Job search
-
జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్
సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. జాబ్స్ అంటూ, స్టాక్ మార్కెట్స్ అంటూ, బంధువులు అంటూ.. వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న మహిళను మోసం చేసి రూ. 1.94 లక్షలు కాజేశారు.కర్ణాటకలోని ఉడుపికి చెందిన అర్చన అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం వెతుకుతుండగా.. అమెజాన్ జాబ్‌లను ఆఫర్ చేస్తున్నట్లు ఒక ప్రకటన చూసింది. ఇది చూసి ఆ ప్రకటన మీద క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్ చాట్‌కు తీసుకెళ్లింది. స్కామర్లు.. రిక్రూటర్లుగా నటిస్తూ, ఆమెకు ఉత్సాహం కలిగించే ఆఫర్‌ను అందించారు.అధిక మొత్తంలో లాభాలను పొందాలంటే.. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు సూచించారు. ఇది నిజమని నమ్మి.. అక్టోబర్ 18 నుంచి 24 మధ్య సుమారు రూ. 1.94 లక్షలను వివిధ యూపీఐ ఐడీలకు బదిలీ చేసింది. అయితే చివరకు రిటర్న్‌లు రాకపోవడంతో.. మోసపోయామని గ్రహించింది. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లుస్కామర్లు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవానికి ఎప్పుడూ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్, లింక్స్ లేదా మెసేజ్‌లకు స్పందించకుండా ఉండాలి. అవతలి వ్యక్తి అనుమానంగా అనిపిస్తే తప్పకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి. -
ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి...
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్‌ల కారణంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొంత మంది నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొత్త ఉద్యోగం చేసిన దండయాత్ర గురించి తెలుసుకుంటే విస్తుపోవడం ఖాయం.. ఇదీ చదవండి: పీఎఫ్‌ను ముందస్తుగా వెనక్కి తీసుకోవచ్చా? ఢిల్లీకి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎనిమిది నెలల సుదీర్ఘ శోధన తర్వాత ఇటీవల ఒక టెక్ సంస్థలో ఉద్యోగం పొందాడు. ఆ ఎనిమిది నెలల సమయంలో అతను 150 కంటే ఎక్కువ కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాడు. తన ఉద్యోగ వేట కథను లింక్డ్ఇన్లో పోస్టు చేశాడు. సాఫ్ట్వేర్ డెవలపర్‌గా అనుభవం ఉన్నప్పటికీ కొత్త ఉద్యోగాన్ని పొందడం సవాలుగా మారిందన్నాడు. వందలాది కంపెనీలు తనను రిజెక్ట్ చేశాయన్నాడు. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! 150 కంపెనీలకు అప్లై చేస్తే 10 కంపెనీల నుంచి మాత్రమే రెస్పాన్స్ వచ్చిందని, వాటిలో కేవలం ఆరింటికి మాత్రమే ఇంటర్వ్యూ షెడ్యూల్ అయ్యాయని వివరించాడు. అమెజాన్ స్కాట్లాండ్తో ఇంటర్వ్యూలో అన్ని రౌండ్లు పూర్తయ్యాయని, కానీ చివరి దశలో నియామకం నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. గూగుల్ సంస్థలో అయితే డీఎస్ఏ రౌండ్లలో రిజెక్ట్ అయిందన్నారు. ఈ పోస్టు రాయడం వెనుక ఉద్దేశం.. పరిస్థితులు గతంలో మాదిరిగా లేవని, ఉద్యోగం కావాలంటే తీవ్రంగా కష్టపడాల్సిందేనని తెలియజేయడమేనని వివరించాడు. ఉద్యోగ వేటలో ఉన్నవారు నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని, నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించాడు. ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా? -
వర్క్ ఫ్రం హోమ్‌కే భారతీయుల ఓటు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగాలు ఆశించేవారిలో అత్యధికులు వీలైన పనివేళలను, ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును కోరుతున్నారని ఓ నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సెర్చి చేసిన వారి సంఖ్య 2017లో 111 శాతం పెరిగిందని ఇండీడ్ నిర్వహించిన వార్షిక అథ్యయనంలో వెల్లడైంది. మెరుగైన వేతన ప్యాకేజ్లతో, వెసులుబాటు కలిగిన పనివేళలతో కంపెనీలు జాబ్ ఆఫర్లతో ముందుకొస్తున్న క్రమంలో అభ్యర్థులూ తమకు వీలైన పనివేళలు, వర్క్ ఫ్రం హోమ్‌వైపు మొగ్గుచూపుతున్నారని, ఖాళీ సమయాల్లో వ్యక్తిగత ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నారని ఈ అథ్యయనంలో తేలింది. 2017లో డిజిటల్ మార్కెటింగ్, ప్రభుత్వ, సాంకేతిక సంబంధిత ఉద్యోగాల కోసం అన్వేషణ కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొంది. మారుతున్న ధోరణుల కారణంగా మెషిన్ లెర్నింగ్, డేటా సైంటిస్ట్, డేటా అనలిటిక్స్‌లో ఉద్యోగాల వేట పెరిగిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది పార్మ రంగంలో జాబ్ సెర్చి 40 శాతం తగ్గగా, ఆయుర్వేద విభాగంలో 56 శాతం వృద్ధి కనబరచడం గమనార్హం. టెక్నాలజీ రంగంలో అవకాశాలు పెరిగినా ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాబ్ సెర్చికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ఉద్యోగాలకు అమితాదరణ నెలకొన్నా భారత్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అర్రులుచాస్తున్నారని నివేదిక పేర్కొంది. -
సోషల్ మీడియా.. అప్రమత్తతే రక్ష!
జాబ్ స్కిల్స్ సామాజిక మాధ్యమాలు... ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య దూరాన్ని చెరిపేస్తున్న ఆధునిక వేదికలు. ఈ మాధ్యమాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి, అదేస్థాయిలో నష్టాలూ ఉన్నాయి. సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోవడం తెలిస్తే ఆశించిన ప్రయోజనం పొందొచ్చు. తెలియకపోతే నష్టపోవడం ఖాయం. జాబ్ సెర్చ్, రిక్రూట్మెంట్ అనేవి సామాజిక మాధ్యమాల ద్వారా కొనసాగుతున్నాయి. ఉద్యోగాల కోసం అభ్యర్థులు, తమకు తగిన అభ్యర్థుల కోసం రిక్రూటర్లు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. కొలువు వేట ప్రారంభించినవారు తమ ప్రొఫైల్‌ను, రెజ్యూమెను లింక్డ్ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్+ వంటి సైట్లలో పోస్టు చేస్తున్నారు. రిక్రూటర్లు వీటిని పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థుల గుణగణాలను తెలుసుకొనేందుకు ఆయా సైట్లలో వారి అకౌంట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. అకౌంట్లలో అవాంఛనీయ, అభ్యంతరకరమైన అంశాలుంటే వారిని తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే తమ సంస్థలో కొలువులో ఉన్నవారి అకౌంట్లను కూడా యాజమాన్యాలు గమనిస్తున్నాయి. కాబట్టి ఈ సామాజిక మాధ్యమాల్లో ఏయే అంశాలను పోస్టు చేయాలి, వేటిని