప్రాయంలోనే 1939 జనవరి 12న తుదిశ్వాస విడిచారు. ఆయన నినాదం మాత్రం దేశ మంతటా మారుమోగుతూనే ఉంది.
– ఎం. రాంప్రదీప్, తిరువూరు
(జనవరి 6న బాబు హర్‌దాస్ జయంతి)