అమ్మకానికి ‘అమరావతి’ | kadalika editor imam writes on amaravathi | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ‘అమరావతి’

Published Fri, May 12 2017 3:20 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

అమ్మకానికి ‘అమరావతి’ - Sakshi

అమ్మకానికి ‘అమరావతి’

రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ కంపెనీతో ఒప్పందం జాతి విద్రోహం. ఎంచేతంటే సుప్రీంకోర్టు, హైకోర్టుతో సహా మన రాజ్యాంగ పరిధిని దాటి ఆ కంపెనీతో లావాదేవీలు జరిపే అమానుషమైన ఒప్పందం అది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 30 వేల ఎకరాలు రైతుల నుండి లాక్కున్నారు. రాజధానిని మూడు పంటలు పండే ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం అంటూ అనేక మోసపూరితమైన మాటలను వల్లవేస్తూ రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ కంపెనీలకు ధారదత్తం చేశారు. అసలు రాజధాని అనేది పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకొనే ఒక ప్రాంతం. మెుత్తం పరిశ్రమలు, కార్యాలయాలు ఒకే చోట కేంద్రీకరించడం సబబా? శివరామకృష్ణన్‌ కమిషన్‌ హెచ్చరించినట్లు అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరిస్తే భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలకు, విద్వేషాలకు పునాదులుగా ఉద్యమాలు వస్తాయని చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టడం వల్ల రాబోయే రోజుల్లో ప్రమాదకర పరిణామాలు సంభవించబోతున్నాయి.

మద్రాసు నుండి విడిపోవడానికి ముందుగా పెద్దమనుషులు చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజధానిని కోస్తాంధ్రలో ఏర్పాటు చేస్తే హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలనే శ్రీబాగ్‌ ఒప్పం దాన్ని అటకెక్కించి సీమకు ద్రోహం చేయడం రాయలసీమ వాసులను నేటికి కలవరపరుస్తున్న అంశం. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తప్పుల్ని సవరించుకొని అభివృద్ధిని 13 జిల్లాలలో వికేంద్రీకరించి పరిపాలన చేపట్టడం పాలకుల కనీస ధర్మం. చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ తన పాలనంతా కృష్ణా, గుంటూరు జిల్లాలో అమరావతి ప్రాంతంలో కేంద్రీకరించి పనిచేస్తున్నారు.

ఉత్తరాంధ్రకు రైల్వేజోన్‌ కోసం ఈ మూడు సంవత్సరాలలో బాబు జరిపిన కృషి ఏమిటి? అలాగే ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన నిర్వాకం ఏమిటి? ప్రత్యేక హోదా వస్తే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ జిల్లాల్లో అభివృద్ధి దానికదే జరుగుతుంది. అలా చేయకుండా రాజధాని పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక హోదా తరహా రాయితీలను కేంద్ర ప్రభుత్వంతో ఒనగూర్చుకోవాలని అమరావతి ప్రాంతాల్లోనే విద్య, వైద్యం ఇతర అభివృద్ధికర అంశాలను, అనేక కార్యక్రమాలను ఆ ప్రాంతంలోనే నెలకొల్పాలనుకోవడం దాంట్లో భాగంగా ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేయడం సహించరానిది.

దేశంలోని ఏ ముఖ్యమంత్రీ మూడేళ్లపాటు దాదాపు జోలి పట్టుకొని నిధుల కోసం చంద్రబాబులా పర్యటనలు చేయలేదు. అభివృద్ధి భావనపై మనం అనుసరించే, ఆచరించే విధానాల ద్వారా ఒక సామాజిక వాతావరణం ఏర్పడడం ద్వారా పరిశ్రమలు వాటంతటవే వస్తాయి. నాటి సీఎం వైఎస్సార్‌ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో ఒక సానుకూల అభివృద్ధి విధాన సంకేతాలు భారతదేశం నలుమూలలకు వీచాయి. పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వారంతట వారే క్యూ కట్టారు. నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా నెలకొల్పనటువంటి రాజకీయ వాతావరణం ద్వారా ఏపీకి పరిశ్రమలు వచ్చాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా అదే పరిస్థితి.

నేడు చంద్రబాబు అమెరికా పర్యటనలో పరిశ్రమల కోసం వెంపర్లాడడం తెలుగు ప్రజల గౌరవాన్ని మంటకలపడం చూస్తూంటే ఆవేశం, ఆవేదన కలుగుతున్నాయి. మన రాష్ట్రంలో మూడు పంటలు పండే ప్రాంతాల్ని మెట్ట ప్రాంతాలుగా చూపించి అక్కడ రాజధాని నిర్మాణం కోసం, పరిశ్రమల కోసం విదేశీయులకు ఎర్ర తీవాచి పరుస్తూ ఆహ్వానించడం కన్నా అన్యాయమైనది మరొకటి లేదు. ప్రత్యేకించి రాజధాని నిర్మాణానికి సింగపూర్‌ కంపెనీతో ఒప్పందం జాతి విద్రో హం. ఎంచేతంటే సుప్రీంకోర్టు, హైకోర్టుతో సహా మన రాజ్యాంగ పరిధిని దాటి ఆ కంపెనీతో లావాదేవీలు జరిపే అమానుషమైన ఒప్పందం అది. దాంతో లావాదేవీలు జరపాలంటే ఇంగ్లండ్‌లో మనం కేసులు వాదించాల్సి ఉంటుంది. దీనికన్నా అన్యాయమైనది, దుర్మార్గమైనది మరొకటి లేదు.

నేడు అమరావతి ప్రాంతంలో భారతదేశంలో ఉని కిలో ఉన్న అన్ని చట్టాలనూ అతిక్రమిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి తెలుగుదేశానికి వంతపాడుతున్నది. రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీకి తోబుట్టువులాగా కొనసాగుతున్నది. ప్రస్తుత పరిస్థితిలో న్యాయ వ్యవస్థలు ఇచ్చిన తీర్పులను సైతం అమరావతి ప్రాంతంలో లెక్కించని పరిస్థితుల్లోకి చంద్రబాబు వెళ్లిపోయారు. అమరావతి పేరుతో జరుగుతున్న ప్రపంచస్థాయి రాజధాని అనే మోసపూరిత నినాదాల పేరుతో రాజధానికి ప్రత్యేక రైలు మార్గాలు, బస్సు మార్గాలు పేరుతో వేల ఎకరాల భూమిని బలవంతంగా సమీకరించుకొని ఒక కొత్త తరహా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి చంద్రబాబు తెర లేపారు. నేడు దాదాపు అమరావతి ప్రాంతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితులు 13 జిల్లాల్లోని ప్రజలందర్నీ కలవరపరుస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలు అన్నీ కలసి ఒకతాటిపైకి వచ్చి త్వరగా మేలుకోవాలి. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలకు పునాదులు వేసి విభజనోద్యమాలను నివారించడానికి నడుం బిగించాలి.

- ఇమామ్‌
వ్యాసకర్త కదలిక సంపాదకులు
మొబైల్‌: 99899 04389

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement