jitendra sing
-
సీఐసీ వద్ద 19 వేల దరఖాస్తులు పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార హక్కు కమిషన్ (సీఐసీ) వద్ద గత ఏప్రిల్ నాటికి 19,233 దరఖాస్తులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం బుధవారం లోక్‌సభకు తెలిపింది. పది మంది సభ్యులుండే సీఐసీలో నాలుగు ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2021–22లో 29,213 దరఖాస్తులు, 2020–21లో 35,178 , 2018–19లో 29,655 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. -
‘మిషన్ కర్మయోగి’కి కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులను మరింత సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ‘మిషన్ కర్మయోగి’పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ ఈ ‘మిషన్ కర్మయోగి లేదా నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్(ఎన్పీసీఎస్సీబీ)’కార్యక్రమానికి పచ్చ జెండా ఊపింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, సానుకూల దృక్పథం కలిగినవారుగా, వృత్తి నిపుణులుగా, సాంకేతికంగా మరింత మెరుగైన వారిగా మార్చే అతిపెద్ద పాలనా సంస్కరణగా ‘మిషన్ కర్మయోగి’ని కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. సరైన దృక్పథం, లోతైన జ్ఞానం, ఆధునిక నైపుణ్యాలు కలగలసిన, భారతదేశ భవిష్యత్ అవసరాలను తీర్చగల సమర్థ్ధులైన ఉద్యోగులుగా వారిని సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ‘మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి ఇది అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమం’అని కేబినెట్ భేటీ అనంతరం సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని దేశసేవకు ఉపయోగపడే అసలైన కర్మయోగిగా మార్చేలా ఈ కార్యక్రమం ఉంటుందని సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ‘2020 నుంచి 2025 వరకు దశలవారీగా రూ. 510.86 కోట్ల వ్యయంతో సుమారు 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది’ అని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, పథకానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రధానమంత్రి నేతృత్వంలో కొందరు ఎంపిక చేసిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రఖ్యాత హెచ్ఆర్ నిపుణులు సభ్యులుగా ఒక కేంద్ర కమిటీని ఏర్పాటు చేస్తారు. భవిష్యత్ భారత అవసరాలను తీర్చగల సమర్ధులైన ఉద్యోగులను రూపొందించడం మిషన్ కర్మయోగి లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూ, కశ్మీర్లో హిందీ, కశ్మీరీ, డోగ్రీలను అధికార భాషల్లో చేర్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇంగ్లీష్, ఉర్దూ అధికార భాషలుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ‘జమ్మూకశ్మీర్ అఫీషియల్ లాంగ్వేజెస్ బిల్–2020’ని రానున్న సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెడ్తామని జావదేకర్ వెల్లడించారు. -
రిటైర్మెంట్ వయస్సు తగ్గించే ఆలోచన లేదు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రతిపాదనేమీ లేదని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 50 ఏళ్లకు తగ్గించనున్నారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం వారి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను ఒక వర్గం మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కరోనా కారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక ప్రకటనలో సింగ్ ఆరోపించారు. 80 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ నిలిపివేత, మిగతావారి పెన్షన్‌లో 30% కోత అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారన్నారు. లాక్డౌన్ సమయంలోనూ ఉద్యోగుల ప్రయోజనం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. కనీస సిబ్బందితో విధులు నిర్వహించాలని, దివ్యాంగులకు అత్యవసర విధులు వేయవద్దని ఆదేశించామన్నారు. -
‘యుద్ధం’పూర్
కశ్మీర్‌లోని జమ్మూ ప్రాంతంలో కీలక లోక్‌సభ స్థానం ఉధంపూర్. హిందూ ఓటర్లు మెజారిటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ 2014లో గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ను ఆయన దాదాపు 61 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. కశ్మీర్ మాజీ సంస్థానాధీశుడు, రాజా హరిసింగ్ కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కరణ్‌సింగ్ (కాంగ్రెస్) గతంలో నాలుగుసార్లు ఇక్కడి నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. జమ్మూ, కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ నేత భీమ్‌సింగ్ 1988 ఉప ఎన్నికలో ఒకసారి ఇక్కడ విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్ సభ్యుడు జితేంద్రసింగ్ బీజేపీ తరఫున, కాంగ్రెస్ టికెట్‌పై కరణ్‌సింగ్ కొడుకు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. గ్వాలియర్ మాజీ సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన మాధవరావు సింధియా కుమార్తెను విక్రమాదిత్య 1987లో వివాహమాడారు. పాంథర్స్ పార్టీ తరఫున హర్షదేవ్సింగ్ పోటీలో ఉన్నారు. 16.85 లక్షల ఓటర్లున్న ఈ సీటుకు ఏప్రిల్ 18న (రెండో దశ) పోలింగ్ జరగనుంది. ఏడు జిల్లాల్లోని 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉధంపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి. బీజేపీ నాలుగుసార్లు విజయం బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చమన్‌లాల్ గుప్తా గతంలో మూడుసార్లు ఉధంపూర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లో జితేంద్రసింగ్ గెలిచారు. మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తుండటంతో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని భావిస్తున్నారు. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా చౌధరీ లాల్‌సింగ్ పోటీకి దిగడంతో హిందూ ఓట్లు చీలిపోతాయని అంచనా. కఠువా రేప్ కేసులో నిందితులకు అనుకూలంగా లాల్‌సింగ్ మాట్లాడి వివాదం సృష్టించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికైన లాల్‌సింగ్ తర్వాత మంత్రి అయ్యారు. ‘కఠువా’ పరిణామాలతో బీజేపీ రాజీ నామా చేయించింది. నలుగురు అభ్యర్థులూ రాజపుత్ర వర్గానికి చెందినవారే. కఠువా ఘటనలో బాధితులైన బక్రవాల్ ముస్లిం వర్గం ఓట్లు కాంగ్రెస్‌కే పడతాయని అంచనా. మాజీ సీఎం మహబూబా ముఫ్తీ.. కాంగ్రెస్‌కు అనుకూలంగా అభ్యర్థిని నిలపకపోవడం విక్రమాదిత్యకు కలిసొచ్చే అంశం. లాల్‌సింగ్ ర్యాలీలకు అనూహ్య స్పందన! కఠువా ఘటనతో సంచలనం సృష్టించిన లాల్‌సింగ్ ర్యాలీల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. హిందువులకు ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానం ఇక్కడ తగ్గలేదనీ, ఎంపీ అభ్యర్థి ఎవరనే పట్టింపు లేదనీ, ఈ కారణంగా బీజేపీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లాల్‌సింగ్ చీల్చే ఓట్లు గణనీయంగా ఉంటే జితేంద్రసింగ్ గెలుపు కష్టమే అవుతుంది. కశ్మీర్ మాజీ రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్యకు హిందువుల నుంచి లభించే ఆదరణ ఉధంపూర్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. పీడీపీ మద్దతు వల్ల విక్రమాదిత్యకు ముస్లింల ఓట్లు లభిస్తే కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగవుతాయి. మొత్తం మీద 2014తో పోల్చితే ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉందని చెప్పవచ్చు. -
మయన్మార్‌కు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: మయన్మార్‌లో భారత సైన్యం దాడులు జరిపి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన మరుసటిరోజు నెలకొన్న తాజా పరిస్థితుల్ని సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ మేరకు మయన్మార్ కు బయలుదేరి వెళ్లాల్సిందిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ను ఆదేశించారు. తాజా పరిస్థితులపై సమాచార సేకరణతోపటు పలువురు కీలక వ్యక్తులతో జితేంద్ర చర్యలు జరుపుతారని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఎన్ఎస్సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) ఉగ్రవాదులు భారత సైన్యంపై జరిపిన దాడిలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం.. ఘటనకు బాధ్యులైనవారిపై విడిచిపెట్టేది లేదని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే మయన్మార్ దళాలతో కలిసి మంగళవారం భారత సైన్యం ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు 20 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, మయన్మార్ లో భారత సైన్యం చర్యకు రాజకీయ రంగులు పులిమే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.