JMC Projects
-
కల్పతరులో జేఎంసీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్‌లో నిర్మాణ రంగ అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్టŠస్ విలీనానికి దారి ఏర్పడింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సంయుక్త సంస్థ దేశీయంగా అతిపెద్ద లిస్టెడ్ ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు కల్పతరు పేర్కొంది. ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ జేఎంసీ విలీనానికి అనుమతించినట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థ దేశీయంగా భారీ కార్యకలాపాలు కలిగి ఉండగా.. 67 దేశాలలోనూ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ, బిల్డింగులు, ఫ్యాక్టరీలు, వాటర్, రైల్వేలు, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర పలు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు వివరించింది. ఆర్డర్ బుక్ రూ. 43,000 కోట్లకు చేరనున్నట్లు తెలియజేసింది. కాగా.. 2022 ఫిబ్రవరిలో కల్పతరు, జేఎంసీ బోర్డులు విలీనానికి ఆమోదముద్ర వేశాయి. దీనిలో భాగంగా జేఎంసీ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 4 షేర్లకుగాను 1 కల్పతరు షేరుని కేటాయిస్తారు. -
డాక్టర్ రెడ్డీస్- జేఎంసీ ప్రాజెక్ట్స్ జోరు
కోవిడ్-19 కట్టడికి రష్యా రూపొందించిన వ్యాక్సిన్‌పై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలను చేపట్టేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కౌంటర్‌కు రెండో రోజూ డిమాండ్ కనిపిస్తోంది. మరోపక్క తాజాగా కాంట్రాక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కోవిడ్-19 కట్టడికి రిజిస్టరైన రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్-విను దేశీయంగా అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో వరుసగా రెండో రోజు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కౌంటర్ వెలుగులో నిలుస్తోంది. ఎన్ఎస్ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 4,773ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 4,767 వద్ద ట్రేడవుతోంది. స్పుత్నిక్-విపై దేశీయంగా మూడో దశ క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరీక్షలు విజయవంతమైతే 10 కోట్ల డోసేజీలను డాక్టర్ రెడ్డీస్‌కు ఆర్డీఐఎఫ్ అందించనుంది. గమేలియా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్-విపై రష్యాలో రెండు దశల పరీక్షలను నిర్వహించారు. వీటిలో ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని, సమర్థవంతంగా పనిచేస్తున్నదని ఆర్డీఐఎఫ్ ఇప్పటికే తెలియజేసింది. జేఎంసీ ప్రాజెక్ట్స్ దేశ, విదేశాల నుంచి రూ. 1,342 కోట్ల విలువైన కాంట్రాక్టులు తాజాగా లభించినట్లు మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ తెలియజేసింది. వీటిలో తూర్పు ఆసియా నుంచి దక్కించుకున్న రూ. 725 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఉన్నట్లు పేర్కొంది. ఈ బాటలో ఒడిషాలో నీటిపారుదల సౌకర్యాల కల్పనకు రూ. 471 కోట్ల ప్రాజెక్ట్ లభించగా.. బిల్డింగ్ నిర్మాణం కోసం రూ. 146 కోట్ల కాంట్రాక్టును ఉత్తరాది నుంచి పొందినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో జేఎంసీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతంపైగా జంప్‌చేసి రూ. 57.40ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం ఎగసి రూ. 55.40 వద్ద ట్రేడవుతోంది. -
జేఎంసీ ప్రాజెక్ట్స్- కేన్ ఫిన్ హోమ్ జూమ్
వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్డర్లు పొందిన వార్తలతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. జేఎంసీ ప్రాజెక్ట్స్ దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి తాజాగా రూ. 554 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 62ను అధిగమించింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 60.5 వద్ద ట్రేడవుతోంది. బిల్డింగ్ నిర్మాణాలకు దక్షిణాది నుంచి రూ. 315 కోట్ల కాంట్రాక్టు లభించగా.. మహారాష్ట్ర నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటుకుగాను రూ. 239 కోట్ల ఆర్డర్ దక్కినట్లు జేఎంసీ తెలియజేసింది. ఫలితంగా ఆర్డర్ బుక్ విలువ తాజాగా రూ. 4,000 కోట్లకు చేరినట్లు మౌలిక సదుపాయాల దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్కు అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్ వెల్లడించింది. కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 93 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 15 శాతం వృద్ధికాగా.. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత కేన్ ఫిన్ హోమ్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతం జంప్‌చేసి రూ. 420కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 398 వద్ద ట్రేడవుతోంది. -
జేఎంసీ ప్రాజెక్ట్స్ జూమ్- కేఆర్‌బీఎల్ డీలా
కోవిడ్-19 కట్టడికి రష్యాలో వ్యాక్సిన్‌ను విడుదల చేసినప్పటికీ ప్రపంచ స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. ఈ బాటలో దేశీ మార్కెట్లు సైతం నేలచూపులతో కదులుతున్నాయి. అయితే తాజాగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కాంట్రాక్టులు లభించినట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. కాగా.. మరోపక్క ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో పనితీరు నిరాశపరచడంతో బాస్మతి బియ్యం ఎగుమతుల సంస్థ కేఆర్‌బీఎల్ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం.. జేఎంసీ ప్రాజెక్ట్స్ దక్షిణాది నుంచి బిల్డింగ్ ప్రాజెక్టుల విభాగంలో రూ. 1,169 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొందినట్లు జేఎంసీ ప్రాజెక్ట్స్ తాజాగా వెల్లడించింది. ఈ బాటలో బీహార్ నుంచి నీటి సరఫరా ప్రాజెక్టు కోసం రూ. 194 కోట్ల ఆర్డర్ లభించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జేఎంసీ ప్రాజెక్ట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 53 సమీపంలో ట్రేడవుతోంది. తొలుత రూ. 55 వరకూ ఎగసింది. కేఆర్‌బీఎల్ లిమిటెడ్ ఇండియాగేట్ బాస్మతి బ్రాండ్ కంపెనీ కేఆర్‌బీఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో 8 శాతం క్షీణించింది. రూ. 126 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 37 శాతం నీరసించి రూ. 773 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 17 శాతం వెనకడుగుతో రూ. 199 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో కేఆర్‌బీఎల్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6.5 శాతం పతనమై రూ. 290కు చేరింది. ప్రస్తుతం 3 శాతం నష్టంతో రూ. 300 వద్ద ట్రేడవుతోంది. -
జేఎంసీ- పేజ్.. భారీ లాభాల ఫేజ్‌లో..
వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి వెనకడుగు వేస్తున్నాయి. డెరివేటివ్ సిరీస్ ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 86 పాయింట్లు నీరసించి 35,345కు చేరగా.. 26 పాయింట్లు తక్కువగా నిఫ్టీ 10,448 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల కారణంగా జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్, మౌలిక సదుపాయాల సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలత్ కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి రూ. 938 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు నిర్మాణ రంగ కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ తాజాగా వెల్లడించింది. వీటిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ. 841 కోట్ల విలువైన నీటి పారుదల ప్రాజెక్టులను సంపాదించగా.. బిల్డింగ్ నిర్మాణం కోసం దక్షిణాది నుంచి రూ. 97 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు పేర్కొంది. దీంతో ఈ కౌంటర్ తొలుత ఎన్ఎస్ఈలో 20 శాతం దూసుకెళ్లి రూ. 60 ను అధిగమించింది. ప్రస్తుతం 14 శాతం జంప్‌చేసి రూ. 58 వద్ద ట్రేడవుతోంది. గత 5 రోజుల సగటు 29,000 షేర్లతో పోలిస్తే తొలి రెండు గంటల్లోనే లక్ష షేర్లు ఈ కౌంటర్లో చేతులు మారాయి. గత మూడు నెలల్లో ఈ షేరు 65 శాతం ర్యాలీ చేయడం విశేషం! పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ జాకీ బ్రాండ్ ఇన్నర్‌వేర్ తయారీ పేజ్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 20,929 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21,194 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. క్యూ4(జనవరి-మార్చి)లో కంపెనీ నికర లాభం 59 శాతం క్షీణించి రూ. 31 కోట్లకు పరిమితంకాగా.. ఆదాయం 11 శాతం వెనకడుగుతో రూ. 541 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు సైతం 9 శాతం పడిపోయి 10.7 శాతానికి చేరాయి. అయితే పూర్తిఏడాదికి కార్యకలాపాల ద్వారా 125 శాతం అధికంగా రూ. 517 కోట్ల క్యాష్‌ఫ్లోను సాధించింది. దీంతో 2020 మార్చికల్లా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించడంతోపాటు... రూ. 117 కోట్ల నగదు నిల్వలను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
భారీ ఆర్డర్ దక్కించుకున్నజెఎంసీ
ముంబై: ప్రముఖ దేశీయ రియల్ఎస్టేట్ సంస్థ జెఎంసీ ప్రాజెక్టు ఇండియా భారీ ఆర్డర్‌ను దక్కించుకుంది. రూ.1,058కోట్ల విలువైన ఆర్డర్‌ను సాధించింది. మహారాష్ట్ర ధానేలో రూ 531 కోట్ల విలువైన నివాస భవనం ప్రాజెక్ట్ ఆర్డర్, బెంగుళూరులో రూ. 527 కోట్ల రెండు వాణిజ్య భవన నిర్మాణ ప్రాజెక్టును సాధించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లోతెలిపింది. డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టు సంస్థ డైరెక్టర్ , సీఎఫ్‌వో మనోజ్ తులసియాన్ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఆర్డర్ తీసుకునేటపుడు అప్రమత్తంగా ఉన్నామన్నారు. అలాగే 2018 ఆర్థిక సంవత్సరానికిగాను 15-20 వృద్ధి సాధించనున్నట్టు చెప్పారు. ఈ ప్రకటనతో మార్కెట్లో ఈ కౌంటర్ ఒకదశలో4 శాతం లాభపడింది. కాగా దేశీయ ఇంజనీరింగ్ మరియు నిర్మాణ సేవల సంస్థ జెఎంసీ భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణంతోపాటు, నిర్మాణం రంగంలోని డిజైన్, సేకరణ, సరఫరా, సంస్థాపన, టెస్టింగ్ లాంటి ఇతర ప్రాజెక్టులను నిర్వహిస్తుంది. -
హైదరాబాద్ రియల్టీలోకి ‘కల్పతరు’
♦ కల్పతరు గ్రూప్ ఎండీ పరాగ్ మనోజ్ ♦ సనత్‌నగర్‌లో 5.5 ఎకరాల్లో తొలిదశ ♦ నెలరోజుల్లోగా వివరాలు ప్రకటిస్తాం ♦ కల్పతరు ప్రాజెక్ట్స్ లిస్టింగ్ ఆలోచన లేదు ♦ రియల్ ఎస్టేట్ బిల్లు చాలావరకూ మంచిదే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ‘కల్పతరు’ గ్రూప్... హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ గ్రూప్ రూ.8,100 కోట్ల వార్షిక టర్నోవర్‌తో దేశంతో పాటు విదేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. గ్రూప్‌కు చెందిన జేఎంసీ ప్రాజెక్ట్స్, కల్పతరు పవర్లు స్టాక్ మార్కెట్లో లిస్టయినవి కాగా... శుభమ్ లాజిస్టిక్స్, ప్రాపర్టీ సొల్యూషన్స్, రియల్టీ దిగ్గజం కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంకా లిస్ట్ కాలేదు. ప్రధానంగా ముంబైతో పాటు పుణె, బెంగళూరు వంటి చోట్ల 93 దాకా ప్రీమియం ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న కల్పతరు ప్రాజెక్ట్స్... హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో తొలి ప్రాజెక్టు చేపడుతోంది. వచ్చేనెల్లో దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రూప్ ఎండీ పరాగ్ మనోజ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ... హైదరాబాద్ రియల్టీలోకి వస్తున్నట్లున్నారు? అవును! 2008లో మేం సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో వేలం వేసిన 9.5 ఎకరాల స్థలం కొన్నాం. దాన్నిపుడు డెవలప్ చేస్తున్నాం. తొలి దశలో 5.5 ఎకరాలను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పనులు ఆరంభమయ్యాయి. అక్షయ తృతీయకన్నా ముందే వివరాలు ప్రకటిస్తాం. హైదరాబాద్ రియల్టీ మార్కెట్ మీరు అంచనా వేస్తున్నంత బాగుందా? మార్కెట్లో మరీ బూమ్ ఉందని చెప్పలేం. కాకపోతే విశ్వసనీయత ఉన్న ప్రాజెక్టులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులోనూ హైదరాబాద్‌కు ఉజ్వలమైన భవిష్యత్తుంది. ఈ నమ్మకంతోనే అడుగు పెడుతున్నాం. హైటెక్ సిటీ, ఔటర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను వదిలి సనత్‌నగర్‌లో ఆరంభిస్తున్నారేం? అది నగరానికి మధ్యలో ఉంది. మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటికీ దగ్గర. అలాంటిచోట 10 ఎకరాల స్థలం దొరకటమంటే మాటలు కాదు. మాకు అదృష్టంకొద్దీ దొరికింది. అందుకే ఆరంభిస్తున్నాం. కల్పతరు ప్రాజెక్ట్స్ ప్రీమియం సెగ్మెంట్లోనే ఉంది. హైదరాబాద్‌లోనూ ఇదే పంథా కొనసాగిస్తారా? ముంబైలో మా ప్రాజెక్టులు ప్రీమియంవే. కాదనను. ఇప్పుడైతే ఒకో ఫ్లాట్ కనీస ధర రూ.7-8 కోట్ల నుంచి గరిష్ఠంగా 35 కోట్ల వరకూ ఉంటోంది. కాకపోతే ముంబైలో మేం ప్రాజెక్టులు చేపడుతున్న ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు ఈ ధరను డిమాండ్ చేస్తున్నాయి. అంతేతప్ప హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎందుకనుకోవాలి? అక్కడి పరిస్థితుల బట్టే అక్కడ ప్రాజెక్టులుంటాయి. ఇంకా హైదరాబాద్‌లో మీ గ్రూప్ కార్యకలాపాలేమైనా...? మా గ్రూప్‌కు చెందిన ప్రాపర్టీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఎస్‌పీఎల్) సంస్థ వివిధ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల నిర్వహణను చూస్తుంది. మా ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం దీనిదే. హైదరాబాద్‌లో ఇతరులకు చెందిన కొన్ని కమర్షియల్ ప్రాజెక్టుల నిర్వహణను కూడా మేం చూస్తున్నాం. కల్పతరు ప్రాజెక్ట్ ఐపీఓ ప్రయత్నాలేమైనా చేస్తోందా? అలాంటిదేమీ లేదు. అసలు ఆ ఆలోచనే లేదు. గ్రూప్ కంపెనీలన్నీ చక్కని దారిలో వెళుతున్నాయి. ఇప్పుడైతే మిగతా కంపెనీల లిస్టింగ్ గురించి ఏ ఆలోచనలూ చేయటం లేదు. రియల్ ఎస్టేట్ బిల్లు బిల్డర్లకు లాభమా? నష్టమా? అది ప్రధానంగా బిల్డర్ల కోసం తెచ్చిన బిల్లు కాదు. కష్టపడి ఇల్లు కొనుక్కునే వారికి భద్రత కలిగించాలని. అందులోని కొన్ని అంశాలు మాకూ నచ్చలేదు. కానీ మొత్తమ్మీద చూస్తే రియల్ ఎస్టేట్ డెవలపర్లందరినీ ఒక నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నమిది. ఎవరు పడితే వారు బోర్డు పెట్టి వినియోగదారుల్ని నమ్మించి మోసం చేసే అవకాశం లేకుండా... కాస్త విశ్వసనీయత, స్తోమత ఉన్నవారినే ఈ రంగంలో నిలిచేలా చేస్తుందీ బిల్లు. హైదరాబాద్‌లో మరిన్ని ప్రాజెక్టులేమైనా చేపడతారా? కచ్చితంగా. ఎందుకంటే గూగుల్, ఉబెర్, అమెజాన్ వంటి దిగ్గజాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న సిటీలో విస్తరించాలని ఎవరైనా అనుకుంటారు. కాకపోతే ఇప్పటికప్పుడు ఎలాంటి ఆలోచనా చేయటం లేదు.