వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆ పార్టీ ప్లీనరీ చారిత్రాత్మక మైందిగా భావించవచ్చు. ఈ సందర్భంగా వైసీపీ పాలనను సమీక్షించు కోవడం అవసరం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న అనేక పథకాలూ; ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల భాగస్వామ్యంతో ఆయన తన ప్రభుత్వాన్ని నడపడం విశిష్టత సంతరించుకున్న విషయాలు. ఏలూరు బీసీ డిక్లరేషన్, ధర్మవరం చేనేత సదస్సు, కర్నూలు జలదీక్ష తదితర మహత్తరమైన కార్యక్రమాలు జగన్ పరిణతికి అద్దం పడతాయి.
సీఎంగా అధికారం చేపట్టిన మూడు సంవత్సరాల పాలనా కాలంలో తాను ఎన్నికల ముందు విడుదల చేసిన మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖూరాన్, బైబిల్‌గా ప్రకటించి; అందులోని అన్ని అంశాలనూ అమలు చేస్తున్న అరుదైన సీఎం జగన్. దేశమంతా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణకు గురవుతుంటే... ఆర్టీసీని కార్పొరేషన్ పరిధి నుండి తప్పించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం గొప్ప నిర్ణయం. గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న జాతిపిత గాంధీ ఆశయాన్ని సచివాలయ వ్యవస్థ రూపంలో ప్రజల వద్దకు చేర్చాడు. లక్షలమంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాడు.
వాలంటీర్ వ్యవస్థపై తొలిదశలో అనేక విమర్శలు ఎదురైనప్పటికీ వెనుకడుగు వేయకుండా ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య అనుసంధానంగా దానిని మార్చాడు. ‘అమ్మ ఒడి’, ‘జగనన్న విద్యాకానుక’, ఫీజు రీయింబర్స్‌మెంట్, పాఠశాలల ఆధునికీకరణ, ఆంగ్ల మాధ్యమం ఏర్పాటు తదితర విప్లవాత్మకమైన నిర్ణయాలు రాష్ట్ర విద్యావ్యవస్థలో గొప్ప మలుపుగా నిలుస్తాయి. వైఎస్సార్ మానస పుత్రిక ‘ఆరోగ్యశ్రీ’ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం ద్వారా జగన్ ప్రజల ఆరోగ్య విషయంలో ఎంత బాధ్యతా యుతంగా ఉన్నదీ తెలుస్తుంది. (క్లిక్: ‘రాజనీతి’లో రేపటి చూపు!)
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిబద్ధతగా కృషి చేస్తున్న సీఎంపై ఎల్లో మీడియా పనిగట్టుకొని దుష్ప్రచారానికి పూనుకోవడం అనైతికం. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కేంద్రంతో ఘర్షణ పూరితంగా కాకుండా సయోధ్యగా ఉంటూ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు. జగన్ మోహన్ రెడ్డి వంటి అరుదైన నాయకుణ్ణి ప్రజలే కాపాడుకోవాలి. ఆయనిచ్చిన ‘175కు 175 సీట్లు గెలవాల’నే నినాదం కార్యరూపం దాల్చడానికి ప్రజలు అండగా నిలవాలి. భావి తరాల కోసం మరింత విస్తృత ప్రాతిపాదికన రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే నిర్ణయాలకు వైఎస్సార్‌సీపీ ప్లీనరీ వేదిక కావాలని ఆశిద్దాం.
- ఇమామ్
‘కదలిక’ సంపాదకులు, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment