జడ్జీల నియామకానికి ఉమ్మడి పరీక్ష!
► దిగువ స్థాయి కోర్టుల్లో ఖాళీల భర్తీకి కేంద్రీకృత వ్యవస్థ
► సంబంధిత ‘కాన్సెప్ట్ నోట్’ విడుదల
న్యూఢిల్లీ: దిగువ స్థాయి కోర్టుల్లో జడ్జీల ఎంపికకు ఏకైక ఉమ్మడి పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనను సుప్రీంకోర్టు త్వరలో పరిశీలించనుంది. ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ రూపొందించిన ‘కాన్సెప్ట్ నోట్’ను గురువారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దేశంలో జిల్లా, ఇతర దిగువ స్థాయి కోర్టుల్లో మొత్తం జడ్జీలు సుమారు 21వేలు ఉండాల్సి ఉండగా, అందులో 4,800 ఖాళీగా ఉన్నట్లు నోట్ పేర్కొంది.
జడ్జీల నియామక ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్రీకృత నియామక విధానం(సీఎస్ఎం) కింద డిస్ట్రిక్ట్ జడ్జెస్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్(డీజ్యూర్) నిర్వహించాలని అందులో ప్రతిపాదించారు. డీజ్యూర్ ద్వారా ఏటా 300 ఖాళీలను భర్తీ చేయాలని సూచించింది. ఈ విధానం కేవలం ‘అభ్యర్థుల పూల్’ను మాత్రమే ఇస్తుందని, అందులో నుంచి ఇంటర్వ్యూల ద్వారా అర్హులను ఎంపిక చేయాలని స్పష్టత ఇచ్చింది. ‘అర్హులైన న్యాయవాదులు లేకపోవడంతో జిల్లా జడ్జీల పదవులు ఖాళీగా ఉంటున్నాయి.
క్రమబద్ధమైన పరీక్ష విధానం లోపించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అభ్యర్థులు ముందస్తుగా సన్నద్ధమయ్యేందుకు ప్రత్యేక సిలబస్ అంటూ లేదు. ఇలాంటి లోటుపాట్లను డీజ్యూర్తో అధిగమించొచ్చు’ అని నోట్ పేర్కొంది. ‘ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి డీజ్యూర్ ఆటంకంకలిగించదు. రిజర్వేషన్లు, అర్హత నియమాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి’ అని నోట్ పునరుద్ఘాటించింది.