juluru gouri shankar
-
గ్రామ స్వరాజ్యమే ఊపిరిగా..
తెలంగాణలో నాగరికతకు నాగలినిచ్చిన వాణ్ణి ఇప్పుడు నిలబెట్టాలి. తాళిబొట్లను అందించిన వాళ్ల కుటుంబాల పసుపు కొమ్ములు రాలిపోకుండా చూడాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా విశ్వకర్మలు శిరసెత్తుకుని నిలవాలి. కాళ్లూచేతులు పడిపోయిన తెలంగాణ గ్రామీణ వ్యవస్థకు ఇపుడు పునర్నిర్మాణ చికిత్స జరుగుతోంది. గ్రామీణ వ్యవస్థ తిరిగి శిరసెత్తుకుని నిలిచేం దుకు చేయాల్సిన పనులన్నీ మొదలవుతున్నాయి. గ్రామం తిరిగి కళకళలాడాలంటే గ్రామీణ చేతివృత్తులన్నీ శక్తివంతం కావాలి. ఇవన్నీ ఆధునీకతను సంతరించుకోవాలి. మొత్తం తెలంగాణ సమాజంలో సగభాగంగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన వృత్తులన్నింటినీ ఆధునీకరించాలి. తెలంగాణలో కుమ్మరి వృత్తిబాగా దెబ్బతిన్నది. కుండల వాడకం తగ్గిపోయింది. వీరికి వెంటనే ప్రత్యామ్నాయం చూడాలి. ఇంకా కుమ్మరివృత్తిలో కొనసాగే వారి చేతివేళ్లలో ఉన్న నైపుణ్యం మాత్రం గొప్పది. వారితో ఆధునిక సమాజం ఉపయోగించుకునే మట్టితో తయారు చేసే వస్తువులను ఆధునిక పరిజ్ఞానాన్ని కూర్చి తయారీని చేపట్టవచ్చు. వడ్రంగి పని దగ్గరకు వస్తే, నాగలితో దున్నే సంఖ్య తగ్గిపోయింది. ఎడ్ల బండ్లు మాయమవుతున్నాయి. నాగలి, మేడి, దంతె, కర్రు, బండిచక్రం, బండిఆకులు, ఇరుసులు వంటి పనిముట్లు చేయించే స్థితి క్రమంగా తగ్గిపోయింది. వ్యవసాయానికి ట్రాక్టర్ సింబ ల్గా మారింది. వరికోసే యంత్రాలు వచ్చాయి. తెల్లవారుతుంటే కళకళలాడే వడ్రంగుల వాకిళ్లు.. పనులే లేక బిక్కమొకం వేసి మట్టిగొట్టుకునిపోయాయి. ఇంటినిర్మాణ పనులకు మాత్రమే వడ్రంగి వృత్తి మిగి లింది. వడ్రంగి వృత్తిలో చేసే ఫర్నిచరు సామాన్లు అన్నీ గ్లోబల్ సంతల్లో విదేశాల నుంచి వచ్చిపడుతున్నాయి. దీంతో ఈ వృత్తి పనిలేక గ్రామం వదిలి పట్టణాలకు, నగరాలకు వలసలు పోయారు. ఈ వృత్తిని పూర్తిగా మిషనరీ పనిగా మార్చాలి. వడ్రంగి వృత్తికి ఆధునిక పరిజ్ఞానాన్ని అద్ది దాన్ని కాపాడాలి. ప్రపంచమార్కెట్ పోటీకి నిలిచేవిధంగా ఫర్నిచర్‌ను తయారుచేయగల నేర్పు ఈ వడ్రంగి వృత్తి వారికుంది. మరి వీరికి తక్షణం సాంకేతిక పరిజ్ఞానం కావాలి. వీరు తయారుచేసే వస్తువులే మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు కొనే విధంగా చేయగలగాలి. శిల్పులకు కూడా పనిలేకుండా పోయింది. కమ్మరి వృత్తే అంతరించింది. కంచరివాళ్లే కనిపించటం లేదు. వీళ్లలో కంసాలిని కూడా కలుపుకుంటే వీళ్లను విశ్వకర్మలు అంటారు. తెలంగాణలో చేనేత కార్మికుల మాదిరిగా విశ్వకర్మకులస్తులు కూడా అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఈ విశ్వకర్మలకు ఆశలు చిగురించాయి. గ్లోబల్ సంతల్లో ఫర్నిచర్‌కు దీటుగా వీళ్లు ఫర్నిచర్ తయారు చేసేందుకు శిక్షణాలయాలు రావాలి. ఉన్నతాధికారుల