చేయకూడదు అనే విషయంలో అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రొఫైల్‌కు ముస్తాబు ఏదైనా విందుకు హాజరు కావాలంటే సాధ్యమైనంత వరకు చక్కగా ముస్తాబై వెళతాం. సోషల్ మీడియాలో ప్రొఫైల్‌ను పోస్టు చేసేముందు కూడా దాన్ని ఇలాగే ముస్తాబు చేయాలి. ప్రొఫైల్‌ను తప్పుల్లేకుండా ఆకర్షణీయంగా రూపొందించుకోవాలి. పోస్టు చేసిన తర్వాత తరచుగా పరిశీలిస్తూ అప్డేట్ చేస్తుండాలి. అర్హతలు, అనుభవం పెరిగితే వాటిని అందులో తప్పనిసరిగా చేర్చాలి. ప్రొఫైల్ అసంపూర్తిగా ఉండకూడదు. మీకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపర్చాలి. మీకు ప్లస్ పాయింట్‌గా భావిస్తున్న ప్రతి అంశానికి అందులో చోటు కల్పించాలి. మీరిచ్చే సమాచారం పూర్తి సత్యమైనదై ఉండాలి. గొప్పల కోసం అసత్యాలు, అర్ధ సత్యాలను నమ్ముకుంటే మిగిలేది అప్రతిష్టే. మీ తాజా ఫొటోను కూడా అప్లోడ్ చేయండి. ఇందులో మీరు ప్రొఫెషనల్‌గా కనిపించాలి. స్నేహితులతో కలిసి సరదాగా తీసుకున్న ఫొటో ఇలాంటి చోట పనికిరాదు. ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ మీరు ఇప్పటికే ఒక సంస్థలో పనిచేసి ఉంటే అక్కడ సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పోస్టు చేయండి. ఇది మీకు అడ్వాంటేజ్‌గా మారుతుంది. ప్రొఫెషనల్ అచీవ్‌మెంట్స్‌ను హైలైట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. రిక్రూటర్లు ఇలాంటి వాటికి అధికా ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ పనితీరు, విజయాలు నచ్చితే వారి నుంచి పిలుపు రావొచ్చు. చెప్పడానికేమీ లేదా? ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతూ ఉంటే.. సోషల్ మీడియా అకౌంట్ల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సంస్థ, యాజమాన్యం, సహచరుల ప్రవర్తన, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేయొద్దు. సంస్థ ప్రతినిధులు వీటిని గమనిస్తుంటారు. మీ కామెంట్లు సంస్థ పేరును దెబ్బతీసేలా ఉంటే.. మీకు ఉద్యోగం నుంచి ఉద్వాసన తప్పదు. పోస్టు చేయడానికి మంచి విషయం ఏదీ లేకపోతే మౌనంగా ఉండండి. అంతేతప్ప చెడు ప్రచారం మాత్రం చేయకండి. అది మీకే వ్యతిరేకంగా పనిచేస్తుంది. దీనివల్ల మరో కంపెనీలో కూడా కొలువు దొరకదు. మీరు మంచి ఉద్యోగి, మంచి వ్యక్తి అనే విషయం మీ సోషల్ మీడియా అకౌంట్లను చూస్తే తెలిసిపోవాలి. కొన్ని జోక్‌లు ఫ్రెండ్స్‌తో చెప్పుకొని నవ్వుకోవడానికి పనికొస్తాయి కానీ, ఫేస్బుక్లో, ట్విట్టర్లో పెట్టడానికి కాదు. అబద్ధాలు వద్దు కొందరు తమకు జ్వరమని చెప్పి, ఆఫీస్‌లో సెలవు తీసుకుంటారు. మరుసటి రోజు పార్కులోనో, పబ్బులోనో చిందులేస్తారు. ఆ ఫొటోలను, ఎంజాయ్మెంట్ను సోషల్ మీడియాలో గొప్పగా పోస్టు చేస్తారు. వాటిపై కామెంట్లను చూసుకొని ఆనందిస్తుంటారు. ఈ ఫొటోలను కంపెనీ యాజమాన్యం చూస్తే ఏం జరుగుతుందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాచేసి మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. బాస్‌తో అబద్ధాలు చెప్పకండి. ఒకవేళ చెప్పినా మీ నిర్వాకాన్ని బయటపెట్టే అవకాశం సోషల్ మీడియాకు ఇవ్వకండి. -
లింక్డ్ ఇన్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా!
