హైదరాబాద్ రియల్టీలోకి ‘కల్పతరు’ | kalpatharu entry in hyderabad reyalty | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ రియల్టీలోకి ‘కల్పతరు’

Published Thu, Mar 24 2016 1:13 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

హైదరాబాద్ రియల్టీలోకి ‘కల్పతరు’

హైదరాబాద్ రియల్టీలోకి ‘కల్పతరు’

కల్పతరు గ్రూప్ ఎండీ పరాగ్ మనోజ్
సనత్‌నగర్‌లో 5.5 ఎకరాల్లో తొలిదశ
నెలరోజుల్లోగా వివరాలు ప్రకటిస్తాం
కల్పతరు ప్రాజెక్ట్స్ లిస్టింగ్ ఆలోచన లేదు
రియల్ ఎస్టేట్ బిల్లు చాలావరకూ మంచిదే

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ‘కల్పతరు’ గ్రూప్... హైదరాబాద్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ గ్రూప్ రూ.8,100 కోట్ల వార్షిక టర్నోవర్‌తో దేశంతో పాటు విదేశాల్లోనూ కార్యకలాపాలు సాగిస్తోంది. గ్రూప్‌కు చెందిన జేఎంసీ ప్రాజెక్ట్స్, కల్పతరు పవర్‌లు స్టాక్ మార్కెట్లో లిస్టయినవి కాగా... శుభమ్ లాజిస్టిక్స్, ప్రాపర్టీ సొల్యూషన్స్, రియల్టీ దిగ్గజం కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంకా లిస్ట్ కాలేదు. ప్రధానంగా ముంబైతో పాటు పుణె, బెంగళూరు వంటి చోట్ల 93 దాకా ప్రీమియం ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ సృష్టించుకున్న కల్పతరు ప్రాజెక్ట్స్... హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో తొలి ప్రాజెక్టు చేపడుతోంది. వచ్చేనెల్లో దీన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రూప్ ఎండీ పరాగ్ మనోజ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ...

 హైదరాబాద్ రియల్టీలోకి వస్తున్నట్లున్నారు?
అవును! 2008లో మేం సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో వేలం వేసిన 9.5 ఎకరాల స్థలం కొన్నాం. దాన్నిపుడు డెవలప్ చేస్తున్నాం. తొలి దశలో 5.5 ఎకరాలను అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పనులు ఆరంభమయ్యాయి. అక్షయ తృతీయకన్నా ముందే వివరాలు ప్రకటిస్తాం.

 హైదరాబాద్ రియల్టీ మార్కెట్ మీరు అంచనా వేస్తున్నంత బాగుందా?
మార్కెట్లో మరీ బూమ్ ఉందని చెప్పలేం. కాకపోతే విశ్వసనీయత ఉన్న ప్రాజెక్టులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందులోనూ హైదరాబాద్‌కు ఉజ్వలమైన భవిష్యత్తుంది. ఈ నమ్మకంతోనే అడుగు పెడుతున్నాం.

 హైటెక్ సిటీ, ఔటర్ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను వదిలి సనత్‌నగర్‌లో ఆరంభిస్తున్నారేం?
అది నగరానికి మధ్యలో ఉంది. మెట్రో, ఎంఎంటీఎస్ అన్నింటికీ దగ్గర. అలాంటిచోట 10 ఎకరాల స్థలం దొరకటమంటే మాటలు కాదు. మాకు అదృష్టంకొద్దీ దొరికింది. అందుకే ఆరంభిస్తున్నాం.

 కల్పతరు ప్రాజెక్ట్స్ ప్రీమియం సెగ్మెంట్లోనే ఉంది. హైదరాబాద్‌లోనూ ఇదే పంథా కొనసాగిస్తారా?
ముంబైలో మా ప్రాజెక్టులు ప్రీమియంవే. కాదనను. ఇప్పుడైతే ఒకో ఫ్లాట్ కనీస ధర రూ.7-8 కోట్ల నుంచి గరిష్ఠంగా 35 కోట్ల వరకూ ఉంటోంది. కాకపోతే ముంబైలో మేం ప్రాజెక్టులు చేపడుతున్న ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు ఈ ధరను డిమాండ్ చేస్తున్నాయి. అంతేతప్ప హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎందుకనుకోవాలి? అక్కడి పరిస్థితుల బట్టే అక్కడ ప్రాజెక్టులుంటాయి.

 ఇంకా హైదరాబాద్‌లో మీ గ్రూప్ కార్యకలాపాలేమైనా...?
మా గ్రూప్‌కు చెందిన ప్రాపర్టీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఎస్‌పీఎల్) సంస్థ వివిధ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టుల నిర్వహణను చూస్తుంది. మా ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం దీనిదే. హైదరాబాద్‌లో ఇతరులకు చెందిన కొన్ని కమర్షియల్ ప్రాజెక్టుల నిర్వహణను కూడా మేం చూస్తున్నాం.

  కల్పతరు ప్రాజెక్ట్ ఐపీఓ ప్రయత్నాలేమైనా చేస్తోందా?
అలాంటిదేమీ లేదు. అసలు ఆ ఆలోచనే లేదు. గ్రూప్ కంపెనీలన్నీ చక్కని దారిలో వెళుతున్నాయి. ఇప్పుడైతే మిగతా కంపెనీల లిస్టింగ్ గురించి ఏ ఆలోచనలూ చేయటం లేదు.

 రియల్ ఎస్టేట్ బిల్లు బిల్డర్లకు లాభమా? నష్టమా?
అది ప్రధానంగా బిల్డర్ల కోసం తెచ్చిన బిల్లు కాదు. కష్టపడి ఇల్లు కొనుక్కునే వారికి భద్రత కలిగించాలని. అందులోని కొన్ని అంశాలు మాకూ నచ్చలేదు. కానీ మొత్తమ్మీద చూస్తే రియల్ ఎస్టేట్ డెవలపర్లందరినీ ఒక నియంత్రణలోకి తెచ్చే ప్రయత్నమిది. ఎవరు పడితే వారు బోర్డు పెట్టి వినియోగదారుల్ని నమ్మించి మోసం చేసే అవకాశం లేకుండా... కాస్త విశ్వసనీయత, స్తోమత ఉన్నవారినే ఈ రంగంలో నిలిచేలా చేస్తుందీ బిల్లు.

 హైదరాబాద్‌లో మరిన్ని ప్రాజెక్టులేమైనా చేపడతారా?
కచ్చితంగా. ఎందుకంటే గూగుల్, ఉబెర్, అమెజాన్ వంటి దిగ్గజాలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న సిటీలో విస్తరించాలని ఎవరైనా అనుకుంటారు. కాకపోతే ఇప్పటికప్పుడు ఎలాంటి ఆలోచనా చేయటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement