K. Sankaranarayanan
-
రాజీనామాకు గవర్నర్లు ససేమిరా
* తగిన సంస్థ కోరితేనే ఆలోచిస్తానన్న మహారాష్ట్ర గవర్నర్ * కేంద్రంపై కర్ణాటక, నాగాలాండ్ గవర్నర్ల మండిపాటు న్యూఢిల్లీ/ముంబై: రాజీనామా చేయాలని కేంద్రం తమపై తెస్తున్న ఒత్తిడిని మహారాష్ట్ర గవర్నర్ కె.శంకరనారాయణన్ సహా పలువురు గవర్నర్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన గవర్నర్లలో కొందరిని పదవులను నుంచి తప్పుకోవాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కోరడం తెలిసిందే. అయితే కేంద్రం ఒత్తిడి పెంచుతున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తగిన నిర్ణయాత్మక సంస్థ కోరితేనే రాజీనామా అంశాన్ని పరిశీలిస్తానని శంకరనారాయణన్ బుధవారం ఓ టీవీ చానల్‌తో అన్నారు. అనిల్ గోస్వామి గత వారం తనతో రెండు సార్లు మాట్లాడారని, తాను జవాబు చెప్పలేదని వెల్లడించారు. ‘గవర్నర్ పదవి రాజ్యాంగ పదవి. ఆయన రాష్ట్రపతి ప్రతినిధి.. పదవి నుంచి తప్పుకోవాలని బాధ్యతాయుత వ్యక్తులెవరూ నన్ను రాతపూర్వకంగా అడగలేదు’ అని చెప్పారు. రాజీనామా చేస్తారని భావిస్తున్న నాగాలాండ్ గవర్నర్ అశ్వనీ కుమార్ కేంద్రం యత్నాన్ని రాజకీయ కక్షగా అభివర్ణించారు. ఎన్డీఏ ప్రభుత్వం తనకిష్టమైన వారే గవర్నర్లుగా ఉండాలని కోరుకుంటోందా అని ప్రశ్నించారు. తన రాజీనామా అంశాన్ని కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ తోసిపుచ్చారు. ‘రాజ్యాంగం ప్రకారం గవర్నర్లు రాజీనామా చేయరు. తమ స్థానంలో కొత్తవారు వచ్చేంతవరకు పదవుల్లో కొనసాగుతారు. ఈ విషయంలో బాధ్యతారహితంగా ఎలా వ్యవహరిస్తారు?’ అని మండిపడ్డారు. భరద్వాజ్ బుధవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలుసుకుని రాజీనామాలోని సమస్యల గురించి మాట్లాడారు. ఆయన గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి అపాయింట్మెంట్ కోరారు. కాగా, తాను రాజీనామా చేయలేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ స్పష్టం చేశారు. -
మహారాష్ట్ర రాజ్ భవన్ కు ఐఎస్ఓ గుర్తింపు
మహారాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అత్యున్నత పాలన విధానాలను రూపొందించినందుకు, ప్రమాణాలను పాటించినందుకుగాను ఇచ్చే ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ముంబైలోని రాజ్ భవన్ దక్కించుకుంది. భారత దేశంలో అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ ను సాధించిన తొలి రాజ్ భవన్ గా రికార్డుల్లోకి ఎక్కింది. ఐఎస్ఓ 9001:2008 సర్టిఫికెట్ ను గవర్నర్ కే శంకరనారాయణన్ మంగళవారం స్వీకరించారు. ఉన్నత ప్రమాణాలు, సేవల్ని అందించిన అధికారులను, సిబ్బందిని గవర్నర్ ప్రశంసించారు. రాష్ట్రంలోని అత్యున్నత కార్యాలయమైన రాజ్ భవన్ ప్రమాణాలు పాటించడంలోనూ, విలువలను పెంపొందించడంలోనూ ఇతర కార్యాలయాలకు మార్గదర్శకంగా నిలువాలని గవర్నర్ శంకరనారాయణ ఆకాక్షించారు. 50 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న రాజ్ భవన్ కు మూడు వైపుల అరేబియన్ సముద్రం ఉంది.