లింక్డ్ ఇన్.. నేటి యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్. యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో కంప్యూటర్లలో, స్మార్ట్ఫోన్లలో చోటు సంపాదించుకుంటోంది. ఉద్యోగాల వేట విషయంలో ఈ సైట్ ఎంతో ఉపయోగకరంగా మారింది. కంపెనీలకు, అభ్యర్థులకు మధ్య వారధిగా పనిచేస్తోంది. కంపెనీల్లో కొలువుల సమాచారాన్ని అభ్యర్థులకు, వారి వివరాలను కంపెనీలకు లింక్డ్ ఇన్ వేగంగా చేరవేస్తోంది. ఇందులో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 65 మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారు. లింక్డ్ ఇన్ ఇప్పుడు ప్రభావంతమైన, ఆధునిక జాబ్ సెర్చ్ టూల్‌గా మారింది. వివిధ రంగాల ప్రొఫెషనల్స్‌ను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ సైట్ ప్రత్యేకత. ప్రపంచంలోని చాలా కంపెనీల సమాచారాన్ని, వాటిలో కొలువుల వివరాలను క్షణాల్లో కళ్లముందుంచుతోంది. జాబ్ హంట్ విషయంలో లింక్డ్ ఇన్ సహాయం పొందితే సులువుగా విజయం సాధించొచ్చు. ఇష్టమైన కొలువును సొంతం చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అప్లోడ్ మీ అకడమిక్, ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్, మీ అర్హతలు, నైపుణ్యాలను లింక్డ్ ఇన్ పేజీలో అప్లోడ్ చేయండి. సైట్ సెర్చ్ ఇంజన్లో ఈ సమాచారమంతా నమోదవుతుంది. రిక్రూటర్లు తమకు కావాల్సిన అభ్యర్థుల కోసం వెతికేటప్పుడు మీ వివరాలను పరిశీలిస్తారు. తగిన అభ్యర్థి అని భావిస్తే మిమ్మల్ని ఎంచుకుంటారు. రికమండేషన్లు ప్రొఫైల్ పూర్తి కావాలంటే రికమండేషన్లు అవసరం. ఈ లింక్డ్ ఇన్‌లో ఈ ఫీచర్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోండి. మీ పాత యాజమాన్యం లేదా సహోద్యోగులు, ప్రొఫెసర్లు మీ పేరును సిఫార్సు చేసేలా చూసుకోండి. రికమండేషన్లను చేరిస్తే జాబ్ మార్కెట్లో మీ ప్రొఫైల్‌కు విలువ పెరుగుతుంది. అప్డేట్స్ సైట్లో మీ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. మీ అర్హతలు, అనుభవాలు పెరిగితే వాటిని చేర్చండి. రిక్రూటర్లు మీ నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతారు. వారి సంస్థల్లో కొలువులు ఖాళీగా ఉన్నప్పుడు మీకు సమాచారం చేరవేస్తారు. ఒక కంపెనీలో మీ అర్హతలకు తగిన కొలువులుంటే మీకు వివరాలు తెలుస్తాయి. లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఒక రెజ్యూమెగా కూడా పనిచేస్తుంది. గ్రూప్‌ల్లో చేరండి మీ రంగానికి, మీ కెరీర్ లక్ష్యాలకు, అభిరుచులకు సంబంధించిన గ్రూప్‌లను లింక్డ్ ఇన్‌లో సెర్చ్ చేయండి. వాటిలో సభ్యులుగా చేరండి. ఆయా గ్రూప్‌ల డిస్కషన్ బోర్డుల్లో పాల్గొనండి. దీంతో మీ నెట్వర్క్ విస్తరిస్తుంది. మీ రంగంలో వస్తున్న మార్పులు, తాజా సమాచారం ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. కొత్త ధోరణులపై అవగాహన పెరుగుతుంది. కొలువు సంపాదించడానికి, కెరీర్లో ఎదగడానికి ఇది తోడ్పడుతుంది. పీపుల్స్ ట్యాబ్ లింక్డ్ ఇన్ సైట్లో పీపుల్స్ ట్యాబ్ విభాగంలో పరిశ్రమ ప్రముఖుల సమాచారం, మీ రంగానికి చెందిన కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఉంటాయి. వారిని సంప్రదించి, మీ సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీ ప్రొఫైల్స్ విభాగంలో ఉద్యోగుల కెరీర్ హిస్టరీ ఉంటుంది. అభ్యర్థుల నుంచి రిక్రూటర్లు ఏయే అంశాలను కోరుకుంటున్నారో దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్వ్యూ సన్నద్ధతకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. జాబ్ బోర్డు లింక్డ్ ఇన్ సొంతంగా జాబ్ బోర్డును నిర్వహిస్తోంది. ఇది ఒక జాబ్ పోర్టల్ లాగే పనిచేస్తుంది. రిక్రూటర్ల పేర్లతో సహా కొలువుల వివరాలు ఇందులో ఉంటాయి. రిక్రూటర్‌తో డెరైక్ట్ కమ్యూనికేషన్‌కు ఇది వీలు కల్పిస్తుంది. ఎడ్యూ న్యూస్ మ్యాట్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 25 దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్)- డిసెంబర్ పరీక్షకు నవంబర్ 25వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్/ ఆఫ్‌లైన్ విధానాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు, బ్యాచిలర్స్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మ్యాట్ రాయొచ్చు. పేపర్ బేస్డ్ పరీక్ష డిసెంబర్ 7న ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) డిసెంబర్ 13 నుంచి ప్రారంభమవుతుంది. అడ్మిట్ కార్డులను నవంబర్ 29 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) మ్యాట్‌ను నిర్వహిస్తారు. వెబ్సైట్: www.aima.in భవిష్య జ్యోతి ఉపకార వేతనాలు గుర్గావ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఐటీ) భవిష్య జ్యోతి స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తోంది. ఎన్ఐఐటీ అందిస్తున్న అన్ని కోర్సులను అభ్యసిస్తున్నవారు ఈ ఉపకార వేతనం పొందడానికి అర్హులు. కోర్సులో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్షిప్లను అందజేస్తారు. ఎంపికైన వారికి రూ.60 వేల వరకు ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: www.niitcloudcampus.com/ భారత విద్యార్థులకు ఆస్ట్రేలియా వర్సిటీ స్కాలర్షిప్ ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ వొలన్‌గాంగ్(యూఓడబ్ల్యూ) భారత విద్యార్థుల కోసం సర్ డాన్ బ్రాడ్‌మన్ స్కాలర్షిప్ను ప్రకటించింది. 2014 సంవత్సరానికి గాను బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌తో కలిసి ఈ ఉపకార వేతనాన్ని అందిస్తోంది. క్రికెట్‌ను ప్రమోట్ చేసే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ను ప్రతిఏటా భారత విద్యార్థులకు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వొలన్‌గాంగ్ వర్సిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులను అభ్యసిస్తున్న ప్రతిభావంతులైన భారతీయులకు వారి కోర్సు ఫీజులో 50 శాతం చెల్లిస్తారు. వివరాలకు వెబ్సైట్: www.uow.edu.au జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇంజనీర్ అసిస్టెంట్ ట్రైనీ అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభా గంలో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్ ‘సి’ అర్హతలు: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1 