jawahar nagar project
-
‘స్వగృహ’ క్లియరెన్స్ సేల్!
సాక్షి, హైదరాబాద్: క్లియరెన్స్ సేల్... అమ్ముడు కాకుండా మిగిలిపోయిన లేదా లోపాలున్న వస్తువులను వదిలించుకునే క్రమంలో దుకాణదారులు ధర భారీగా తగ్గించి అమ్మెయ్యడాన్నే క్లియరెన్స్ సేల్‌గా చెబుతూ ఉంటారు. ఇదేమాదిరిగా ప్రభుత్వం ఇప్పుడు ‘స్వగృహ’ ఇళ్లను క్లియరెన్స్ సేల్కు అమ్మేందుకు సిద్ధమవుతోంది. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నగరంలో బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్‌ల్లో దాదాపు 7 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అయితే, నిధుల కొరతతో వీటి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఇవి ఖాళీగా ఉండిపోయాయి. మరికొంత కాలం ఈ ఇళ్లు ఇలాగే ఉంటే ‘పాడుబడ్డ నిర్మాణాల’నే పేరుపడితే జనం కొనరని, అప్పుడు ఏకంగా రూ. వేయి కోట్లు నష్టం రావచ్చని అంతర్జాతీయ వ్యాల్యూయేటర్స్ హెచ్చరించారు. దీంతో ఈ ఇళ్ల ధరను 25 % తగ్గించి అమ్మేయాలని స్వగృహ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 2,800 ఫ్లాట్లతో రూపుదిద్దుకుంటున్న జవహర్‌నగర్ ప్రాజెక్టుపై కార్పొరేషన్ ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.400 కోట్లు. ఇది డిమాండ్ లేని ప్రాజెక్టుగా గుర్తించిన అధికారులు కొంతకాలం క్రితం పనులు ఆపేశారు. దీన్ని ఉన్నదున్నట్టు వేలం ద్వారా అమ్మే ఆలోచనతో ఆస్తుల విలువను నిర్ధారించే మూడు అంతర్జాతీయ వ్యాల్యూయేటర్స్‌కు అప్పగించారు. నెలపాటు కసరత్తు చేసిన ఆ సంస్థలు ఈ ప్రాజెక్టు విలువను రూ.190 కోట్లుగా నిర్ధారించాయి. అదేమాదిరిగా పోచారం, బండ్లగూడ ప్రాజెక్టుల విలువ కూడా చాలా తక్కువేనని ఈ సంస్థలు తేల్చాయి. ‘ఖాళీ స్థలాన్ని కొని నచ్చిన రీతిలో ఇళ్లు కట్టుకోవటానికి ఎవరైనా ముందుకొస్తారు. కానీ.. మీకు న చ్చిన రీతిలో కట్టి అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. అందువల్లే ఈ నిర్మాణాలకు అంతగా విలువ లేదు..’ అంటూ ఆ సంస్థలు ఇచ్చిన నివేదిక చూసి ‘స్వగృహ’ ఉన్నతాధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. ఆ లెక్కన ప్రాజెక్టులను గంపగుత్తగా అమ్మితే రూ.వేయి కోట్లకుపైగా నష్టం వచ్చే అవకాశం ఉన్నందున, ఇళ్ల ధరలను భారీగా తగ్గించి విడివిడిగా అమ్మితే సాధారణ ప్రజలు హాట్ కేకుల్లా కొంటారని అధికారులు భావిస్తున్నారు. మార్కెట్ ధరకంటే 25 % మేరకు తగ్గించి అమ్మితే నష్టాలను తగ్గించవచ్చని స్వగృహ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు. -
నిర్మాణ సంస్థకే ‘స్వగృహ’ ప్రాజెక్టు?
సాక్షి, హైదరాబాద్: ‘స్వగృహ’ ప్రాజెక్టులో ఇదో వింత. ప్రజల కోసం నిర్మించిన ఓ ప్రాజెక్టును దాన్ని నిర్మించిన బడా నిర్మాణ సంస్థకే దాసోహం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సింగపూర్ పరిజ్ఞానంగా చెప్పుకొనే ప్రీఫ్యాబ్రికేటెడ్ విధానంతో నిర్మించిన ఆ ప్రాజెక్టును.. దాన్ని నిర్మించిన పుణెకు చెందిన సంస్థకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. నిధులు లేవనే కారణంతో బకాయిల కింద దాన్ని కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. స్వగృహ కార్పొరేషన్ జవహర్‌నగర్‌లో 2,850 ఇళ్లతో ఓ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. పుణెకు చెందిన నిర్మాణ సంస్థ దీన్ని ప్రీఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో నిర్మించింది. ప్రధాన నిర్మాణం పూర్తయినా.. నిధులు లేమి కారణంగా ప్రభుత్వం ఫినిషింగ్ పనులు ఆపేసింది. తొలిదఫాగా నిర్మాణ సంస్థకు కొంత డబ్బు చెల్లించినా, ఆ తర్వాత నిధులు లేక కార్పొరేషన్ బకాయి పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆ మొత్తం రూ.150 కోట్ల వరకు పేరుకుపోయి ఉంది. ఇప్పుడు బకాయి కింద ఆ ప్రాజెక్టులోని ఇళ్లనే ఆ సంస్థకు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. అవి అసంపూర్తిగా ఉన్నందున ఒక్కో ఇంటి విలువ తక్కువగా ఉండనుంది. మూడు అంతర్జాతీయ సంస్థలు దాని విలువను లెక్కగడుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.150 కోట్ల బకాయి కింద ప్రాజెక్టులో సింహభాగం ఇళ్లు ఆ సంస్థపరం కావడం ఖాయం. గతంలో ఆ ప్రాజెక్టును కొనేందుకు సీఆర్పీఎఫ్ సంస్థ ఆసక్తి చూపి ఆ తర్వాత వైదొలిగింది. అలాంటి కేంద్రప్రభుత్వరంగ సంస్థలతో ఆ నిర్మాణ సంస్థకు మంచి పరిచయాలు ఉండటంతో తిరిగి సీఆర్పీఎఫ్ లాంటి సంస్థను ఆకట్టుకోవటం దానికి పెద్ద పనికాదు. తక్కువ ధరకు ఆ ప్రాజెక్టును సొంతం చేసుకుని దానికి మెరుగులద్ది ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉండటంతో ఆ సంస్థ కూడా బకాయి కింద ఇళ్లను తీసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. పైగా నగరంలోని ప్రాజెక్టు ధరల్లోంచి భూమి విలువను తగ్గించి అమ్మాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ధర తగ్గింపు లబ్ధి కూడా ఆ సంస్థకు మరింత లాభాన్ని తెచ్చిపెట్టనుందన్నమాట. జవహర్‌నగర్ ప్రాజెక్టు కాకుండా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి 20 మంది కాంట్రాక్టర్లకు కూడా కార్పొరేషన్ రూ.100 కోట్లు బకాయి పడింది. ఆ బకాయిల కింద స్వగృహ ఇళ్లను లేదా ఖాళీ స్థలాలు ఇవ్వడానికి సర్కారు అంగీకరించడంతో ఇప్పటికే ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి.