వరుసగా మూడో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడిదొడుకుల మధ్య కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్డర్లు పొందిన వార్తలతో మౌలిక సదుపాయాల కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి.
జేఎంసీ ప్రాజెక్ట్స్
దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి తాజాగా రూ. 554 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించడంతో జేఎంసీ ప్రాజెక్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 16 శాతం దూసుకెళ్లి రూ. 62ను అధిగమించింది. ప్రస్తుతం 13 శాతం ఎగసి రూ. 60.5 వద్ద ట్రేడవుతోంది. బిల్డింగ్ నిర్మాణాలకు దక్షిణాది నుంచి రూ. 315 కోట్ల కాంట్రాక్టు లభించగా.. మహారాష్ట్ర నుంచి ఫ్యాక్టరీ ఏర్పాటుకుగాను రూ. 239 కోట్ల ఆర్డర్ దక్కినట్లు జేఎంసీ తెలియజేసింది. ఫలితంగా ఆర్డర్ బుక్ విలువ తాజాగా రూ. 4,000 కోట్లకు చేరినట్లు మౌలిక సదుపాయాల దిగ్గజం కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్‌కు అనుబంధ సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్ వెల్లడించింది.
కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్
కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ కేన్ ఫిన్ హోమ్ ఫైనాన్స్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 93 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 15 శాతం వృద్ధికాగా.. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పుంజుకుని రూ. 522 కోట్లను అధిగమించింది. వాటాదారులకు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత కేన్ ఫిన్ హోమ్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 9 శాతం జంప్‌చేసి రూ. 420కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 398 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment