పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
► 35,992 మంది విద్యార్థుల కోసం 164 కేంద్రాలు
► తొలిసారిగా సీసీఈ విధానంలో పరీక్ష
► జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 164 కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సీసీఈ విధానం ద్వారా తొలిసారి 80 మార్కులకు పరీక్షలు జరగనుండగా గతంకంటే 15 నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీసీఈ మోడల్లో ప్రశ్నపత్రం ఇవ్వడంతో చదువుకునేందుకు ఈ సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది. పది పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో ఖచ్చితంగా బెంచీలు ఉండేటట్లు చూడాలని రాష్ట్ర అధికారులు ఆదేశించడంతో అందుకుతగ్గ ఏర్పాట్లను జిల్లా అధికారులు చేస్తున్నారు.
5 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు: పది పరీక్షలను నిర్వహించేందుకు, పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు విద్యార్థులు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు ఐదు సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తాళ్లపొద్దుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, దువ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, చక్రాయపేట మండలం గండిలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, పెనగలూరు మండలం చక్రంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
సమస్యాత్మక కేంద్రాలుగా 8 సెంటర్లు: జిల్లాలోని ఎనిమిది సెంటర్లను సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించారు. ఇందులో నందిమండలం జెడ్పీ ఉన్నత పాఠశాల, వనిపెంట గురుకుల పాఠశాల, గండి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, మఠం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కడప జయనగర్‌కాలనీ(ప్రైవేటు సెంటర్), తాళ్లపొద్దుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, దువ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ సెంటర్లపై స్క్వాడ్ ప్రత్యేక దృష్టిపెట్టనుంది.
50 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం: పది పరీక్షల్లో ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ కేవీ సత్యనారాయణ నియమించారు. వీరు ఆయా మండలాల్లోని సెంటర్లలో ఉండే విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక పర్యవేక్షణను చేయనున్నారు. దీంతోపాటు విద్యాశాఖ మరో 20 టీంలను పరీక్షల పర్యవేక్షణకు నియమించింది. ఈ స్క్వాడ్‌లోని ప్రతి బృందంలో విద్యాశాఖ నుంచి ఒకరు, రెవెన్యూ నుంచి ఒకరు. పోలీస్వాఖ నుంచి ఒకరు ఉంటారు. వీరు ముగ్గురు కలిసి ఒక బృందంగా ççపరీక్షల తీరును పర్యవేక్షించనున్నారు.
ఇన్విజిలేటర్ల నియామకంలో జంబ్లింగ్: ఈసారి జరిగే పది పరీక్షల్లో మాస్‌కాఫీయింగ్‌కు తావ్వకుండా గతమెన్నడూ లేని విధంగా కలెక్టర్ పరీక్షలకు వెళ్లే ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో విధులను నియమించనున్నారు. ఈ మేరకే కలెక్టర్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విధానం కిందిస్థాయిలో అమలు కొంతమేర కష్టతరం అవుతుందని మేధావులు, విద్యావంతులు అంటున్నారు. ఎందుకుంటే పరీక్ష 9.30 గంటలకు ప్రారంభం అయితే పరీక్ష నిర్వహించే రోజు ఉదయం 7 గంటలకు ఇన్విజిలేటర్ల సెల్‌కు ఏసెంటర్ అనేది మెసేజ్ వస్తుందని కలెక్టర్ గారు చెప్పారు. ఇది అమలు కొంతమేర కష్టతరంగా ఉంటుందని పలువురు అంటున్నారు. కొన్ని కారణాల చేత ఇన్విజిలేటర్ల సెల్‌కు మేసేజ్ చేరకపోయినా సంబంధిత ప్రక్రియ జరగడం కొంతమేర ఆలస్యమైనా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు అంటున్నారు.
25 యాక్టు అమలు: రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది నుంచి 25 యాక్టు (ప్రిలెన్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్)ను అమలు చేయనుంది. ఈ యాక్టు వల్ల పరీక్ష కేంద్రాలలోని విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే సంబంధిత సెంటర్ ఇన్విజిలేటర్‌ని బాధ్యుడిగా చేయనుంది. దీంతో అతనిపై కేసు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోనున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: పది పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ఎక్కడా కూడా నేలబారు పరీక్షలు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ఎంఈఓలను ఆదేశించాం. మేము కూడా పర్యవేక్షిస్తున్నాం. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నాం. ---పొన్నతోట శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి