‘ట్రంప్ వద్దనుకుంటే పొరుగు దేశం పోండి’
న్యూయార్క్: కొందరు అమెరికన్లు, వలస దారులపై ఓ ఫెడరల్ మేజిస్ట్రేట్ జడ్జి జాన్ ప్రిమామో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఎవరికి నచ్చకుంటే వారు దేశం విడిచి పొరుగు దేశానికి వెళ్లిపోవచ్చంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా ఆందోళనలు నిర్వహించడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.
‘మీరు ట్రంప్ కు ఓటు వేశారా? లేదా ? అనే విషయం గురించి మాట్లాడను. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. మీరు నిజంగా అమెరికా పౌరులే అయితే, ట్రంప్ ఇప్పుడు మీ అధ్యక్షుడు.. ఆయనే ఉంటాడు. ఒక వేళ మీకు అది ఇష్టం లేకుంటే పొరుగు దేశం వెళ్లిపోండి’ అని ఆయన అన్నారు. ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో శాన్ ఆంటోనియోలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్సాన్ కల్చర్స్ లో ‘కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన డోనాల్డ్ ట్రంప్’ అనే అంశంపై ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించేందుకు జాన్ ప్రిమామో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమెరికా జాతీయ గీతం ఆలపించే సమయంలో కొలిన్ కాపెర్నిక్ అనే వ్యక్తి ఏమాత్రం గౌరవం లేకుండా మొకాళ్లపై నిరసన వ్యక్తం చేయడాన్ని తప్పు బట్టారు. ఈ దేశంలో ఎలాంటి వ్యతిరేక చర్యలు జరుగుతున్నా వాటి కోసం ఆందోళన చేసే హక్కు ఉందని, కానీ, జాతీయ చిహ్నాలు, గీతాలువంటి వాటిని అవమానించే పనులు చేయకూడదని హితవు పలికారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడని ఆయన స్పష్టం చేశారు.