టిక్ నో టాక్
స్వల్పనిడివి వీడియో మెసెంజింగ్ యాప్‌గా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరి స్మార్ట్ఫోన్లలో స్థానం సంపాదించిన టిక్‌టాక్ యాప్ ఇప్పుడు అమెరికాలో అదృశ్యం కానుంది. ఆదివారం (జనవరి 19వ తేదీ) నుంచి అమెరికాలో యాప్ సేవలు దాదాపు ఆగిపోయినట్లేనని టిక్‌టాక్ యాజమాన్యం శుక్రవారం అర్ధరాత్రిదాటాక ఒక ప్రకటనలో పేర్కొంది. యాప్ యూజర్ల డేటా దాని మాతృ సంస్థ అయిన ‘బైట్‌డ్యాన్స్’ద్వారా చైనా వామపక్ష ప్రభుత్వానికి చేరుతోందని అమెరికా ప్రధాన ఆరోపణ. చైనాతో బంధం తెంచుకుని, టిక్‌టాక్‌ను ఆదివారంకల్లా అమెరికా కేంద్రంగా పనిచేసే ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా దేశ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టంచేసినప్పటికీ బైట్‌డ్యాన్స్ ఈ దిశగా అడుగులువేయలేదు. దీంతో అమెరికాలో టిక్‌టాక్ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి. వినోదం పంచిన యాప్ తర్వాత దేశభద్రత అంశంతో ముడిపడి చివరకు అగ్రరాజ్యాన్నే వదిలేస్తున్న వైనం ఆద్యంతం ఆసక్తిదాయకం. అగ్రస్థానం నుంచి అదృశ్యం దాకా.. చైనా వ్యాపారి ఝాంగ్ యిమిన్ 2012లో బైట్‌డ్యాన్స్ అనే సంస్థను స్థాపించారు. తర్వాత రెండేళ్లకు అలెక్స్ ఝూ అనే వ్యాపారి Musical.ly అనే స్టార్టప్‌ను రూపొందించాడు. వీడియోలకు తగ్గట్లు పెదాలు కదిలిస్తూ వీడియో తీసి అప్లోడ్ చేసే యాప్‌గా దీనిని అందుబాటులోకి తెచ్చాడు. ఇది 2015 జూలైకల్లా ఆపిల్ యాప్‌స్టోర్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ Musical.ly ను బైట్‌డ్యాన్స్ ఒక బిలియన్ డాలర్లకు కొనుగోలుచేసి సొంత ‘డౌయిన్’యాప్‌లో విలీనంచేసి విదేశీ యూజర్ల కోసం కొత్తగా టిక్‌టాక్ యాప్‌ను తెచ్చింది. ర్యాపర్ లిల్ నాస్ ‘ఓల్డ్ టౌన్ రోడ్’పాటకు చేసిన డ్యాన్స్ వీడియో టిక్‌టాక్‌లో పాపులర్ అవడంతో అందరూ టిక్‌టాక్ బాట పట్టారు. పాపులర్ డ్యాన్స్ స్టెప్పులు, వంటల విశేషాలు, బ్యూటీ టిప్స్, పాటలకు తగ్గ పార్ఫార్మెన్స్ ఛాలెంజ్‌లను ప్రోత్సహిస్తూ సాగే వీడియోలతో టిక్‌టాక్ అనతికాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నంబర్‌వన్ షార్ట్‌వీడియో మెసేజింగ్ యాప్‌గా అవతరించింది. చైనా వ్యతిరేకత అస్సలు కనపడదు ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి అంశం ఒక పాటగానో, డ్యాన్స్గానో టిక్‌టాక్‌లో ప్రత్యక్షమైనా చైనా వ్యతిరేక వీడియోలు మాత్రం అస్సలు కనబడవు. 1989 తియాన్మెన్స్కే్వర్ ఉద్యమం, నాటి ఊచకోత, టిబెటన్ల స్వాతంత్య్రపోరాటం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమంపైనా అన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు కనిపించినా టిక్‌టాక్‌లో మాత్రం అలాంటివేమీ దర్శనమివ్వలేదు. కానీ ట్రంప్‌కు మద్దతు పలుకుతూ పెట్టిన #trump2020 హ్యాష్‌ట్యాగ్‌తో వచ్చిన పోస్టులు మాత్రం కోట్లాదిగా షేర్ అయ్యాయి. 