సిటీలో బ్యాక్‌పెయిన్ బైకర్స్
నానాటికీ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సగటు మనిషిని సమస్యల్లోకి నెట్టేస్తోంది. ఓ ఉద్యోగి.. బైక్‌పై ఉప్పల్ నుంచి గచ్చిబైలీ వరకు వచ్చి వెళ్లడం అంటే ఇబ్బందే. ట్రాఫిక్ చట్రంలో ముక్కుతూ మూల్గుతూ వెళ్తున్న నగరవాసి నడుము హూనం అవుతోంది. గతుకుల రోడ్లు, ఆపై స్పీడ్ బ్రేకర్లతో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నగరంలో సగం మందికి పైగా బైక్ రైడర్లు నడుమునొప్పితో బాధపడుతున్నారు.
నగరంలో రోజుకు 27 లక్షల మంది ద్విచక్రవాహనంతో కుస్తీ పడుతుంటే.. అందులో 15 లక్షలకు పైగా బ్యాక్‌పెయిన్ బాధితులే. పరిభాషలో ‘రిపిటేటివ్ డ్రైవింగ్ ఇంజ్యురీస్’ అని అంటారు. రోజు జర్నీని ఎలాగూ తప్పించుకోలేం. మరి ఈ నడుమునొప్పినుంచి తప్పించుకోగలమా? అంటే... చిన్న చిన్న జాగ్రత్తలు, ఉపాయాలతో సాధ్యమే. బ్యాక్ పెయిన్ ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది.
నిద్ర నుంచి లేచేటప్పుడు నడుము నొప్పిగా అనిపించినా, నిద్రలో పొర్లాడిన సమయాల్లో నొప్పి వచ్చినా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎక్కువ సేపు కూర్చుని లేచినపుడు నడుము కలుక్కుమందంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. బైక్ జర్నీ తప్పదనుకుంటే.. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వెన్నుముక బలోపేతానికి వ్యాయామాలు, యోగా చేస్తుండాలి. ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయడం ద్వారా.. మంచి మార్పు కనిపిస్తుంది. వాకింగ్ ద్వారా మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.