జగతి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసును ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ మంగళవారం విచారించింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముఖేశ్‌కుమార్ ఎదుట జగతి తరఫు న్యాయవాది రవి గుప్తా, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) న్యాయవాది విపుల్‌కుమార్ తుది విడత వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణ పూర్తయిందన్న అథారిటీ.. ఇరుపక్షాలు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించడానికి వారంపాటు గడువునిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.
తొలుత రవిగుప్తా వాదిస్తూ.. జగతి పబ్లికేషన్స్ ఆస్తుల అటాచ్మెంట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వాదన పూర్తిగా అసంబద్ధం, లొసుగులమయమని పేర్కొన్నారు. ‘‘మెరిట్ ఆధారంగా ఈడీ పెట్టిన కేసును అంగీకరించినప్పటికీ అటాచ్‌మెంట్‌పై వారు తీసుకున్న చర్య పీఎంఎల్ఏ సెక్షన్ 5(1)(బీ) ప్రకారం నిలవదు’’ అని నివేదించారు. అనంతరం ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. హైకోర్టు ఆదేశాలు, సీబీఐ చార్జిషీట్, ఐటీ నివేదికల్లోని విషయాలతోపాటు దర్యాప్తులో వెల్లడైన అంశాలంటూ గతంలో ఏకరువుపెట్టిన విషయాలనే పునరుద్ఘాటించారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన ముగ్గురు వ్యాపారవేత్తలు.. టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి నుంచి తీసుకున్న స్టేట్మెంట్లలోని అంశాలను ప్రస్తావించారు.