Kakatiya Techno School
-
నిజామాబాద్‌లో కేసు నమోదు చేశాం
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీచంద్రశేఖరరెడ్డి హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద గురువారం ఉదయం రైలు, స్కూల్ బస్సు ను ఢీకొన్న ఘోర ప్రమాదంపై తూప్రాన్‌లోని కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం, బస్సు డ్రైవర్లపై ఐపీసీ సెక్షన్ 304ఎ, 337లతోపాటు రైల్వే చట్టంలోని 153, 161 సెక్షన్ల కింద నిజామాబాద్ రైల్వే పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి, వారి తల్లి దండ్రులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ కూడా ఘటనా స్థలంలోనే మరణించాడని, దీంతో కాకతీయ స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేస్తామని ఆయన అన్నారు. -
మృతులు, క్షతగాత్రుల వివరాలు
మెదక్: పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందిన 16 మందిని గుర్తించారు. మృతుల్లో 14 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. మృతి చెందిన విద్యార్థులు గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్, కిష్టాపూర్ ప్రాంతాలకు చెందిన వారు. క్షతగాత్రుల్లో అల్లీపూర్, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ చెందిన వారు ఉన్నారు. వీరంతా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. 16 మంది మృతుల వివరాలు... చింతలసుమన్ (12), విద్య (7), చింతల చరణ్(4), దివ్య (7)- గుండ్రెడ్డిపల్లి నీరుడి వంశీ (12), చింతల భువన(6), తుమ్మ వంశీ (13) , గొల్ల మనీష్- ఇస్లాంపూర్ వంశీ (7), శృతి (5)- వెంకటాయపల్లి ఎం.డి.రశీద్ (7), వజియా (4), విశాల్ (6), ధనుష్‌గౌడ్ (7)- కిష్టాపూర్ బస్సు డ్రైవర్ భిక్షపతి (50) వర్గల్ మండలం వేలూరు గణేష్ గౌడ్ (25), బస్ హెల్పర్, ఘనాపూర్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు ప్రశాంత్ (6), శివభూషణ్ (6), రుచికాగౌడ్(6)- వెంకటాయపల్లి సందీప్ (5), సాత్విక (6), శ్రావణి (6), సాయిరామ్(4)- వెంకటాయపల్లి మహిపాల్‌రెడ్డి (4), వరుణ్‌గౌడ్ (7), దర్శన్(6)- వెంకటాయపల్లి బి.మితూష (7), వైష్ణవి (7)- ఇస్లాంపూర్ సద్భావన్దాస్(3)- అల్లీపూర్ తరుణ్ (7), కరుణాకర్ (12), శరత్ (6)- గుండ్రెడ్డిపల్లి నబీరాఫాతిమా (9), శిరీష (8), అభినందు (9), హరీష్ (7) గుండ్రెడ్డిపల్లి -
క్షమాపణ కోరిన కాకతీయ గ్రూప్ చైర్మన్
హైదరాబాద్: మెదక్ జిల్లాలో తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారామిరెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఘటనలో తమ తప్పులేదని సాక్షితో అన్నారు. రైల్వే తప్పిదమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. స్కూల్ బస్సు పూర్తి కండీషన్లో ఉందని, స్కూల్‌ను నిబంధనల ప్రకారమే నడుపుతున్నామని చెప్పారు. అన్నీ స్కూళ్లకు పర్మిషన్లు ఉన్నాయని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థులు తన పిల్లలు లాంటివారని గద్గర స్వరంతో అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. -
చిన్నారులకు పవన్ కళ్యాణ్ పరామర్శ
హైదరాబాద్: మెదక్ జిల్లాలో పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై సినీ నటుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... రైలు ప్రమాద దుర్ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. పిల్లలు సురక్షితంగా స్కూల్ వెళ్లలేని పరిస్థితులు నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నష్టపరిహారంతోనే సరిపెట్టకుండా భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. -
ఆలస్యంగా స్పందించిన స్కూల్ యాజమాన్యం
మెదక్: తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనపై తుప్రాన్ కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం ఆలస్యంగా స్పందించింది. స్కూల్‌కు సంబంధించిన ఫోన్లన్నీ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. కాకతీయ స్కూల్ గ్రూపునకు చెందిన 96662 22288 నంబరుకు ఫోన్ చేస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. తుప్రాన్ బ్రాంచ్‌ను తమ వెబ్సైట్లో ఫ్రాంచైజ్ స్కూల్‌గా కాకతీయ స్కూల్స్ గ్రూపు పేర్కొంది. మరోవైపు అజ్ఞాతంలోకి కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. ఈ వార్త ప్రసారం కాగానే ఆయన సాక్షి' టీవీకి ఫోన్ చేసి మాట్లాడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాపలా లేని రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ టెక్నో స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు.