కేసీఆర్ పాలనతో ప్రజలు విస్తుపోతున్నారు
బిల్డు కార్మికుల రోదన సీఎంకు పట్టడం లేదు
టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలా ‘మిషన్ కాకతీయ’
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి
కాజీపేట రూరల్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనతో ప్రజలు విస్తుపోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వరంగల్ జిల్లా పరిశీలకుడు కొండ రాఘవరెడ్డి అన్నారు. హన్మకొండలో సోమవారం జరిగిన జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కొండ రాఘవరెడ్డి మాట్లాడారు.
ఇటీవల జిల్లాలో కురిసిన అకాలవర్షానికి నష్టపోయిన మామిడి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటల రైతులకు ఇన్‌పుట్‌గా సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకోవద్దని... ఏ పంటకు ఎంత నష్టం జరిగిందో పూర్తి స్థాయిలో అంచనా వేసి పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ జిల్లాకు వెళ్లిన అజాంజాహీ మిల్లు, ఆల్విన్, హెచ్ఎంటి, నిజాం షుగర్ ప్యాక్టరీలను ప్రస్తావిస్తూ ప్రజలు, కార్మికుల పక్షపాతిగా ఉన్నట్లుగా నటిస్తున్నారని విమర్శించారు.
కమలాపురంలోని బిల్టు కార్మికుల రోదన కేసీఆర్ వినడం లేదని.. సుమారు 30 వేల మంది జీవనోపాధి కోల్పోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తలుచుకుంటే బిల్డు సంస్థను తెరిపించవచ్చన్నారు. బంగారు తెలంగాణ జపం చేస్తున్న కేసీఆర్ ఇతర రాజకీయ పార్టీల నుంచి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్పించుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ వాస్తవాలకు దగ్గర లేని మాటలు మాట్లాడుతున్నారని, 11 నెలలుగా ఆయన చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమానికి స్పష్టత లేదన్నారు. కేసీఆర్ దుడుదుడుకుల నిర్ణయాల వల్ల చివరకుహైకోర్టు కూడా డజన్ కేసుల్లో అసంతృప్తి వ్యక్తపరిచిందన్నారు.
మిషన్ కాకతీయ పథకం మంచిదేనని, అయితే, చెరువులను ఆక్రమించి 100 ఎకరాల చెరువులను 30 ఎకరాలుగా చేయడం ఎంత వరకు సరైందని ప్రశ్నించారు. మిషన్ కాకతీయలో తప్పులు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పిన ప్రభుత్వం... చివరకు మిషన్ కాకతీయను టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మార్చిందని విమర్శించారు. కార్యకర్తలు, ఎమ్మెల్యేలకు కాంట్రాక్ట్‌ల నుంచి పర్సంటేజీలకు పరిమితమయ్యూరని ధ్వజమెత్తారు.
మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, 104, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తు ఆయన చేపట్టిన ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మునిగాల విలియం, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివకుమార్, యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరచారి పాల్గొన్నారు.