కార్యాలయాల దగ్గర్నుంచి స్కూల్ హెడ్మాస్టర్ల ఆఫీసుల వరకు ఈ వడ్రంగులు తయారుచేసే వస్తువులనే కొనాలన్న సంకల్పాన్ని కలుగజేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కంసాలివృత్తి బాగా చితికిపోయి ఆత్మహత్యల శయ్యపైకి ఎక్కింది. కొలిమి రాజుకోవటం లేదు. ఇప్పుడు పుస్తెలతాళ్ల దగ్గర్నుంచి అన్ని మిషన్ మీదనే తయారవుతున్నాయి. కమ్మి, తీగ, కటింగ్‌లు, గాజుల మోల్డింగ్, ఉంగరాలకు సంబంధించిన డిజైన్లు, మెడలో వేసుకునే హారాలకు సంబంధించిన రకరకాల డిజైన్లు, చెవుల కమ్మలు తదితర బంగారపు వస్తువులన్ని మిషన్పైననే తయారుచేస్తున్నారు. 100 మంది చేసే పనిని ఒక్క మిషన్ చేసేస్తుంది. ఇది కూడా ఈ వృత్తిపైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు పెట్టి స్వర్ణకారులకు శిక్షణ ఇవ్వవచ్చు. స్వర్ణకారులది, కంచర్లది ఒకటే పని. ఈ ఇద్దరి పనికి మిషనరీల అవసరముంటాయి. కంచరి వాళ్లు బిందెలు, చెంబులతో పాటు దేవాలయాల్లో పెట్టే విగ్రహాలను కూడా చేస్తారు. బంగారు పనిచేసేవారికి పని ఇచ్చేం దుకు, వీరి వస్తువులను అమ్మేందుకు, జ్యూయలరీ షాపులు నడుపుకునేందుకు విశ్వకర్మ ఫెడరేషన్ వారే వీరికి అండగా నిలవాల్సి ఉంది. కేరళరాష్ట్రంలో ఈ విశ్వకర్మ వారు తయారుచేసే వస్తువులను, కళాఖండాలను ఆప్కో మాదిరిగా అక్కడి ప్రభుత్వమే వాటిని విక్రయించేందుకు దుకాణాల సముదాయం పెట్టింది. తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మలను నిలబెట్టేందుకు కృషిచేయాలి. వీరిని కొలిమినుంచి ఆధునిక మిషన్లవైపు నడపటం ఎంత వరకు సాధ్యమవుతుంది? దీనిపై సావధానంగా ఆలోచించాలి. శిల్పులకు కూడా ఆదరణ పూర్తిగా లేదు. ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ అన్న పాటతో మాత్రమే వారు కన్పించే దశకు వచ్చారు. కానీ మనది గొప్ప శిల్పకళ. ఈ కళ ఆధునికతకు అందగలిగితే అతి ఖరీదైన వృత్తిగా ఇది మారుతుంది. నాగరికతకు నాగలినిచ్చిన వాణ్ణి ఇప్పుడు నిలబెట్టాలి. కుటుంబవ్యవస్థకు ప్రతీకగా నిలిచి తాళిబొట్లను అందించిన వాళ్ల కుటుంబాల పసుపు కొమ్ములు రాలిపోకుండా చూడాలి. ఆధునీకరించిన కుంపట్లు, కొలుములు రావాలి. ఈ విశ్వకర్మ కులస్తులు ఉత్పత్తులు చేసే ఆధునిక కాలజ్ఞాన మార్కెట్లుగా మారాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ఈ విశ్వకర్మలు శిరసెత్తుకుని నిలవాలి. గంగలో కలిసిపోయిన గ్రామస్వరాజ్యానికి తెలం గాణ రాష్ట్రం తిరిగి ప్రాణం పోయాలి. తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన విజన్ 2024 విజయం సాధించాలని సబ్బండ వర్ణాలు కోరుకుంటున్నాయి. బీసీల ముఖ చిత్రం మార్చటంకోసం, చేస్తున్న కృషి విజయం సాధిస్తే సగం తెలంగాణ ఆర్థిక స్థిరత్వంతో శిరసెత్తుకుని నిలవగలుగుతుంది. - జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
సమాజాన్ని తీర్చిదిద్దేది కుటుంబమే!
