janata darbhar
-
ఇక జనతా దర్బార్ ఉండదు
ఆన్లైన్లో సమస్యలు చెప్పుకోవచ్చు: కేజ్రీవాల్ హాట్లైన్లను ఏర్పాటుచేస్తాం సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారినుంచి వినతిపత్రాలు స్వీకరించే ఉద్దేశంతో ప్రారంభించిన జనతాదర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇకపై జనతాదర్బార్ ఉండబోదని, ఆన్లైన్లో కానీ, హెల్ప్‌లైన్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను త్వరలో ప్రకటిస్తారని, సెక్రటేరియట్లో కూడా త్వరలో ఒక హెల్ప్బాక్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఊహించని స్థాయిలో ప్రజలు రావడం, నిర్వహణ లోపంతో కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ సచివాలయ ఆవరణలో మొట్టమొదటిసారిగా శనివారం నిర్వహించిన జనతా దర్బార్ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. పటిష్ట ఏర్పాట్లతో మళ్లీ జనతా దర్బార్‌ను ఏర్పాటుచేస్తామని అప్పుడు ప్రకటించిన ముఖ్యమంత్రి.. తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తనను ప్రత్యక్షంగా కలవాలనుకునేవారి కోసం వారంలో ఒక రోజు రెండు నుంచి మూడుగంటల సమయం కేటాయిస్తానన్నారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతపై, వాటర్ ట్యాంకర్ మాఫియా, టెండర్ మాఫియా నుంచి ముప్పు ఉందన్న ఐబీ నివేదికలపై విలేకరులు ప్రశ్నించగా ‘నాకు భద్రత అవసరం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ముఖ్యమంత్రులకు, మంత్రులకు భద్రత కల్పించడం ముఖ్యం కాదు. సామాన్యులకు రక్షణ కల్పించాలి’ అన్నారు. ఆప్‌కు జైకొట్టిన మేధా పాట్కర్ ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 200 ప్రజా సంఘాలతో ఏర్పడిన ‘నేషనల్ అలయెన్స్ ఫర్ పీపు ల్స్ మూవ్మెంట్స్’ కూటమికి మేధాపాట్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తారా అని అడగ్గా.. ‘నేను ఇప్పుడు దేన్నీ తోసిపుచ్చలేను. రాజకీయాలు అంటరానివని మేం భావించడం లేదు. మా ఆలోచనలు ఆ పార్టీ ఆలోచనలకు సారూప్యత ఉంది’ అని ఆమె చెప్పారు. ‘బీజేపీ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలి. మోడీకి బదులు గోవా సీఎం మనోహర్ పారికర్‌ను ప్రధాని బరిలో దించాలి’ అని ఆప్ సూచించింది. -
భద్రత వద్దేవద్దని పునరుద్ఘాటించిన కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: చేతిపై జీవనరేఖ చాలా పొడవుగా ఉందని, తన ప్రాణాలకు ఎలాంటి ముప్పులేదని, తనకు భద్రత అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోమారు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేజ్రీవాల్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... తనకు భద్రత అవసరం లేదన్నారు. కేజ్రీవాల్ నివాసం యూపీలోని ఘజియాబాద్‌లో ఉన్నందువల్ల ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం యూపీ సర్కారుకు లేఖ రాయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రత సమకూర్చింది. అయి తే కేజ్రీవాల్ దీనిపై ప్రతిస్పందిస్తూ తనకు భద్రత అవసరం లేదని చెప్పారు. తన చేతిలో జీవన రేఖ చా లా పొడవుగా ఉందని ఆయన నవ్వుతూ అన్నారు. ప్రజలతో మమేకం కావడానికే రోడ్లపై జనతా దర్బార్... ప్రజలతో బాంధవ్యాన్ని ఏర్పరచుకోవడం కోసమే రోడ్డుపై జనతా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. ప్రజల మనసులలో ఎన్నో గోడలున్నాయని, పెద్ద బంగ్లా, పెద్ద వాహనం, ఎర్రబుగ్గ చూసి వారు వెనుకంజ వేస్తారని, సచివాలయం వంటి సువిశాలమైన ప్రభుత్వ కార్యాలయంలోకి రావడానికి భయపడతారని, జనాల మనసుల్లోని ఈ అడ్డుగోడల హద్దును తొలగించడం కోసమే రోడ్డుపై ప్రజలను కలవాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదమే..! ఆప్ ప్రభుత్వం అవినీతి వ్యతిరేక చర్యలు చేపట్టడంలో చిన్న చేపలపై దృష్టి సారిస్తూ పెద్ద చేపలను ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ఉన్న అవినీతి ఆరోపణల విషయంలో మిన్నకుండి పోతుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. అవినీతి విషయంలో ఎవరినీ ఉపేక్షించబోమని ఈ విషయంలోనూ చర్యలు చేపడతామని చెప్పారు. విద్యుత్తు కంపెనీలు తమ ఆర్థిక వ్యవహారాలను తామే చక్కదిద్దుకోవాలన్నారు. ఆప్‌పై కిరణ్‌బేడీ విమర్శలు... జన్‌లోక్‌పాల్ ఉద్యమ సమయంలో కేజ్రీవాల్‌తో కలసి పనిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీపై కిరణ్ బేడీ సంధించారు. ఆప్ ప్రభుత్వం అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ ప్రారంభించడంతోపాటు షీలాదీక్షిత్‌ను తప్పుపట్టిన లోకాయుక్తా నివేదికపై ఢిల్లీ అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్ జనతా దర్బార్
ఢిల్లీ: పాలనలో సమూల మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో గద్దెనెక్కిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జనతా దర్బార్ ఈ రోజు మొదలైంది. పలువురు నేతలతో ఆయన వరుసగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీ వాల్ మాట్లాడుతూ వారం, 10 రోజుల్లో అన్ని సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవస్థ మొత్తాన్ని గాడిలో పెడతానన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ జీవితంలో ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వను, తీసుకోను అని అందరూ శపథం చేయాలని కోరిన విషయం తెలిసిందే. వ్యవస్థను సమూలంగా మార్చాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు.