Janashakti leaders
-
జనశక్తి నేతలు రాజన్న, అమర్ విడుదల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా రెండు రోజుల సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారు. సుమారు 3గంటల పాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వారిలో కూర రాజన్న, అమర్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండు రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత వీరి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆయుధాలు లభించలేదని తెలిసింది. అమర్‌కు సంబంధించిన బ్యాగులో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారా.. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైనా కుట్ర పన్నారా అనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్యాయంగా అరెస్టు చేశారు: రాజన్న, అమర్ దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని విమర్శించారు. శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టారని, ఖమ్మంలో జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తమ సంఘం నిషే«ధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారో పోలీసులకే తెలియాలన్నారు. -
పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేతలు!
సిరిసిల్ల: సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీ అగ్రనేతలు కూర రాజన్న అలియాస్ రాజేందర్, కూర దేవేందర్ అలియాస్ అమర్, వెంకటేశ్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు విమలక్క, కొమురన్న, సంతోష్ గురువారం ప్రకటించారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తున్న రాజన్న, అతనితోపాటు ఉన్న వెంకటేశ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అమర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 12 రకాల అనారోగ్య సమస్యలతో ఉన్న కూర రాజన్నతోపాటు అతని సహాయకుడు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. పోలీసులు వెంటనే వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఏమైనా కేసులుంటే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. కాగా, కూర రాజన్న, అమర్, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం సమీపంలోని ఒక తోటలో విచారిస్తున్నట్లు తెలిసింది. -
జనశక్తి రాష్ట్ర నేత నర్సింహ్మ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర నేత, ఒడిశా రాష్ట్ర మాజీ కార్య దర్శి బొమ్మని నర్సింహ్మ అలియాస్ ఆనంద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఉంటున్న భార్యా పిల్లల వద్దకు వెళ్లారు. నర్సింహ్మను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతోపాటుగా ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గతంలోనూ సిరిసిల్ల పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి వారం రోజులు హింసించి గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు చూపించారని, ఇప్పుడు కూడా సిరిసిల్ల పోలీసులే ఆయనను అరెస్టు చేసినట్లు భార్య పద్మ ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన నర్సింహ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఆయనను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు ఓ ప్రకటన లో డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంకు చెందిన బొమ్మని చంద్రయ్య–పెంటమ్మ దంపతులకు తొలి సంతానంగా నర్సింహ్మ(59) జన్మించారు. వరంగల్‌లో విద్యాభ్యాసం చేసే క్రమంలో వైద్య విద్యలో వచ్చిన సీటును వదులుకుని ఉద్యమాలకు ఆకర్షితుడై అడవిబాటపట్టారు. -
సెటిల్మెంట్ కోసం వచ్చి.. పోలీసులకు చిక్కి..
- ఇద్దరు జనశక్తి నేతల అరెస్ట్ - పార్టీ పునర్నిర్మాణ యోచనలో సభ్యులు సిద్దిపేట రూరల్: జనశక్తి పునర్నిర్మాణంలో భాగంగా ఇద్దరు సభ్యులు ఓ సెటిల్ మెంట్లో పట్టుబడ్డారు. సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి ఆదివారం కేసు వివరాలను వెల్లడించారు. చిన్నకోడూరు మండలం గంగాపూర్ వాసి మూర్తి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ యాదన్న జనశక్తి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. పార్టీ వ్యవస్థాపకుడు కూర రాజన్న అలియాస్ కేఆర్, సభ్యులు కూర దేవేందర్ అలియాస్ అమర్, నర్సిరెడ్డి అలియాస్ విశ్వనాథం, భీంభరత్ పార్టీని పునర్నిర్మాణం చేయడానికి 60 మందితో చేవెళ్లలో జూన్ 24 నుంచి 26 వరకు ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దీనికి అవసరమైన ఆయుధాల కోసం డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి వాసి మన్వాడ వసంత్ గతంలో పార్టీ నేత. యాదన్న అతన్ని కలసి కొంత డబ్బు ఇవ్వగా ఒక పిస్తోల్, ఐదు రౌండ్ల బుల్లెట్లు ఇచ్చాడు. వీటితో దళాన్ని ఏర్పాటు చేసి, ప్రజాపోరాటం చేయాలని నిర్ణయించారు. యాదన్నకు అతని సోదరుడు అశోక్‌రెడ్డికి మధ్య భూ వివాదం నెలకొంది. యాదన్న వసంత్‌ను కలసి మరో పిస్తోలు, ఐదు రౌండ్ల బుల్లెట్లు కొనుగోలు చేశాడు. ఇది తెలుసుకున్న అశోక్‌రెడ్డి.. తనకు యాదన్న నుంచి ప్రాణ భయం ఉందని పోలీసులను కలిశాడు. ఈ నెల 5న గంగాపూర్ వచ్చిన యాదన్న, వసంత్‌లను పోలీసులు పట్టుకున్నారు. వీరు గతంలో దేవుని పల్లి, దోమకొండ, మాచారెడ్డిలలో కూడా బెదిరిం పులకు పాల్పడినట్లు తెలిపారు. వీరి వద్ద ఒక పిస్టల్, ఐదు రౌండ్లు, ఒక రివాల్వర్, 11 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.