2019లో అమెరికాలో తొలి ఆందోళన సెన్సార్టవర్ అంచనా ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ అవుతున్న యాప్‌గా టిక్‌టాక్ నిలిచింది. టిక్‌టాక్‌కు ప్రస్తుతం అమెరికాలో 17 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే అమెరికా సైన్యానికి చెందిన సమాచారాన్ని టిక్‌టాక్ తన మాతృసంస్థకు చేరవేస్తోందని 2019లో తొలిసారిగా ఆందోళన వ్యక్తమైంది. దీంత అన్ని స్మార్ట్ఫోన్లలో టిక్‌టాక్ యాప్ తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలిచి్చంది. అయినాసరే విపరీతంగా యాప్‌కు బానిసలుగా మార్చేసి అమెరికా చిన్నారుల పరిరక్షణా చట్టాలను టిక్‌టాక్ ఉల్లంఘిస్తోందని 2020 లో ప్రైవసీ సంస్థలు ఆందోళనకు దిగాయి. దీంతో తాము అమెరికన్లకు దగ్గరి వాళ్లమని మభ్యపెట్టేందుకు డిస్నీ ఉన్నతాధికారి కెవిన్ మేయర్‌కు టిక్‌టాక్ తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించుకుంది. భారత్‌లో బ్యాన్ సరిహద్దుల్లో చైనా సైనికులతో ఘర్షణ తర్వాత జాతీయభద్రత ప్రమాదంలో పడిందని పేర్కొంటూ భారత్ టిక్‌టాక్‌ను 2020 జూలైలో నిషేధించింది. కోవిడ్ సంక్షోభంలో వాస్తవాలను ప్రపంచానికి వెల్లడించని చైనాకు బుద్ధిచెప్పేందుకైనా టిక్‌టాక్‌ను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ సైతం నిషేధాన్ని సమరి్థంచారు. 90 రోజుల్లోపు అమెరికా నుంచి వైదొలిగితే మంచిదని 2020 ఆగస్ట్‌లో ట్రంప్ ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీచేశారు. తర్వాత టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్‌మార్ట్ ప్రయతి్నంచినా అది కార్యరూపం దాల్చలేదు. బైడెన్ వచ్చాక.. 2021 ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడు బైడెన్ టిక్‌టాక్‌పై నిషేధానికి ట్రంప్ ఇచి్చన ఉత్తర్వులు అమలుకాకుండా మూలనపడేశారు. అయితే బక్కచిక్కిపోయేలా అతి ఆహార నియమాల వంటి తప్పుడు సూచనలు ఇచ్చే వీడియోల వరద టిక్‌టాక్‌లో ఎక్కువైందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక నివేదిక ఇవ్వడంతో టిక్‌టాక్‌పై బైడెన్ మళ్లీ దృష్టిసారించారు. అమెరికాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుంటూనే ఇన్‌స్టా గ్రామ్ను వెనక్కినెట్టి ప్రపంచంలో అత్యధిక డౌన్లోడ్లు జరిగిన యాప్‌గా టిక్‌టాక్ చరిత్ర సృష్టించింది. వంద కోట్ల మంది నెలకు తమ యాప్ వాడుతున్నారని ప్రకటించింది. మరోవైపు అమెరికా యూజర్ల డేటా భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో నష్టపరిహార చర్యలకు టిక్‌టాక్ దిగింది. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ పర్యవేక్షణలో ఉండే సర్వర్లకు డేటాను బదిలీచేస్తున్నట్లు ప్రకటించింది. రంగంలోకి ఎఫ్‌బీఐ జాతీయ భద్రత కీలకాంశం కావడంతో అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. అమెరికన్లను ప్రభావితం చేసేలా యాప్ అల్గారిథమ్‌ను చైనా మాతృసంస్థ మార్చేస్తోందని ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే 2022 డిసెంబర్లో ఆరోపించారు. 30 రోజుల్లోపు అన్ని ప్రభుత్వం జారీచేసిన స్మార్ట్ఫోన్ల నుంచి యాప్‌ను తీసేయాలని శ్వేతసౌధం 2023 ఫిబ్రవరిలో ఆదేశాలిచి్చంది. యాప్ నిబద్ధతపై టిక్‌టాక్ సీఈవో షూఝీ ఛెవ్ను మార్చిలో అమెరికా పార్లమెంటరీ కమిటీ గంటలతరబడి ప్రశ్నించింది. నిషేధానికి తొలి అడుగు అమెరికన్ సంస్థకు టిక్‌టాక్‌ను అమ్మాలని లేదంటే నిషేధిస్తామని 2024 మార్చిలో అమెరికా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లుపై 2024 ఏప్రిల్‌లో అధ్యక్షుడు బైడెన్ సంతకంచేశారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై బైట్‌డ్యాన్స్ కోర్టును ఆశ్రయించింది. మిగతా యాప్‌లను వదిలేసి మా సంస్థపైనే ప్రభుత్వం కక్షగట్టిందని వాదించింది. అయితే నిషేధాన్ని సమరి్థస్తూ ఫెడరల్ అప్పీళ్ల కోర్టు 2024 డిసెంబర్ ఆరున తీర్పు చెప్పింది. మాట మార్చిన ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిషేధిస్తానని ప్రతిజ్ఞచేసిన ట్రంప్ ఆ తర్వాత పదవి నుంచి దిగిపో యాక మాటమార్చారు. 2024 జూన్‌లో మళ్లీ టిక్‌టాక్ ఖాతా తెరచి ఈ యాప్‌కు మద్దతు పలికారు. టిక్‌టాక్‌ను నిషేధిస్తే ఫేస్‌బుక్‌కు లాభం చేకూరుతుందని ట్రంప్ వింత వాదన చేశారు. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది. పొలోమంటూ రెడ్‌నోట్ డౌన్లోడ్ టిక్‌టాక్ కనుమరుగు దాదాపు ఖాయంకావడంతో ఇప్పటికే ఇలాంటి వీడియోలకు బానిసలైన అమెరికన్లు వెంటనే రెడ్‌నోట్ యాప్‌కు జై కొట్టారు. దీంతో అమెరికాలో అత్యంత ఎక్కువ డౌన్లోడ్లు ఉన్న యాప్‌గా రెడ్‌నోట్ రికార్డు సృష్టించింది. అయితే రెడ్‌నోట్ కూడా చైనా యాప్ కావడం విశేషం. లైఫ్‌స్టైల్ సోషల్‌మీడియా యాప్ అయిన రెడ్నోట్లోనూ చిన్నపాటి వీడియోలు చేయొచ్చు. ఫొటోలు, సందేశాలు పంపొచ్చు. లైవ్ స్ట్రీమింగ్, షాపింగ్ చేసుకోవచ్చు. గ్జియోహోంన్షు యాప్‌నే సులభంగా రెడ్నోట్గా పిలుచుకుంటారు. దీనిని ప్రస్తుతం 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. బద్ధశత్రువుల దేశాలకు చెందిన పౌరులు ఒకే ప్లాట్‌ఫామ్‌లను ఆశ్రయించడం వింతే. ఇన్‌స్టా గ్రామ్, ‘ఎక్స్’యాప్‌లను చైనీయులు వాడలేరు. చైనా ఇంటర్నెట్లో వీటిని అక్కడి ఫైర్‌వాల్స్ అడ్డుకుంటాయి. మరోవైపు చైనా యూజర్లు టిక్‌టాక్‌ను వాడలేరు. వీళ్లనూ బుట్టలో వేసుకునేందుకు వాళ్ల కోసం చైనాలోనే డౌయిన్ అనే యాప్‌ను బైట్‌డ్యాన్స్ అందుబాటులో ఉంచింది. – సాక్షి, నేషనల్ డెస్క్