కుటుంబం ప్రేమను పంచిపెట్టే విలువల కేంద్రం. కాలంతోపాటుగా మారే విలువలకు అనుగుణంగానే కుటుంబ బండి నడుస్తుంది. కారల్‌మార్క్స్ నుంచి గాంధీ వరకు ప్రపంచ ప్రముఖుల జీవితాలను చూస్తే, తమ పిల్లలు, భార్యపట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం తెలుస్తుంది. వాళ్ల మానవీయ కోణాలు అర్థమవుతాయి. చరిత్రను సృష్టించేది సామాన్యులే. మనిషి భూ మ్మీదపడి ఎరుక మొదలైన దగ్గర నుంచి విలువలతో జీవించటం ఉన్నతమై నది. ఎలా జీవించాలనేది ఎవరికివాళ్లు స్వతంత్రంగా తయారు చేసుకునే జీవిత పాఠం. దీనికి సిలబస్ నివసించే ప్రదేశం, ప్రధానంగా ఇల్లే. ఇల్లు చూస్తే వ్యక్తిగతంగా కనిపిస్తుంది కానీ ఇల్లు సామాజికాం శంలో అత్యంత ముఖ్యమైనది. ఎదుటివాళ్లపై విమర్శలు చేసేటప్పుడు ఫలానా వ్యక్తి తన కుటుంబం తాను చూసుకున్నాడు కానీ సమాజాన్ని ఏం పట్టిం చుకున్నాడని ధ్వజమెత్తుతారు. దీన్ని విశ్లేషించేటప్పుడు అది పూర్తిగా వాళ్ల సొంత కుటుంబ వ్యవహా రంగానే చూస్తారు. కానీ సమాజంలో సహజీవనం చేస్తున్న కుటుంబం లేదా ఆ కుటుంబ సభ్యులు సమాజానికి ఏమీ చేయకపోయినా బాధలేదు. కానీ నష్టం చేసే పని చేయకూడదు. కుటుంబం తీర్చిది ద్దుకోవటానికి కావాల్సిన విలువలను మాత్రం సమాజం అందివ్వాలి. అప్పుడు కుటుంబాలలో నుం చి పొదుగుకొచ్చే విలువలు ఆ సమాజానికి రక్షగా ఉంటాయి. ఇందుకు పెద్ద తాత్త్విక చింతనలు, సిద్ధాంతాలు అక్కర్లేదు కానీ ఆ సమాజం తాలూకు మంచి విషయాలను మాత్రం జాగ్రత్తగా గమనించా లి. ఆ సమాజం అందించే విలువల తాలూకు మా ర్పులే సమాజ పరిణామక్రమాలుగా మారుతాయి. ఇటీవలే మా కవి మిత్రుడు బెల్లియాదయ్య తండ్రి సాయిలు పరమపదించిన సందర్భంగా నల్లగొండ జిల్లా నక్రేకల్ దగ్గర పాలెం గ్రామానికి వెళ్లాం. ఆయనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధిం చిన గుర్తింపూ లేదు. ఆస్తిపాస్తులు అంతగా లేవు. కోటానుకోట్ల పేదలలో ఆయనొక సాధారణ మనిషి. కానీ విలువలున్న మంచి మనిషని అక్కడి కొచ్చిన వాళ్లంతా ఆయన గురించి చెప్పుకున్నారు. ఆయన గడిపిన పూర్ణ జీవితం కుటుంబ విలువలలో సామాన్యుల జీవన తాత్వికతను అచ్చంగా ప్రతిఫ లించింది. సాయిలు ఏమీలేని తనం నుంచి రెక్కల కష్టం మీదనే ఆధారపడి జీవించాడు. గొర్రెలను మళ్లించిన వాళ్లంతా క్రీస్తులు కారు. సాయిలు మా త్రం కుటుంబ పోషణకు గొర్రెలు కాశాడు. భూమి కౌలుకు తీసుకున్నాడు. దుక్కిదున్నాడు. తన నలు గురు కొడుకుల్ని జీవితంలో నిలబెట్టాడు. తన బిడ్డలకు మానవీయ విలువలను నేర్పాడు. వాటిని కూడా బోధనల ద్వారా కాకుండా ఆచరణాత్మకంగా ఆచరించి మరీ చూపాడు. సాయిలు ఇల్లు గుడిసె కావచ్చును కానీ దాన్ని మానవీయ విలువలు పొది గిన నిలయంగా మార్చాడు. తన తండ్రి తన తల్లితో ఏనాడు అమర్యాదగా వ్యవహరించలేదని బెల్లి యాదయ్య గుర్తు చేసుకున్నాడు. అనురాగాలను పంచుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసుకుం టూ పోయిన చిలకాగోరింకల గూడు అది. తన తండ్రి తల్లిని గౌరవించటం, ఆమె మాటలకు విలువనిచ్చి అన్యోన్యంగా కలిసిమెలసి జీవించే జీవ న నిర్మాణ సూత్రాలను ఆ కుటుంబం పాటించింది. ఇతరులను