జియోట్యాగింగ్తో అవినీతికి అడ్డుకట్ట
- మరుగుదొడ్ల నిర్మాణం శతశాతం పూర్తి చేయాలి
- మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ ఆశాజ్యోతి
యలమంచిలి : కొత్తగా ప్రవేశపెట్టిన జియోట్యాగింగ్ విధానంతో గృహనిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని మున్సిపల్ విశాఖపట్నం ప్రాంతీయ సంచాలకులు పి.ఆశాజ్యోతి అభిప్రాయపడ్డారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛాంధ్రలో భాగంగా మంగళవారం యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు.యలమంచిలి పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా మార్చేందుకు మొదటిగా ప్రతి ఇంటిలోనూ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
గతంలో 3,030 మంది వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.11వేలు మొత్తం రూ.15వేలు అందజేస్తామన్నారు. ఎవరైనా మరుగుదొడ్లు నిర్మించుకోలేకపోతే కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించి తమ శాఖ పర్యవేక్షణలోనే మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. జియోట్యాగింగ్ విధానం అమలులోకి రావడం వల్ల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం లేదన్నారు.
ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా చేయగలిగితే పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం శతశాతం పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత వార్డు కౌన్సిలర్లపై కూడా ఉందన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కొఠారు సాంబ మాట్లాడుతూ పట్టణంలో ప్రజలకు పూర్తిగా తాగునీరు అందించలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే వాటికి నీరెలా అందించగలుగుతారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సత్తారు శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.