అరుణోదయ కార్యాలయంపై దాడి దుర్మార్గం
కొడంగల్: అరుణోదయ కార్యాలయంపై పోలీసులు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అంటూ విశ్వకర్మ కవులు, కళాకారుల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టఫ్ నాయకులు డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి విమలక్కను జైలులో పెట్టిన అప్పటి ముఖ్యమంత్రి ప్రస్తుతం అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రభుత్వం విమలక్క పాటకు భయపడి తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడి దారుల ఆస్తుల మీద విమలక్క దాడి చేసి వారి గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ఇన్ని త్యాగాలు చేసిన విమలక్క మీద, తెలంగాణ గొంతకను అణచివేసేందుకు ప్రభుత్వం, పోలీసులు తప్పుడు కేసులు బనాయించి, అరుణోదయ కార్యాలయాన్ని సీజ్ చేయడం ఎంతవరకు సమంజమంటూ వారు ప్రశ్నించారు. ఉద్యమంలో అరుణోదయ కళాకారుల ఆట-పాటలను మెచ్చుకున్న కేసీఆర్, ప్రస్తుతం అధికార మదంతో అణచివేసే ప్రయత్నాలను చేస్తుందని అన్నారు. అక్రమ కేసులకు పాల్పడితే ఉద్యమం ఎగిసిపడుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం అరుణోదయ కార్యాలయాన్ని తెరిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.