వెబ్సైట్: www.bel-india.com నిమ్స్ హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్) కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ (నర్సింగ్). సీట్ల సంఖ్య: 21, అర్హతలు: జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి. మాస్టర్ ఆఫ్ ఫిజియో థెరపీ సీట్ల సంఖ్య: 15 అర్హతలు: ఫిజియో థెరపీలో డిగ్రీ ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ పారా మెడికల్ డిప్లొమా కోర్సెస్. సీట్ల సంఖ్య: 57 దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30 వెబ్సైట్: www.nims.edu.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(డ్యూయల్ కంట్రీ) ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్(ఎగ్జిక్యూటివ్) పార్ట్‌టైం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అర్హతలు: 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. క్యాట్/గ్జాట్/జీమ్యాట్‌లో అర్హత సాధించాలి. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 24 వెబ్సైట్: http://imt.edu/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాధాన్యతను తెలపండి? ఎలా ప్రిపేరవ్వాలి? - బద్ధం కన్నారెడ్డి, ఉప్పల్ పరీక్షలో చరిత్ర నుంచి సుమారు 25 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి 4 నుంచి 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ అంశాలను పక్కాగా ప్రిపేరైతే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. జైన, బౌద్ధమత సంబంధిత అంశాల నుంచే ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మహావీరుడు, గౌతమ బుద్ధుడు జన్మించిన, నిర్యాణం చెందిన ప్రదేశాలను గుర్తుంచుకోవాలి. అలాగే జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన ప్రధాన సూత్రాలను, గ్రంథాలను, నియమాలను అభ్యర్థులు ప్రత్యేక దృష్టితో చదవాలి. వీటిని పట్టిక రూపంలో సిద్ధం చేసుకుంటే గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుంది. గౌతమ బుద్ధుడికి సంబంధించిన మహాభినిష్ర్కమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరినిర్యాణం తదితర అంశాలు ఎక్కడ, ఎందుకు జరిగాయో తెలుసుకోవాలి. బౌద్ధమత అష్టాంగ మార్గాలు, జైన మత పంచవ్రతాలనూ సులభంగా గుర్తుంచుకోవడానికీ వాటిలోని మొదటి అక్షరాలతో ఒక పదాన్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు బౌద్ధమత అష్టాంగ మార్గాలైన సరైన మాట(వాక్కు), జీవనం, ఆలోచన, ధ్యానం, పని(క్రియ), కష్టం(శ్రమ), నిర్ణయం, చూపు(దృష్టి) నుంచి ‘మాజీ ఆధ్యాపకుని చూపు’ అని ఒక సులభమైన వాక్యంగా తయారు చేసుకోవచ్చు. ఇన్పుట్స్: బొమ్మనబోయిన శ్రీనివాస్, సీనియర్ ఫ్యాకల్టీ, హన్మకొండ -
కొలువు వేటకు మార్గాలివి..!
