
జితేంద్ర సింగ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించే ప్రతిపాదనేమీ లేదని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 50 ఏళ్లకు తగ్గించనున్నారని మీడియాలో వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుతం వారి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను ఒక వర్గం మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కరోనా కారణంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్న సమయంలో కొన్ని స్వార్థ శక్తులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఒక ప్రకటనలో సింగ్ ఆరోపించారు. 80 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ నిలిపివేత, మిగతావారి పెన్షన్‌లో 30% కోత అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారన్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ ఉద్యోగుల ప్రయోజనం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. కనీస సిబ్బందితో విధులు నిర్వహించాలని, దివ్యాంగులకు అత్యవసర విధులు వేయవద్దని ఆదేశించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment