kadalika editor
-
జనం అండగా నిలవాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆ పార్టీ ప్లీనరీ చారిత్రాత్మక మైందిగా భావించవచ్చు. ఈ సందర్భంగా వైసీపీ పాలనను సమీక్షించు కోవడం అవసరం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న అనేక పథకాలూ; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల భాగస్వామ్యంతో ఆయన తన ప్రభుత్వాన్ని నడపడం విశిష్టత సంతరించుకున్న విషయాలు. ఏలూరు బీసీ డిక్లరేషన్, ధర్మవరం చేనేత సదస్సు, కర్నూలు జలదీక్ష తదితర మహత్తరమైన కార్యక్రమాలు జగన్ పరిణతికి అద్దం పడతాయి. సీఎంగా అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల పాలనా కాలంలో తాను ఎన్నికల ముందు విడుదల చేసిన మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖూరాన్, బైబిల్‌గా ప్రకటించి; అందులోని అన్ని అంశాలనూ అమలు చేస్తున్న అరుదైన సీఎం జగన్. దేశమంతా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణకు గురవుతుంటే... ఆర్టీసీని కార్పొరేషన్ పరిధి నుండి తప్పించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం గొప్ప నిర్ణయం. గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న జాతిపిత గాంధీ ఆశయాన్ని సచివాలయ వ్యవస్థ రూపంలో ప్రజల వద్దకు చేర్చాడు. లక్షలమంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాడు. వాలంటీర్ వ్యవస్థపై తొలిదశలో అనేక విమర్శలు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయకుండా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య అనుసంధానంగా దానిని మార్చాడు. ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాకానుక’, ఫీజు రీయింబర్స్మెంట్, పాఠశాలల ఆధునికీకరణ, ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు తదితర విప్లవాత్మకమైన నిర్ణయాలు రాష్ట్ర విద్యావ్యవస్థలో గొప్ప మలుపుగా నిలుస్తాయి. వైఎస్సార్ మానస పుత్రిక ‘ఆరోగ్యశ్రీ’ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా జగన్ ప్రజల ఆరోగ్య విషయంలో ఎంత బాధ్యతా యుతంగా ఉన్నదీ తెలుస్తుంది. (క్లిక్: ‘రాజనీతి’లో రేపటి చూపు!) రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిబద్ధతగా కృషి చేస్తున్న సీఎంపై ఎల్లో మీడియా పనిగట్టుకొని దుష్ప్రచారానికి పూనుకోవడం అనైతికం. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కేంద్రంతో ఘర్షణ పూరితంగా కాకుండా సయోధ్యగా ఉంటూ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. జగన్ మోహన్ రెడ్డి వంటి అరుదైన నాయకుణ్ణి ప్రజలే కాపాడుకోవాలి. ఆయనిచ్చిన ‘175కు 175 సీట్లు గెలవాల’నే నినాదం కార్యరూపం దాల్చడానికి ప్రజలు అండగా నిలవాలి. భావి తరాల కోసం మరింత విస్తృత ప్రాతిపాదికన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నిర్ణయాలకు వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదిక కావాలని ఆశిద్దాం. - ఇమామ్ ‘కదలిక’ సంపాదకులు, అనంతపురం -
గోదావరి జలాలతోనే కరువు ప్రాంతాలకు సిరిసిరి!
తెలంగాణలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని తాగునీటి, సాగునీటి సమస్యల పరిష్కారంపై రాష్ట్ర అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం ఉభయ రాష్ట్రాల ప్రజలను పులకింపజేసింది. ఒక యువ నాయకుడు ఇరురాష్ట్రాల సేద్యపునీటి ప్రాజెక్టులపై ఇంతటి లోతైన అధ్యయనం చేయడం ఆ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించడం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జల యజ్ఞం కొనసాగింపుగా భావించాలి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సఖ్యతను ఏర్పరుచుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతికి నడుం బిగించడం సేద్యపునీటి సౌకర్యాల కల్పనకై చాలాకాలంగా పోరాడుతున్న మాలాంటి కార్యకర్తలకు ఎంతో ఉత్సాహం, ఆనందాన్ని కలిగిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 301 టీఎంసీల జలాలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 80 టీఎంసీల జలాలు వినియోగించుకోవడం, దుమ్ము గూడెం, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టు ద్వారా 160 టీఎంసీల గోదా వరి జలాలను నాగార్జునసాగర్ ఆయకట్టుకు తరలించడం లాంటి అంశాలు జలయజ్ఞంలో ఉన్నాయి. తెలంగాణలోని అనేక ప్రాజెక్టులను.. ప్రాణహిత, చేవెళ్లలాంటి ఎత్తిపోతల పథకాన్ని, హంద్రీ–నీవా లాంటి ఎత్తిపోతల పథకాన్ని దివంగత సీఎం వైఎస్సార్ చేపట్టి జలయజ్ఞం ద్వారా ఏమి చేయ వచ్చో నిరూపిస్తూ 86 ప్రాజెక్టుల్ని ప్రారంభించారు. ఏపీ ఓటర్లు 23 అసెంబ్లీ స్థానాలకు తనను ఎందుకు పరిమితం చేశారో నేటికీ చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్ర అభివృద్ధికి తగు విధంగా ప్రతిపక్షనేతగా బాధ్యతలు నెరవేర్చకుండా కేసీఆర్‌ను ఒక ఆయుధంగా చూపించి తెలంగాణ భూభాగం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే గోదావరి జలాల ఎత్తి పోతలు జరగాలని సన్నాయి నొక్కులు నొక్కుతూ అపోహలు, సందేహాలు కల్పించే విధంగా అసెం బ్లీలో ప్రభుత్వానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. అనంతపురం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గతంలో.. హంద్రీ–నీవా నుంచి 10 టీఎంసీల జలాలను అనం తపురం జిల్లాకు తరలించి పోతిరెడ్డిపాడు వైశాల్యం 44 వేల క్యూసెక్కులకు పెంచిన సందర్భంలో వైఎస్ కృషి పట్ల సన్నాయి నొక్కులు నొక్కుతూ చంద్రబాబు చేతిలో ఆయుధంగా మారి ఈ జిల్లా ప్రజలకు తీరని నష్టం కలిగించేందుకు ప్రయత్నించారు. అదే పద్ధ తిలో నేడు కేశవ్ బాబుతో కలిసి గోదావరి జలాల మళ్లింపుపై వ్యతిరేకత వ్యక్తపరుస్తూ సభలో గందర గోళం సృష్టించడానికి ప్రయత్నించారు. ఈ సంద ర్భంలోనే వైఎస్ జగన్ గతంలో ఏ సీఎంకి లేనంత అవగాహనతో గోదావరి జలాల మళ్లింపుపై మనల్ని పులకరింపజేసే ఉపన్యాసాన్ని ఇచ్చారు. నిజానికి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో రాయలసీ మకు ఓ పెద్దద్రోహం జరిగింది. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి తిలోదకాలు ఇవ్వడం, కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును వ్యతిరేకించి నాగార్జున సాగర్ చేపట్టడం, అలాగే నేటి శ్రీశైలం స్థానంలోనే సిద్ధేశ్వరం ప్రాజెక్టుపై కోస్లా కమిటీ సూచనలను అమలు పరచక పోవడం జరిగింది. ఈ పొరపాటును నీలం సంజీవ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా సవరించడా నికి చూశారు. వైఎస్సార్ పట్టుదలతో తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి, హంద్రీ–నీవా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలు తాగునీటికి, సాగునీటికి నోచుకోని ప్రాంతాల కోసం వినుగొండ ప్రాజెక్టు నిధులు కేటాయించి పరుగులు పెట్టించారు. బాబు నిర్లక్ష్యం వల్ల అవి నీటి కేటాయిం పులు లేకుండా కొనసాగుతున్నాయి. అవతల తెలం గాణలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, స్టేజ్–1, స్టేజ్–2కు నీటి కేటాయింపులు లేకుండా ఇసుకలో లభించే మిగులు జలాలతో ముడిపెట్టి చేపట్టింది. వీటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సేద్యపునీటి సాధికారత కల్పించారు. గోదావరి నుంచి వృథాగా వెళుతున్న నీటినుంచి ఈ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించి వైఎస్సార్ ఆశయాల కొనసాగింపునకు కృషి చేయ వచ్చు. నేడు గ్రేటర్ రాయలసీమ.. కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు రక్షణ పేరుతో గోదావరి జలాల మళ్లింపుపై చర్చలు జరుపుతున్నారు. నిజంగా గోదా వరి ఆయకట్టు స్థిరీకరణ, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ, నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల స్థిరీకరణ జరిపి ఎగువన శ్రీశైలం నుండి చేపట్టిన సాగు, తాగునీటి పథకాలకు గోదావరి జలాల మళ్లింపులే శరణ్యం. వైఎస్ జగన్‌కి ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలు ఏకంగా గొంతెత్తి ఆహ్వానించాలి. ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 -
అమ్మకానికి ‘అమరావతి’
రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీతో ఒప్పందం జాతి విద్రోహం. ఎంచేతంటే సుప్రీంకోర్టు, హైకోర్టుతో సహా మన రాజ్యాంగ పరిధిని దాటి ఆ కంపెనీతో లావాదేవీలు జరిపే అమానుషమైన ఒప్పందం అది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 30 వేల ఎకరాలు రైతుల నుండి లాక్కున్నారు. రాజధానిని మూడు పంటలు పండే ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం అంటూ అనేక మోసపూరితమైన మాటలను వల్లవేస్తూ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్ కంపెనీలకు ధారదత్తం చేశారు. అసలు రాజధాని అనేది పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకొనే ఒక ప్రాంతం. మెుత్తం పరిశ్రమలు, కార్యాలయాలు ఒకే చోట కేంద్రీకరించడం సబబా? శివరామకృష్ణన్ కమిషన్ హెచ్చరించినట్లు అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరిస్తే భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలకు, విద్వేషాలకు పునాదులుగా ఉద్యమాలు వస్తాయని చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో ప్రమాదకర పరిణామాలు సంభవించబోతున్నాయి. మద్రాసు నుండి విడిపోవడానికి ముందుగా పెద్దమనుషులు చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజధానిని కోస్తాంధ్రలో ఏర్పాటు చేస్తే హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే శ్రీబాగ్ ఒప్పం దాన్ని అటకెక్కించి సీమకు ద్రోహం చేయడం రాయలసీమ వాసులను నేటికి కలవరపరుస్తున్న అంశం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తప్పుల్ని సవరించుకొని అభివృద్ధిని 13 జిల్లాలలో వికేంద్రీకరించి పరిపాలన చేపట్టడం పాలకుల కనీస ధర్మం. చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ తన పాలనంతా కృష్ణా, గుంటూరు జిల్లాలో అమరావతి ప్రాంతంలో కేంద్రీకరించి పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్రకు రైల్వేజోన్ కోసం ఈ మూడు సంవత్సరాలలో బాబు జరిపిన కృషి ఏమిటి? అలాగే ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన నిర్వాకం ఏమిటి? ప్రత్యేక హోదా వస్తే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి దానికదే జరుగుతుంది. అలా చేయకుండా రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక హోదా తరహా రాయితీలను కేంద్ర ప్రభుత్వంతో ఒనగూర్చుకోవాలని అమరావతి ప్రాంతాల్లోనే విద్య, వైద్యం ఇతర అభివృద్ధికర అంశాలను, అనేక కార్యక్రమాలను ఆ ప్రాంతంలోనే నెలకొల్పాలనుకోవడం దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేయడం సహించరానిది. దేశంలోని ఏ ముఖ్యమంత్రీ మూడేళ్లపాటు దాదాపు జోలి పట్టుకొని నిధుల కోసం చంద్రబాబులా పర్యటనలు చేయలేదు. అభివృద్ధి భావనపై మనం అనుసరించే, ఆచరించే విధానాల ద్వారా ఒక సామాజిక వాతావరణం ఏర్పడడం ద్వారా పరిశ్రమలు వాటంతటవే వస్తాయి. నాటి సీఎం వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఒక సానుకూల అభివృద్ధి విధాన సంకేతాలు భారతదేశం నలుమూలలకు వీచాయి. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వారంతట వారే క్యూ కట్టారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా నెలకొల్పనటువంటి రాజకీయ వాతావరణం ద్వారా ఏపీకి పరిశ్రమలు వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా అదే పరిస్థితి. నేడు చంద్రబాబు అమెరికా పర్యటనలో పరిశ్రమల కోసం వెంపర్లాడడం తెలుగు ప్రజల గౌరవాన్ని మంటకలపడం చూస్తూంటే ఆవేశం, ఆవేదన కలుగుతున్నాయి. మన రాష్ట్రంలో మూడు పంటలు పండే ప్రాంతాల్ని మెట్ట ప్రాంతాలుగా చూపించి అక్కడ రాజధాని నిర్మాణం కోసం, పరిశ్రమల కోసం విదేశీయులకు ఎర్ర తీవాచి పరుస్తూ ఆహ్వానించడం కన్నా అన్యాయమైనది మరొకటి లేదు. ప్రత్యేకించి రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీతో ఒప్పందం జాతి విద్రో హం. ఎంచేతంటే సుప్రీంకోర్టు, హైకోర్టుతో సహా మన రాజ్యాంగ పరిధిని దాటి ఆ కంపెనీతో లావాదేవీలు జరిపే అమానుషమైన ఒప్పందం అది. దాంతో లావాదేవీలు జరపాలంటే ఇంగ్లండ్‌లో మనం కేసులు వాదించాల్సి ఉంటుంది. దీనికన్నా అన్యాయమైనది, దుర్మార్గమైనది మరొకటి లేదు. నేడు అమరావతి ప్రాంతంలో భారతదేశంలో ఉని కిలో ఉన్న అన్ని చట్టాలనూ అతిక్రమిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి తెలుగుదేశానికి వంతపాడుతున్నది. రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీకి తోబుట్టువులాగా కొనసాగుతున్నది. ప్రస్తుత పరిస్థితిలో న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులను సైతం అమరావతి ప్రాంతంలో లెక్కించని పరిస్థితుల్లోకి చంద్రబాబు వెళ్లిపోయారు. అమరావతి పేరుతో జరుగుతున్న ప్రపంచస్థాయి రాజధాని అనే మోసపూరిత నినాదాల పేరుతో రాజధానికి ప్రత్యేక రైలు మార్గాలు, బస్సు మార్గాలు పేరుతో వేల ఎకరాల భూమిని బలవంతంగా సమీకరించుకొని ఒక కొత్త తరహా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చంద్రబాబు తెర లేపారు. నేడు దాదాపు అమరావతి ప్రాంతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితులు 13 జిల్లాల్లోని ప్రజలందర్నీ కలవరపరుస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు అన్నీ కలసి ఒకతాటిపైకి వచ్చి త్వరగా మేలుకోవాలి. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకు పునాదులు వేసి విభజనోద్యమాలను నివారించడానికి నడుం బిగించాలి. - ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు మొబైల్: 99899 04389 -
'సీమ సమస్యలపై ఉద్యమిస్తాం'
కడప కల్చరల్ : రాయలసీమ ఇప్పటికే అనేకమార్లు పలువురి వంచనకు గురై తీవ్రంగా నష్టపోయిందని, నేటికీ ఆ మోసం పునరావృతమవుతోందని, ఇకనైనా 'సీమ' సమస్యలపై తీవ్రంగా ఉద్యమించకపోతే మరింత నష్టపోవాల్సి ఉంటుందని కదలిక పత్రికా సంపాదకులు ఇమాం హెచ్చరించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్.శివరామిరెడ్డి రచించిన 'ది స్టోరీస్ ఆఫ్ 13 జెమ్స్ ఆఫ్ ది నేషన్' పుస్తకావిష్కరణ సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్నటి గాలేరు - నగరితోపాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో, నేడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంతోపాటు సీమకు ప్రత్యేకించి ప్రస్తుత నాయకులు నష్టం చేకూరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమకు ప్రాజెక్టులు దక్కకుండా తాగునీటికి సైతం ముఖం వాచేలా కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఇకనైనా సీమ నాయకులు, ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు మేల్కొని తీవ్ర స్థాయిలో ఉద్యమించకపోతే ఇక తేరుకునే ప్రసక్తే ఉండదన్నారు.