Kanasugara
-
ప్రస్తుతానికి పనులు తాగునీటికే...
పాలమూరు’పై గ్రీన్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం వివరణ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కింద ప్రస్తుతం కేవలం తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులకు ప్రాధా న్యమిస్తూ వాటినే చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ (చెన్నై)కు వివరణ ఇచ్చింది. సాగునీటి పనులేవీ చేపట్టడం లేదని వెల్లడించింది. సాగునీటిని అందించే డిస్ట్రి బ్యూటరీ, కాలువల పనులను ఎక్కడా చేయ డం లేదని వివరించింది. పాలమూరు ప్రాజె క్టును మొదటి విడతలో తాగునీటికే పరిమితం చేస్తామని, తర్వాతనే సాగునీటికి విస్తరిస్తామ ని పేర్కొంది. అందుకు సంబంధించి మార్చిన డిజైన్లను ఐదు రోజుల్లో సమర్పిస్తామంది. అటవీచట్ట నిబంధనలకు విరుద్ధంగా పాల మూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిం దని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్ర వారం ట్రిబ్యునల్ విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరణ్... పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్, రచనా రెడ్డి వాదనలు వినిపించారు. అటవీ ప్రాంతంలో పనులు సంజయ్ ఉపాధ్యాయ్ వాదిస్తూ ప్రాజెక్టు పనులు అటవీ ప్రాం తంలో జరుగుతున్నాయ ని, అక్కడ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ఉందని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టు వల్ల వ్యన్య ప్రాణులకు ముప్పు వాటిల్లే అవకా శం ఉందన్నారు. పర్యావరణ అనుమతుల్లేకుం డానే దీన్ని చేపట్టారన్నారు. ఈ వాదనను మోహన్ పరాశరణ్ తోసిపుచ్చారు. టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పనులేవీ జరగట్లేదన్నారు. ప్యాకేజీ–1 పనులు అటవీ పరిధిలోకి వస్తాయ ని తెలిసిన వెంటనే పనులు నిలిపివేసి డిజైన్లు మార్చామన్నారు. ప్రాజెక్టు వల్ల 1,131 గ్రామా లకు, 50లక్షల మందికి తాగునీరు అందుతుం దన్నారు. దీనిపై ట్రిబ్యునల్ స్పందిస్తూ ప్రాజెక్టు డిజైన్‌ను చూస్తుంటే అలా అనిపించట్లేదని, అనుమతుల్లేకుండా ఎలా చేపట్టా రని ప్రశ్నించింది. వారం గడువిస్తే పూర్తిగా కొత్త స్కీమ్‌తో ట్రిబ్యునల్ ముందుకు వస్తామని పరిశరణ్ బదులిచ్చారు. దీంతో ట్రిబ్యునల్ తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. మార్పులున్న చోట కొత్త ఒప్పందాలు... పాలమూరు ఎత్తిపోతల ప్యాకేజీ–1, 16ల్లో మార్పుచేర్పులకు ఇటీవల కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఇక్కడ మారిన మార్పులకు అనుగుణంగా పాత కాంట్రా క్టర్‌తో కొత్త ఒప్పందాలు చేసుకోవాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. -
పాలమూరులో వడదెబ్బతో ముగ్గురి మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో వడదెబ్బతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పెద్దమందడి మండలం గట్లఖానాపురం గ్రామంలో కావలి సవరయ్య (72), ధన్వాడ మండలం పస్పుల గ్రామానికి చెందిన రాములుగౌడ్ (70), ఆత్మకూరు మండలం అమరచింతకు చెందిన తెలుగు వెంకటేష్ (47) మృతి చెందారు. -
‘కృష్ణా’లో మళ్లీ కిరికిరి
పాలమూరు, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులపై తెలంగాణ వివరణ కోరిన కృష్ణా బోర్డు ♦ ఏపీ ఫిర్యాదులే కారణం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య మళ్లీ అగ్గి రాజుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతో పాటు, కల్వకుర్తి నీటి కేటాయింపుల పెంపు, అదనంగా వాటర్ గ్రిడ్‌కు 20 టీఎంసీల నీటి కేటాయింపుపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తుతుండటం, దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయడం వివాదాన్ని రేపుతోంది. ఏపీ ఫిర్యాదుల నేపథ్యంలో కదిలిన కృష్ణా యాజమాన్య బోర్డు కొత్తగా చేపడుతున్న పథకాలకు నీటిని ఎక్కడి నుంచి ఏ రీతిన వాడుకుంటారో తమకు స్పష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై జవాబిచ్చేందుకు తెలంగాణ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వివరణ ఇచ్చినా... ఏపీ అభ్యంతరాలు, ఫిర్యాదులపై ఇప్పటికే తెలంగాణ వివరణ ఇచ్చింది. నిజానికి కృష్ణా జలాల్లో బచావత్ అవార్డు మేరకు ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటి వినియోగంలో ప్రాజెక్టు వారీ కేటాయింపులు జరిపినా ప్రస్తుతం అవేవీ పూర్తికాలేదు. దీంతో తమకు జరిపిన కేటాయింపులను రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటామని చెబుతూ అదే రీతిని అనుసరిస్తుంది. దీనిపై ఏపీ పలుమార్లు అభ్యంతరాలు లేవనెత్తినా చివరికి జూన్ రెండో వారంలో కేంద్ర జల వనరుల శాఖ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ విధానాన్ని అంగీకరించింది. ఉమ్మడి ఏపీకి క్యారీ ఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పూడిక కారణంగా వాడుకోలేకపోతున్న 170 టీఎంసీలు, పట్టిసీమలో భాగంగా ఉమ్మడి ఏపీకి ఇచ్చిన 45 టీఎంసీల్లో దక్కే వాటాల నీటితోనే పాలమూరు, డిండిలను చేపట్టామని, కల్వకుర్తి సామర్థ్యాన్ని పెంచామని చెబుతూ వచ్చింది. వాటర్ గ్రిడ్‌కు కృష్ణా జలాల్లో కేటాయించిన 19.59 టీఎంసీలను సైతం గంపగుత్తగా ఇచ్చిన వాటాల్లోంచే వాడుకుంటున్నామంది. తాజాగా మళ్లీ ఫిర్యాదులు... ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు వివరణలు ఇచ్చినా, దీనిపై ఏపీ మళ్లీ బోర్డుకు ఫిర్యాదు చేసింది. కొత్త ప్రాజెక్టులకు నీటిని ఎక్కడి నుంచి తీసుకుంటారో, వాటికి బోర్డు అనుమతి ఉందో లేదో వివరణ తీసుకోవాలని బోర్డుపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా తెలంగాణకు లేఖ రాశారు. ‘పాలమూరు, డిండి, కల్వకుర్తి నీటి కేటాయింపుల పెంపు, వాటర్ గ్రిడ్‌కు చేసిన కేటాయింపులపై మీరింతవరకు వివరణ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్టులకు నీటిని రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల్లోంచే వాడుకుంటారా? లేక ఇంకా ఎక్కడి నుంచి ఇస్తారో తెలపండి’ అని లేఖలో కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను చేపడితే బోర్డు అనుమతి పొందాల్సి ఉంటుందని లేఖలో గుర్తు చేశారు. -