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కోరుకున్న ఉద్యోగంలో చేరిపోవడం అనుకున్నంత సులభం కాదు. మార్కెట్లో ఉద్యోగావకాశాలు విస్తృతమవుతున్నప్పటికీ పోటీ కూడా అంతేస్థాయిలో పెరిగిపోతోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కోరుకున్న ఉద్యోగం పొందాలంటే అలుపెరుగక శ్రమించాల్సిందే. జాబ్ సెర్చ్‌కు ఊహించినదానికంటే ఎక్కువ కాలమే పడుతుంది. అయినా నిరాశ చెందకుండా ప్రయత్నాలను కొనసాగించాలి. అభ్యర్థులు అందుకు ముందుగానే మానసికంగా సిద్ధపడాలి. కొలువు వేటలో మునిగినవారు కొన్ని మెలకువలను పాటిస్తే సులువుగా విజయం సాధించొచ్చు. ఉద్యోగస్థుడిగా కెరీర్‌ను ప్రారంభించొచ్చు. సన్నద్ధత: పోటీ తీవ్రంగా ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. కాబట్టి కార్యాచరణ, సన్నద్ధత(ప్రిపరేషన్) కూడా అదేస్థాయిలో ఉండాలి. మీ బలాలు, బలహీనతలను అంచనా వేసుకోండి. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? ఎందులో రాణిస్తారు? అనే విషయం తెలుసుకోండి. మీ అంచనాలను బట్టి మీరు పనిచేయాలనుకుంటున్న సంస్థల జాబితాను తయారు చేసుకోండి. ఆయా సంస్థల వ్యాపార కార్యకలాపాలు, అందులో బాధ్యతల గురించి పరిశోధించండి. తదనుగుణంగా ఇంటర్వ్యూకు సన్నద్ధమవ్వాలి. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఆకట్టుకొనే కవర్ లెటర్: ఇంటర్వ్యూకు సిద్ధమైన తర్వాత మీ వివరాలతో కూడిన మంచి కవర్ లెటర్‌ను రూపొందించుకోవాలి. దీన్ని దరఖాస్తుతోపాటు పంపించాల్సి ఉంటుంది. రిక్రూటర్ మొదట కవర్ లెటర్‌నే చూస్తారు. ఇది వారిని ఆకట్టుకుంటే సగం పని పూర్తయినట్లే. మీ అర్హతలు, అనుభవం వంటి వాటిని ఇందులో క్లుప్తంగా ప్రస్తావించండి. ఉద్యోగానికి మీరు నూటికి నూరు శాతం తగిన అభ్యర్థి అనే విషయం ఈ లెటర్ ద్వారా రిక్రూటర్‌కు తెలియాలి. డైనమిక్ రెజ్యూమె: మిమ్మల్ని మీరు ఒక ఉత్పత్తి(ప్రొడక్ట్)గా భావించుకోండి. మిమ్మల్ని మార్కెట్ చేసేది.. రెజ్యూమె. మీ అనుభవాలు, అర్హతలు, సాధించిన విజయాలు, బలాలను ఇందులో పొందుపర్చండి. దరఖాస్తు చేస్తున్న ఉద్యోగానికి అవసరమైన అంశాలను వరుస క్రమంలో వివరించండి. రిక్రూటర్లు అభ్యర్థుల రెజ్యూమెలను చదవడానికి ఎక్కువ సమయం వెచ్చించలేరు. కనుక ఇది తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం ఇచ్చేలా ఉండాలి. ఇంటర్వ్యూ నైపుణ్యాలు: ప్రిపరేషన్, కవర్ లెటర్, రెజ్యూమె.. ఈ మూడూ అభ్యర్థిని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకెళ్లడం వరకు మాత్రమే పనిచేస్తాయి. ఉద్యోగం సాధించగలరా? లేదా? అనేది ఇంటర్వ్యూలోనే తెలిసిపోతుంది. మౌఖిక పరీక్షలో రిక్రూటర్‌ను మెప్పిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ప్రొఫెషనల్‌గా కనిపించే వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగిస్తూ ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కొంటే ఉద్యోగం దక్కించుకోవడం సులువే. ఫాలో-అప్ మౌఖిక పరీక్ష పూర్తయిన తర్వాత కూడా వీలును బట్టి కంపెనీతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. ఇంటర్వ్యూ స్టేటస్‌ను తెలుసుకోవడానికి సంస్థకు ఈ-మెయిళ్లు పంపాలి. అవసరమైతే ఫోన్ చేస్తుండాలి. దీనివల్ల ఉద్యోగంపై మీలో నిజంగా ఆసక్తి ఉందనే విషయాన్ని రిక్రూటర్ గుర్తిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంచి కొలువు కావాలంటే అభ్యర్థుల్లో ఓపిక, సహనం ఉండాలి. అంకితభావంతో పనిచేయాలి. -
జాబ్ సెర్చ్‌కు టెక్నాలజీని వాడుకోండి !
