పరామర్శ కోసం..
నేడు జిల్లాకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రాక
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు.. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
* సుధీర్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ
* వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి
వరంగల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి తెలిపారు. హన్మకొండలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ సిద్ధార్థరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో సోమవారం జగన్మోహన్రెడ్డి వరంగల్‌కు చేరుకుంటారని తెలిపారు. ఉద యం 11.30 గంటలకు జిల్లా ప్రవేశద్వారం పెంబర్తి వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధినేత జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతారని పేర్కొన్నారు. అక్కడి నుంచి హన్మకొండకు వచ్చి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు.
తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. జగన్మోహన్రెడ్డి వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర నాయకులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వై. వెంకటరత్నం బాబు, నల్ల సూర్యప్రకాష్, హెచ్ఏ.రహ్మన్, ఎం.దయానందం, జి.నాగిరెడ్డి, మునిగాల విలియం, సుజాత మం గీలాల్, శివ వస్తారని వివరించారు.
జగన్మోహన్రెడ్డి పర్యటనను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు నాడెం శాంతికుమార్, అప్పం కిషన్, మునిగాల కల్యాణ్‌రాజ్, మహిపాల్‌రెడ్డి, శంకరాచారి, కాయిత రాజ్‌కుమార్, జలంధర్ పాల్గొన్నారు.