ఆలయాల పవిత్రతను కాపాడడం అందరి బాధ్యత
జుత్తిగ (పెనుమంట్ర) : ఆలయాల పవిత్రతను కాపాడే బాధ్యత భక్తులతో పాటు సిబ్బంది, అర్చకులపై కూడా ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. జుత్తిగలోని ఉమావాసుకీరవి సోమేశ్వరస్వామి ఆలయాన్ని సోమవారం ఆయన సతీసమేతంగా సందర్శించి పూజలు నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బీవీఎస్.వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు గంటా హనుమంతరావు, మహిళామోర్చా అధ్యక్షురాలు చిటికెన నాగలక్ష్మిరామస్వామి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోకల రామోహనరావు తదితరులు పాల్గొన్నారు.
సోమేశ్వరాలయ అభివృద్ధికి కృషి
జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన జుత్తిగ సోమేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి అన్నివిధాలా సహకరిస్తానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. మంత్రి ఆలయ సందర్శనలో భాగంగా ట్రస్టుబోర్డు చైర్మన్ సత్తిరాజు వెంకటశ్రీ రామారావు ఆలయ ఆదాయ వివరాల నివేదికను మంత్రికి అందజేశారు. ఆలయానికి చెందిన సుమారు 37 ఎకరాల ఈనాం భూములు అన్యాక్రాంతమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ ఈ అంశంపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.