‘పాలమూరు’ను అడ్డుకుంటున్నారు
ఏపీ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు అఖిలపక్షం ఫిర్యాదు వాస్తవాలను కేంద్ర జలసంఘం దృష్టికి తీసుకెళ్లాలని వినతి హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా (పాలమూరు) నీటి హక్కులను కాలరాసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ధోరణి ఉందని ఆ జిల్లా అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల్లో తమ జిల్లాకు లభించే న్యాయమైన హక్కు లకు భంగం కలిగించేలా పాల మూరు, డిండీ ఎత్తిపోతల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించినా, తదుపరి వీటి నిర్మాణాలపై శ్రద్ధ చూపలేదని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని చేపట్టేందుకు ముందుకు వస్తే ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. అపెక్స్ కౌన్సెల్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం పాల మూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపడుతోందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా అఖిలపక్ష నేతలు సోమవారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అంజయ్య యాదవ్, మర్రి జనార్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎడ్మా కిష్టారెడ్డి (వైఎస్సార్ సీపీ), బీజేపీ నేతలు నాగూరావ్ నామాజీ, ఆచారి, బాల నరసింహులు (సీపీఐ), జబ్బర్ (సీపీఎం), శ్యాంసుందర్‌రెడ్డి, నారాయణరావు (లోక్‌సత్తా) గవర్నర్‌ను కలసి నాలుగు పేజీల వినతి పత్రం అందజేశారు. ప్రాజెక్టులు లేకే వలసలు కృష్ణాలో 70 టీఎంసీలతో చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న అప్పటి ప్రభుత్వం జీవో 72 , 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండీ ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న ఇచ్చిన జీవో 159 లను ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చిన విషయాన్ని నేతలు గవర్నర్ దృష్టికి తెచ్చారు. కరువు ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలకు ఈ రెండు ప్రాజెక్టులు అత్యవసరమని వివరించారు. జిల్లాలోని ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటే కేవలం 10 వేల ఎకరాలకే నీరందుతోందని, సీమాంధ్ర నేతలు తుంగభద్ర నీటిని తరలించుకుపోవడమే దీనికి కారణమని ఆరోపించారు. జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే పాలమూరు ప్రజలు వలస బాట పడుతున్నారని తెలిపారు. -
జిల్లాకో మెడికల్ కాలేజీ!
కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి, పాలమూరులో ఏర్పాటుకు ప్రతిపాదనలు కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు ప్రాధాన్యత పీఎంఎస్ఎస్వై కింద కేంద్రాన్ని నిధులు కోరాలనే యోచన సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు లేని కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఒక్కో మెడికల్ కళాశాల ఏర్పాటుకు రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ప్రధానమంత్రి స్వస్థ్య సురక్షా యోజన(పీఎంఎస్ఎస్వై) పథకం కింద కేంద్ర సాయం కోరాలని భావిస్తోంది. ఆయా జిల్లాల్లో కళాశాలల ఏర్పాటుకు సంబంధించి గతంలో స్థలాలను గుర్తించినప్పటికీ వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో అధికారుల బృందం త్వరలోనే ఆయా జిల్లాల్లో పర్యటించి గతంలో గుర్తించిన స్థలాలను మరోసారి పరిశీలించనుంది. మరోవైపు కళాశాలల ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కేంద్రాన్ని ఏ మేరకు సాయం అడగాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. వీలైనంత ఎక్కువ సాయాన్ని అందించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో గతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకైన వ్యయంలో కేంద్రం 80 శాతం, రాష్ట్రం 20 శాతం నిధులను ఖర్చు చేసినందున ఇదే నిష్పత్తిలో కేంద్ర సాయం కోరాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని, వీటిని అతి త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు వైద్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్రం ఐదు కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇస్తుందనే అంశంపై స్పష్టత లేనప్పటికీ కనీసం మూడు కొత్త కళాశాలలైనా మంజూరవుతాయని అధికారులు ధీమాతో ఉన్నారు. వీటిలో కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. కేంద్రం నుంచి అనుమతి లభించినప్పటి నుంచి రెండేళ్లలో కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చే సేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.