‘పాలమూరు’ను అడ్డుకుంటున్నారు
ఏపీ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు అఖిలపక్షం ఫిర్యాదు
వాస్తవాలను కేంద్ర జలసంఘం దృష్టికి తీసుకెళ్లాలని వినతి
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా (పాలమూరు) నీటి హక్కులను కాలరాసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ధోరణి ఉందని ఆ జిల్లా అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. కృష్ణా జలాల్లో తమ జిల్లాకు లభించే న్యాయమైన హక్కు లకు భంగం కలిగించేలా పాల మూరు, డిండీ ఎత్తిపోతల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించినా, తదుపరి వీటి నిర్మాణాలపై శ్రద్ధ చూపలేదని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని చేపట్టేందుకు ముందుకు వస్తే ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను కేంద్ర జల వనరుల శాఖ, కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు.
అపెక్స్ కౌన్సెల్, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం పాల మూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు చేపడుతోందని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా అఖిలపక్ష నేతలు సోమవారం గవర్నర్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అంజయ్య యాదవ్, మర్రి జనార్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎడ్మా కిష్టారెడ్డి (వైఎస్సార్ సీపీ), బీజేపీ నేతలు నాగూరావ్ నామాజీ, ఆచారి, బాల నరసింహులు (సీపీఐ), జబ్బర్ (సీపీఎం), శ్యాంసుందర్‌రెడ్డి, నారాయణరావు (లోక్‌సత్తా) గవర్నర్‌ను కలసి నాలుగు పేజీల వినతి పత్రం అందజేశారు.
ప్రాజెక్టులు లేకే వలసలు
కృష్ణాలో 70 టీఎంసీలతో చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టు 8న అప్పటి ప్రభుత్వం జీవో 72 , 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండీ ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై 7న ఇచ్చిన జీవో 159 లను ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చిన విషయాన్ని నేతలు గవర్నర్ దృష్టికి తెచ్చారు. కరువు ప్రాంతాల్లో సాగు, తాగునీటి అవసరాలకు ఈ రెండు ప్రాజెక్టులు అత్యవసరమని వివరించారు. జిల్లాలోని ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటే కేవలం 10 వేల ఎకరాలకే నీరందుతోందని, సీమాంధ్ర నేతలు తుంగభద్ర నీటిని తరలించుకుపోవడమే దీనికి కారణమని ఆరోపించారు. జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే పాలమూరు ప్రజలు వలస బాట పడుతున్నారని తెలిపారు.