మీ అర్హతలు, నైపుణ్యాలకు తగిన మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే, అది ఎక్కడ లభిస్తుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. జాబ్ సెర్చ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పోటీ ప్రపంచంలో ఇతరులను దాటి ముందుకెళ్లాలంటే అభ్యర్థులు ఈ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. జాబ్ పోర్టల్స్: ఒక్క క్లిక్‌తో అంతర్జాలంలో కొలువుల వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో జాబ్ పోర్టళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోకి ప్రవేశించి, అర్హతలకు తగిన ఉద్యోగాలను, రంగాలను వెతుక్కోవచ్చు. సంస్థలు ప్రకటించిన ఖాళీల సమాచారం, దరఖాస్తు ప్రక్రియ గురించి జాబ్ పోర్టళ్లలో ఉంటుంది. కంపెనీల వివరాలు, కెరీర్ సలహాలు కూడా ఇందులో లభిస్తాయి. కాబట్టి ఉద్యోగాల వేటలో మునిగిన అభ్యర్థులు ఇలాంటి పోర్టళ్లను ఉపయోగించుకుంటే శ్రమ తగ్గుతుంది. అనుకున్న లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. ఈ-రెజ్యుమె: పేపర్ రెజ్యుమెలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఇకపై ఎలక్ట్రా నిక్-రెజ్యుమె(ఈ-రెజ్యుమె)లతోనే పని పూర్తవుతుంది. కంపెనీలు అభ్యర్థుల నుంచి ఇలాంటి రెజ్యుమెలనే స్వీకరిస్తాయి. కాబట్టి ప్రభావవంతమైన ఈ-రెజ్యుమెను రూపొందించు కోవాలి. ఇంటర్నెట్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో సలహాలు, సూచనలు కూడా లభిస్తాయి. వాటిని పరిశీలించాలి. సొంతంగా ఈ-రెజ్యుమెను రూపొందించుకున్న తర్వాత దాన్ని జాబ్ పోర్టళ్లకు, వెబ్సైట్లకు ఈ-మెయిల్ ద్వారా పంపించాలి. మీ అర్హతలను తగిన ఉద్యోగాలంటే.. కంపెనీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. రిక్రూటర్ నుంచి మీకు పిలుపు వస్తుంది. వీడియో రెజ్యుమె: దరఖాస్తుల విషయంలో తెరపైకొచ్చిన మరో ఆధునిక ధోరణి.. వీడియో రెజ్యుమె. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, ఇతర వివరాలను స్వయంగా చెబుతూ ప్రభావవంతమైన వీడియోను చిత్రీకరించుకోవాల్సి ఉంటుంది. దీని వ్యవధి సాధారణంగా రెండు నుంచి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది. కొలువు ప్రకటనను చూసిన తర్వాత ఈ వీడియో రెజ్యుమెను రిక్రూటర్‌కు పంపించాలి. ఇటీవలి కాలంలో సంస్థలు ఇలాంటి రెజ్యుమెలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. సీడీలో రెజ్యుమె: కాంపాక్ట్ డిస్క్(సీడీ)లో రెజ్యుమెను భద్రపర్చుకోవాలి. అవసరాన్ని బట్టి దాన్ని రిక్రూటర్‌కు పంపించాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు రెజ్యుమెను సీడీలో పంపించాలని కోరుతుంటాయి. కాబట్టి ముందుగానే ఇలాంటి సీడీని రూపొందించుకోవడం మేలు. సొంత వెబ్సైట్: ఆధునిక కాలంలో అన్ని సంస్థలకు వెబ్సైట్లు సర్వసాధారణంగా మారాయి. అభ్యర్థులు కూడా తమ పేరిట సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవాలి. ఇందుకోసం వెబ్సైట్ డెవలప్మెంట్లో కొంత శిక్షణ పొందాలి. ఇందులో మీకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపర్చాలి. కొలువు వేటలో ఉన్నవారికి ఇలాంటి సొంత వెబ్సైట్ ఉపయోగపడుతుంది. సంస్థలు అభ్యర్థి వెబ్‌సైట్‌ను పరిశీలించి, ఇంటర్వ్యూకు పిలిచేందుకు అవకాశాలుంటాయి. సామాజిక మాధ్యమాలు: ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థులకు తప్పనిసరిగా ఖాతా ఉండాలి. వాటిలో తమ పూర్తి ప్రొఫైల్‌ను పొందుపర్చాలి. రిక్రూటర్లు వీటిని చూసి, తమకు తగిన అభ్యర్థులను ఎంచుకుంటారు.