జనవరి 23వరకు గడువు ఇచ్చిన రాష్ట్రపతి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2013 (తెలంగాణ ముసాయిదా బిల్లు)పై అభిప్రాయం తెలియజేయడానికి రాష్ట్ర శాసనసభకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జనవరి 23 వరకు గడువు ఇచ్చారు. ఈ బిల్లు రాష్ట్రపతి నుంచి కేంద్ర హోంశాఖకు చేరింది. ఈ ముసాయిదా బిల్లు ఈ సాయంత్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి చేరుతుంది.
గతంలో ఇతర రాష్ట్రాలలో విభజన జరిగిన సమయంలో అనుసరించిన పద్దతుల ప్రకారమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అందజేస్తారు. ఆయన దానిని పరిశీలించిన తరువాత గవర్నర్ నరసింహన్కు పంపుతారు. గవర్నర్ పరిశీలించిన తరువాత బిల్లును శాసనసభ కార్యదర్శి ఎస్.రాజా సదారాంకు పంపుతారు. అక్కడ నుంచి బిల్లు శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ వద్దకు చేరుతుంది. ఈ క్రమంలో బిల్లు పరిశీలనకు ఒక్కొక్కరు ఒక్కో రోజు సమయం తీసుకోవచ్చు. అయితే మన రాష్ట్రంలో మాత్రం బిల్లు సోమవారానికి శాసనసభకు చేరే అవకాశం ఉంది.
ఇంత తతంగం జరిగినా అది కేవలం అభిప్రాయంగానే పరిగణిస్తారు. శాసనసభ అభిప్రాయానికి ఎటువంటి విలువ ఉండదు. కేంద్రం తన ఇష్టమొచ్చిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.