గౌరవించటం తోటి వారిపై ప్రేమ కలిగి ఉండడం, పక్కవారికి ఇబ్బంది కలుగకుండా ఎలా జీవించాలి? తదితర సామాజిక విలువలను, మానవీయ ఆలోచనలను ఎక్కువ భాగం కుటుం బం నుంచి నేర్చుకునే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. బెల్లి యాదయ్య ఆయన సోదరులు తన తండ్రి నుంచి వీటిని నేర్చుకున్నారు. ఆ కుటుంబం లో ఇద్దరు కొడుకులు వూర్లోనే వ్యవసాయం చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఇంకొక కొడుకు సైని కునిగా సైన్యంలో పని చేస్తున్నాడు. యాదయ్య తెలుగు ఆచార్యునిగా నిలిచాడు. ఆ కుటుంబాన్ని చూస్తే సామాజిక శాస్త్రంలోని ఒక అధ్యాయంను చదివినట్లయ్యింది. కుటుంబాన్ని తన చేతులతో పెంచి పెద్ద చేసిన మనిషి అంతర్థానం అయినప్పు డు దుఃఖమొక్కటే తోడుగా ఉంటుంది. అందు లోంచి అంతర్థానమైన మనిషి ఒక తలపోతగా జీవి స్తాడు. ఆ తలపోతలతో మళ్లీ జీవనయానం మొద లవుతుంది. ఇదే జీవన ప్రస్థానంగా కొనసాగు తుంది. సాయిలు లాంటి వ్యక్తుల జీవితాలే మానవీయ విలువలుగా విరబూస్తాయి. చర్రిత తన చుట్టూ తా ను తిరుగుతూ సామాన్యుల చుట్టూ తిరుగు తుంది. కుటుంబం ప్రేమను పంచిపెట్టే విలువల కేంద్రం. కాలంతోపాటుగా మారే విలువలకు అను గుణంగానే కుటుంబ బండి నడుస్తుంది. కారల్ మార్క్స్ నుంచి గాంధీ వరకు ప్రపంచ ప్రముఖుల జీవితాలను చూస్తే, తమ పిల్లలు, భార్యపట్ల వారు చూపిన ప్రేమ, గౌరవం తెలుస్తుంది. వాళ్ల మానవీ య కోణాలు అర్థమవుతాయి. ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన సామాజిక సం బంధాలు మానవీయ సంబంధాలను శక్తివంతంగా ప్రతిష్టించాయి. కుటుంబంలో నాటే సమానత్వపు ఆలోచనలు, విలువలే సమాజంలో ప్రతిఫలిస్తుం టాయి. ఉత్పత్తి కులం నుంచి వచ్చిన సాయిలు కుటుంబం చూస్తే అది మానవీయ విలువలను ప్రతిష్టించింది. కుటుంబంలోని సామూహిక ప్రజా స్వామ్యం కాలాన్ని బట్టి మార్పుకు గురవుతుంది. సమష్టి ఆలోచనలు, సమష్టి విలువలు సంఘర్షణకు గురవుతున్నాయి. సామాజిక సంబంధాలకు సంబం ధించిన మార్పులు కుటుంబం నుంచే జరగాలి. సామాజిక మార్పుతోనే రాజ్యంలో కూడా మార్పులు సంభవిస్తాయి. వ్యక్తి నుంచి కుటుంబం పరివర్తన చెందటం సామాజిక మూలాల నుంచే జరుగుతుంది. సమాజంలోని మూలాలే మానవీయ సంబంధాలను ప్రతిఫలిస్తాయి. మనం ఎంత కాద నుకున్నా ఇప్పుడు మార్కెట్ సమాజంలో ఉన్నాం. దాని ప్రభావం కుటుంబాలపై తీవ్రంగా పడుతుంది. ఇక్కడే ఉత్పత్తి కులాలకు చెందిన కుటుంబాలు సమాజానికి అందించిన విలువలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మన సమాజ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయో అంచనావేసుకొని అర్థం చేసుకోగలుగుతాం. సమాజంతోపాటు మారే విలు వలు మానవీయ విలువలను కాపాడే విధంగా ఉ న్నాయోలేవో చూడాలి. సమున్నత వ్యవస్థల కోసం ప్రజాస్వామిక సమాజాలు ఎదురు చూస్తాయి. -వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు జూలూరు గౌరీశంకర్ -
‘ఉపాధి’ సంస్థకు మళ్లీ ఊపిరి
గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. అందుకు నైపుణ్యమున్న యువసైన్యాన్ని సృష్టించాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ.. గ్రామీణ విశ్వవిద్యాలయంగా, గ్రామీణ చేతివృత్తుల ఆధునీకరణ కేంద్రంగా అవతరించాలి. వినోబాభావే భూదానో ద్యమంతో భూదాన్ పో చంపల్లి గ్రామం చరిత్ర కెక్కింది. గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం వర్థిల్లాలని రామనాందతీర్థ కంకణం కట్టుకుని పనిచేశాడు. ఆయన శిష్యుడు పి.వి.నర్సింహారావు మహోన్నత ఆశయంతో భూదాన్ పోచంపల్లిలో నెలకొ ల్పిన ‘‘రామనందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ’’ అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికీ చేరుకోలేదు. ఈ సంస్థ ఏర్పడి 19ఏళ్లు గడుస్తున్నా ముందడుగులేదు. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలోని దుండిగల్‌లో నెలకొ ల్పిన ‘‘గాంధీగ్రామ్ గ్రామీణ విశ్వవిద్యాలయం’’ ఎంతో పురోగతి సాధిస్తుంటే, ఉమ్మడి రాష్ట్ర పాలకులు మాత్రం రామానందతీర్థ గ్రామీణ విద్యా సంస్థకు మనుగడ లేకుండా చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ పునరుజ్జీవనం పొందనుంది. గ్రామాల్లో చేతివృత్తులు కళకళలాడేందుకు, యువత స్వతంత్రంగా తన కాళ్లపై తాను నిలబడేవిధంగా ఉండేందుకు ఈ సంస్థను నెలకొల్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మారుతున్న పరిస్థితు లకు అనుగుణంగా గ్రామం మారుతోంది. అవసరా లు మారుతున్నాయి. ఇందుకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దే పనిని ఈ సంస్థ చేయాలి. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబం ధించిన సర్వీసు రంగానికి డిమాండ్ బాగా ఉంది. దీనికి సంబంధించిన సాంకేతికమైన వస్తువుల వాడకం, రిపేర్లు చేయటం, ఈ విద్యా సంస్థ ద్వారా నేర్పుతున్నారు. సోలార్, ఎలక్రి ్టకల్స్, ఐటి రంగాలలో సేవలను అందించేందుకు యువతకు తర్ఫీదు నిస్తున్నారు. రామనందతీర్థ గ్రామీణ విద్యా సంస్థ ద్వారా ఇప్పటి వరకు 1లక్షా 50 వేల మందికి శిక్షణ నిచ్చారు. ప్రతి ఏడాది 8వేల మందికి శిక్షణనిస్తున్నారు. శిక్షణ పొందిన యువతీ యువకులు సగానికి సగం స్వ యం సిద్ధంగా తమ పనులు తాము చేసుకుంటు న్నారు. శిక్షణ పొందిన మహిళలు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాల లో స్వయం ఉపాధితో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంస్థలో శిక్షణ పొంది హై స్కూల్లో పార్ట్‌టైం క్రాఫ్ట్ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పెరుగుతున్న వలసలు నివారించేందుకు, సమతుల్యాభివృద్ధి సాధించటానికి సాధ్యమవుతుంది. అయితే ఈ శిక్షణలలో కూడా ఇంకా ఎన్నో మా ర్పులు చేయవలసి ఉంది. స్థానిక వనరులను ఉప యోగించుకుని నిలబడే స్థానిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని శిక్షణగా ఇవ్వాలి. మొత్తంగా ఈ గ్రామీణ వి ద్యాసంస్థను ఉత్పత్తి కేంద్రంగా మార్చాలి. అప్పుడే యువతకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇందుకు పాలకుల ప్రోత్సాహం తోడైతే మంచి ఫలి తాలు వస్తాయి. పక్కనే ఉన్న తమిళనాడులోని గాంధీగ్రామ్‌లో ‘‘గాంధీగ్రామ్ రూరల్ యూనివ ర్సిటీ’’, ‘‘గాంధీగ్రామ్ రూరల్ట్రస్ట్’’ల ఆధ్వర్యంలో అవసరాలకు తగ్గ కోర్సులు ప్రవేశ పెట్టారు. ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దారు. గాంధీగ్రామ్ రూరల్ యూనివర్సిటీలో 58 కోర్సులున్నాయి. గ్రామీణ ఎంబీఏ, గ్రామీణ మేనేజ్ మెంట్, గ్రామీణ విద్యకు సంబంధించి మూడేళ్ల డిగ్రీ కోర్సులున్నాయి. సిద్ధా ఆయుర్వేదిక్ సెంటర్ ద్వారా హెర్బల్కు చెందిన 250 రకాల ఉత్పత్తులు చేస్తున్నారు. చాక్లెట్లు, బిస్కెట్తోపాటుగా పలు రకాల స్నాక్స్ చేస్తున్నారు. ఈ గాంధీగ్రామ్ నుంచి తయారు చేస్తున్న వస్తువులకు బాగా డిమాండ్ ఉంది. గ్రామ గ్రామాన అమ్మకాలు జరుగుతున్నాయి. మన దగ్గరున్న రామానంద తీర్థ గ్రామీణ వి ద్యా సంస్థలో ఉత్పత్తులులేవు. ఒక్క సర్వీస్ రంగా నికి చెందిన కొన్ని రకాల శిక్షణలనే ఇస్తున్నారు. ఈ విద్యాసంస్థ 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రామా నందతీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయంగా ఈ సంస్థను తీర్చిదిద్దితే గ్రామీణ అవసరాలను తీర్చే అనేక కో ర్సులను ప్రారంభించవచ్చును. అదేవిధంగా రామా నందతీర్థ సంస్థను గాంధీగ్రామ్ రూరల్ ట్రస్ట్‌గా మార్చి ఉత్పత్తులను చేయవచ్చును. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వేలాది మంది యువత కు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ సంస్థ ద్వారా ఉత్పత్తుల రంగాన్నీ అభివృద్ధి చేయాలన్న తలంపు తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథక రచన చేస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్ రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేకదృష్టి పెట్టి సమాలోచనలు చేస్తున్నారు. అదే జరిగితే అనేక ఉత్పత్తుల కేంద్రం గా ఈ సంస్థ మారుతుంది. ప్రస్తుత సాంఘిక సంక్షే మ శాఖ హాస్టల్స్‌కు అవసరమైన వస్తువులను, ఉత్పత్తులను ఈ సంస్థ ద్వారానే అందించవచ్చును. లక్షలాది మంది విద్యార్థులకు కావాల్సిన సబ్బులు, పేస్టుల దగ్గర నుంచి నిత్యావసరంగా ఉపయోగించే వస్తువులను ఈ సంస్థ ద్వారానే ఉత్పత్తి చేసి ప్రభు త్వానికి కోట్లాది రూపాయలు ఆదా చేయవచ్చును. ఈ సంస్థ ద్వారా తయారయ్యే వాటిని ప్రభుత్వమే కొని వేలాది మంది యువతకు ఉపాధి అవకాశా లకు దోహదపడుతుంది. రామనందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ ద్వారా నైపుణ్యత గల మానవ వనరులను తయారు చేయ వచ్చును. అదే విధంగా ఉత్పత్తిరంగానికి కేంద్రంగా మార్చవచ్చును. పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ ఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే కొంత వరకు గ్రామీణ వలసలను నివారించవచ్చును. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే గ్రామీణ ఉత్పత్తులు పెరగాలి. అందుకు నైపు ణ్యమున్న యువసైన్యాన్ని సృష్టించాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా రామానంద గ్రామీణ విద్యాసంస్థ రూరల్ యూనివర్సిటీగా, గ్రామీణ చేతివృత్తుల ఆధునీకరణ కేంద్రంగా అవతరించాలి. యువతకు ఉపాధి కేంద్రంగా మారితే ఈ సంస్థ పెట్టిన లక్ష్యం నెరవేరుతుంది. (వ్యాసకర్త, సామాజిక విశ్లేషకులు)