లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్రెడ్డి ప్రమాణం
సాక్షి, అమరావతి : రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. అనంతరం జస్టిస్ లక్ష్మణ్రెడ్డిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ, టెండర్ల న్యాయ పరిశీలన జడ్జి జస్టిస్ బి.శివశంకరరావు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, పలువురు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సంభాషిస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
కార్యక్రమం అనంతరం జస్టిస్ లక్ష్మణ్రెడ్డి లోకాయుక్తగా తన విధులు మొదలెట్టారు. తాజా ఫిర్యాదులపై విచారణ జరిపి.. అధికారుల నుంచి నివేదికలు కోరారు. మొన్నటి వరకు హైదరాబాద్లో కొనసాగిన ఏపీ లోకాయుక్త కార్యాలయం ఇటీవల విజయవాడలోని ఆర్ అండ్ బీ భవనానికి మారింది. లోకాయుక్త ఉద్యోగుల విభజన మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఆర్ అండ్ బీ భవనంలో కార్యాలయం సిద్ధమై.. ఉద్యోగుల విభజన పూర్తయ్యేంత వరకూ హైదరాబాద్లోని లోకాయుక్త కార్యాలయం నుంచే జస్టిస్ లక్ష్మణ్రెడ్డి విధులు నిర్వర్తిస్తారు.