కశ్మీర్‌లోని జమ్మూ ప్రాంతంలో కీలక లోక్‌సభ స్థానం ఉధంపూర్. హిందూ ఓటర్లు మెజారిటీగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ 2014లో గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్‌ను ఆయన దాదాపు 61 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. కశ్మీర్ మాజీ సంస్థానాధీశుడు, రాజా హరిసింగ్ కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కరణ్‌సింగ్ (కాంగ్రెస్) గతంలో నాలుగుసార్లు ఇక్కడి నుంచే లోక్‌సభకు ఎన్నికయ్యారు. జమ్మూ, కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ నేత భీమ్‌సింగ్ 1988 ఉప ఎన్నికలో ఒకసారి ఇక్కడ విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్ సభ్యుడు జితేంద్రసింగ్ బీజేపీ తరఫున, కాంగ్రెస్ టికెట్‌పై కరణ్‌సింగ్ కొడుకు విక్రమాదిత్యసింగ్ పోటీ చేస్తున్నారు. గ్వాలియర్ మాజీ సంస్థానాధీశుల కుటుంబానికి చెందిన మాధవరావు సింధియా కుమార్తెను విక్రమాదిత్య 1987లో వివాహమాడారు. పాంథర్స్ పార్టీ తరఫున హర్షదేవ్‌సింగ్ పోటీలో ఉన్నారు. 16.85 లక్షల ఓటర్లున్న ఈ సీటుకు ఏప్రిల్ 18న (రెండో దశ) పోలింగ్ జరగనుంది. ఏడు జిల్లాల్లోని 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉధంపూర్ లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్నాయి.
బీజేపీ నాలుగుసార్లు విజయం
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చమన్‌లాల్ గుప్తా గతంలో మూడుసార్లు ఉధంపూర్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లో జితేంద్రసింగ్ గెలిచారు. మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి పోటీచేస్తుండటంతో బీజేపీ గెలుపు అంత తేలిక కాదని భావిస్తున్నారు. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థిగా చౌధరీ లాల్‌సింగ్ పోటీకి దిగడంతో హిందూ ఓట్లు చీలిపోతాయని అంచనా. కఠువా రేప్ కేసులో నిందితులకు అనుకూలంగా లాల్‌సింగ్ మాట్లాడి వివాదం సృష్టించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికైన లాల్‌సింగ్ తర్వాత మంత్రి అయ్యారు. ‘కఠువా’ పరిణామాలతో బీజేపీ రాజీ నామా చేయించింది. నలుగురు అభ్యర్థులూ రాజపుత్ర వర్గానికి చెందినవారే. కఠువా ఘటనలో బాధితులైన బక్రవాల్ ముస్లిం వర్గం ఓట్లు కాంగ్రెస్‌కే పడతాయని అంచనా. మాజీ సీఎం మహబూబా ముఫ్తీ.. కాంగ్రెస్‌కు అనుకూలంగా అభ్యర్థిని నిలపకపోవడం విక్రమాదిత్యకు కలిసొచ్చే అంశం.
లాల్‌సింగ్ ర్యాలీలకు అనూహ్య స్పందన!
కఠువా ఘటనతో సంచలనం సృష్టించిన లాల్‌సింగ్ ర్యాలీల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. హిందువులకు ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న అభిమానం ఇక్కడ తగ్గలేదనీ, ఎంపీ అభ్యర్థి ఎవరనే పట్టింపు లేదనీ, ఈ కారణంగా బీజేపీ విజయావకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లాల్‌సింగ్ చీల్చే ఓట్లు గణనీయంగా ఉంటే జితేంద్రసింగ్ గెలుపు కష్టమే అవుతుంది. కశ్మీర్ మాజీ రాజ కుటుంబానికి చెందిన విక్రమాదిత్యకు హిందువుల నుంచి లభించే ఆదరణ ఉధంపూర్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. పీడీపీ మద్దతు వల్ల విక్రమాదిత్యకు ముస్లింల ఓట్లు లభిస్తే కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగవుతాయి. మొత్తం మీద 2014తో పోల్చితే ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉందని చెప్పవచ్చు.
‘యుద్ధం’పూర్
Published Fri, Apr 12 2019 5:15 AM | Last Updated on Fri, Apr 12 2019 5:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment