Jantar-Mantar
-
ఉద్రిక్తంగా మారిన బీసీల మహాధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ బీసీల మహాధర్నాతో రెండోరోజు ఉద్రిక్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణల నేతృత్వంలో చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో బీసీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే, అందులో బీసీ ఉద్యోగులు 4.62 లక్షలు మాత్రమే ఉన్నారని తెలిపారు. దేశంలో బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ప్రదర్శనలో కోల జనార్ధన్, కర్రి వేణు మాధవ్, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద నిరసన
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు కోరుతూ కార్మిక సంఘాల నేతలు బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరనున్నారు. ఇప్పటికే ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి లేఖలు కూడా రాశారు. స్టీల్‌ప్లాంట్ వ్యవహారంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేంకగా ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలపుతాం’’ అన్నారు. -
హత్రాస్ దోషులను ఉరి తీయాలి: సీఎం
న్యూఢిల్లీ: హత్రాస్ ఘటనలో నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, వారి మద్దతుదారులు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హత్రాస్ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నాయకులతో సహా వందలాది మంది ప్రజలు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘మేమంతా ఎంతో బాధతో ఇక్కడ సమావేశం అయ్యాం. మా కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. దోషులను వీలైనంత త్వరగా ఉరి తీయాలని యూపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అన్నారు. (చదవండి: ‘వారు రైతుల పక్షాన పోరాడారు’) ఇక భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్.. ‘హత్రాస్‌ను సందర్శిస్తాను. యూపీ సీఎం రాజీనామా చేసేవరకు నా పోరాటం కొనసాగుతుంది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు నేను వెనకడుగు వేయను. ఈ ఘటనను పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టును కోరుతున్నాను’ అన్నారు. సూర్యాస్తమయం తర్వాత నిరసనకారులు కొవ్వొత్తులను వెలిగించి చీకటిలో పట్టుకుని నిలబడ్డారు. -
‘ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే శక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉందని ఆ పార్టీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ వల్లే చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని తెలిపారు. హోదా కోసం జననేత వైఎస్ జగన్ అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. కేవలం పోలవరానికి ఒక్క గేటు పెట్టి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వయస్సు పై బడ్డా టీడీపీ నాయకుడు జేసీ దివాకర్‌రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. దివాకర్‌రెడ్డి వైఎస్ జగన్‌ను విమర్శించి మన్నలను పొందాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘40 ఏళ్ల అనుభవం... అబద్ధాలు చెప్పడానికేనా’ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పక్కబెట్టిన చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపనలు చేస్తూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణాల గ్రాఫిక్స్ చూపిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై చీటింగ్ కేసు పెట్టాలని అన్నారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. వైఎస్ జగన్‌పై అవాకులు, చవాకులు పేలుతున్న జేసీ దివాకర్‌రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. బ్యాకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారికి చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘కేవలం పునాది వేస్తారు.. నమ్మించేస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. అన్నింటికి కేవలం పునాది మాత్రమే వేసి బాబు ప్రజలను నమ్మిస్తారని అన్నారు. రాజధానిలో అన్నీ తాత్కాలిక భవనాలే అని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్సీపీ గురువారం చేపట్టిన ‘వంచనపై గర్జన దీక్ష’ లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, భారతీయ జనతాపార్టీలు ఆంధ్రప్రదేశ్‌ని ఏవిధంగా మోసం చేశారో ప్రజలకు తెలియజెప్పడానికే ‘వంచనపై గర్జన దీక్ష’ చేపట్టామని అన్నారు. విభజన హామీలను తీసుకురాలేని అసమర్థుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. బీజేపీతో ఉన్నప్పుడు కనీసం కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా బాబు మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించే ఉద్దేశం చంద్రబాబుకు లేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోనుందనే కాంగ్రెస్‌తో జతకట్టారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటుకు వినిపించేందుకే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పార్లమెంటుకు వినిపించాలనే వంచనపై గర్జన దీక్ష చేపట్టామని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. హోదా కోసం మొదటినుంచీ పోరాడుతోంది తమ పార్టీయేనని అన్నారు. హోదా సాధనే లక్ష్యంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పనిచేస్తున్నారని తెలిపారు. తమ పార్టీకి చెందిన ఐదు మంది ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని చెప్పారు. ఏపీకీ అన్యాయం చేసిన వారిలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాన్ ముద్దాయిలని అన్నారు. -
పెళ్లంటూ చేసుకుంటే మోదీనే..
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లంటూ చేసుకుంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీనే చేసుకుంటానని ఓ మహిళ అంటుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెంది శాంతి శర్మ అనే 40 ఏళ్ల మహిళ గత నెల రోజులుగా(సెప్టెంబర్ 8 నుంచి) దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తోంది. మోదీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనను మోదీ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందని మీడియాకు ఆమె తెలిపింది. అంతేకాదు ఇక్కడి నుంచి తనను పంపిస్తే నేరుగా ఆయన ఇంటి ముందు ఆందోళన దిగుతానని చెప్పింది. శాంతి శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు 1989లో వివాహం జరిగింది. పెళ్లైయిన సంవత్సరానికే ఆమెను భర్త విడిచిపెట్టాడు. ఆ తరువాత ఆమెను చేసుకుంటామని చాలా మంది ముందుకొచ్చినా నిరాకరించింది. అయితే ప్రస్తుతం తాను నరేంద్ర మోదీని పెళ్లి చేసుకుని ఆయనకు సేవలు చేయాలని నిర్ణయించుకున్నానని.. ప్రధాని సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. మోదీ తనను చేసుకుంటే తన ఆస్తి మొత్తం అమ్మి రెండు కోట్ల రుపాయలను కట్నంగా ఇస్తానని చెబుతోంది. ఇదివరకే మోదీకి యశోదా బెన్‌తో పెళ్లి అయిన విషయం తెలిసిందే. పెళ్లైయిన కొద్ది కాలం నుంచే వారు వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం యశోదా బెన్ గుజరాత్‌లోని తన సొంత గ్రామంలోనే ఉంటున్నారు. -
దేవేగౌడ ఆమరణ దీక్ష
‘జంతర్-మంతర్’లో ప్రారంభమైన దీక్ష. బెంగళూరు: కర్ణాటకతోపాటు దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో చర్చించేందుకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద సోమవారం ఉదయం నుంచి దేవేగౌడ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవేగౌడ మాట్లాడుతూ, కర్ణాటకలో రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కర్ణాటకలో మాత్రమే కాక దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు అటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ పరిష్కారం లభించడం లేదని మండిపడ్డారు. ఈ కారణంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక కర్ణాటక విషయానికి వస్తే జాతీయ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులపై వడ్డీని మాఫీ చేయాలని కోరారు. కర్ణాటకలో చెరకు, దానిమ్మ, ద్రాక్ష, పట్టు రైతులు సరైన మద్దతు ధర లభించక తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాలు అందజేయాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని అన్నారు. అందుకే ఈ విషయాలన్నింటిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిపేందుకుగాను సమయం కేటాయించాలని కోరారు. ఈ విషయంపై స్పీకర్ స్పందించే వరకు తన దీక్షను విరమించబోనని పేర్కొన్నారు. ఇక దేవేగౌడ చేపట్టిన ఆమరణ దీక్షకు జేడీయూ నేత శరద్ యాదవ్‌తోపాటు వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా తదితరులు మద్దతు తెలిపారు. దీక్షా స్థలి వద్దకు చేరుకున్న నేతలు దేవేగౌడకు తమ మద్దతు తెలియజేశారు. ఈ దీక్షా కార్యక్రమంలో జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామితోపాటు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు.