Kanchi Kamakoti Peetham
-
సమస్యలకు భగవద్గీతలో పరిష్కారాలు
కొవ్వూరు: మానవుని జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు భగవద్గీత పరిష్కారం చూపుతుందని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సంస్కృత పాఠశాల ప్రాంగణంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీమద్భగవద్గీత దశ సహస్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ మార్గశిర ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం వల్ల విశేష ఫలితాలు ప్రాప్తిస్తాయన్నారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు భగవద్గీత పుస్తకాలు అందజేశారు. తమిళనాడుకు చెందిన మహిళా బృందం సౌందర్యలహరి పారాయణ చేశారు. సాయంత్రం ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు, సంగీత విభావరీ, హరికథ నిర్వహించారు. -
నడయాడిన దైవం
శ్రీ శంకర భగవత్పాద పరంపరాగత మూలామ్నాయ కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా 13 సంవత్సరాల పసిప్రాయంలో బాధ్యతలను స్వీకరించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు నూరేళ్ల తమ జీవితకాలంలో దాదాపు 85 సంవత్సరాల పాటు పీఠబాధ్యతలను, ఇటు ధర్మబోధనలను ఏకకాలంలో సమర్థంగా నిర్వహిస్తూ ఆ పీఠానికి పరమాచార్యునిగా పేరొందారు. రేపు ఈ నడిచేదైవం ఆరాధన. ఈ సందర్భంగా... ఎంతోమంది వీరి దర్శనం లభిస్తే చాలు, జన్మధన్యమైందని భావించేవారు. దేశ, విదేశీ రాజకీయ, చారిత్రక, మత ప్రముఖులు స్వామివారిని సందర్శించి, వారితో చర్చించి తమ అభిప్రాయాలను పంచుకునేవారు. స్వామివారు తమదైన శైలిలో చెప్పిన సమాధానంతో వారంతా సంతృప్తికరమైన భావనతో తిరిగి వెళ్ళేవారు. ప్రాచీన తాళపత్రాలను సేకరించి వాటిని పరిష్కరించి ప్రచురించే దిశగా ప్రయత్నాలు కొనసాగించారు. మరోవైపు జైళ్ళలో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను సన్మార్గంలోకి తెచ్చేందుకు కృషి కొనసాగించారు. ఆసుపత్రులలో వైద్యులకు భోజనాలకు ఏర్పాట్లు చేయించారు. ఇలా పలుమార్గాలలో వీరి సమాజసేవ కొనసాగింది. మహాస్వామి వారి మహితోక్తులు ►మనసు ఈశ్వరునికి స్థానం. కానీ మనం దాన్ని చెత్తతో నింపేస్తున్నాం. దాన్ని మనమే శుభ్ర పరచుకుని, ఈశ్వరుని ప్రతిష్ఠించుకుని, శాంతితో ఉండాలి. అందుకోసం మనం ప్రతిరోజూ కనీసం ఐదునిమిషాలు ధ్యానానికి కేటాయించి, ప్రళయం సంభవించినా దాన్ని చేయగలిగిన సంకల్పం కలిగి ఉండాలి ►సేవ అనేది కేవలం మానవ సమాజానికే పరిమితం చేయకుండా, జంతుజాలానికి కూడా చేయాలి. పూర్వపు రోజుల్లో పశువుల కోసం ప్రత్యేకంగా చెరువులు తవ్వించేవారు. చాలా చోట్ల గరుకు స్తంభాలు వేయించేవారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఒక్క ఆవుకైనా చేతినిండా సరనిపడే గడ్డి పెట్టాలి. దీన్నే గోగ్రాసం అంటారు. గ్రాసం అంటే నోటినిండా అని అర్థం. గ్రాస్ అనే ఆంగ్ల పదం నదీని నుండే వచ్చింది ►మన వ్యక్తిగత అవసరాలకోసం డబ్బును ఖర్చుచేయడమంటే ముఖానికి మసిపూసుకున్నట్లే ►కనీస అవసరాలకై ఎదురుచూసే ఎంతోమంది అభాగ్యులకు సేవచేయడం కూడా పరమేశ్వరారాధనే అవుతుంది. దానివల్ల ఆత్మతృప్తి కలుగుతుంది ►ఇతరుల బాగుకోసం చేసే పనిలో కలిగే బాధైనా చివరకు ఆనందాన్నే మిగులుస్తుంది. అరటి ఆకులు – ప్లాస్టిక్ పొట్లాలు కంచి మహాస్వామి వారు 1960లో తిరుచ్చి నేషనల్ కాలేజ్ హైస్కూలులో మకాం చేస్తున్నారని తెలిసి వారి దర్శనం కోసం రోజూ వేలసంఖ్యలో భక్తులు వస్తున్నారు. వచ్చినవారందరికీ రుచికరమయిన భోజనం పెడుతున్నారు. ఉదయం పదకొండు గంటలకు మొదలయ్యే ఈ అన్నదానం సాయంత్రం నాలుగ్గంటల వరకూ జరిగేది. ఏర్పాట్లు చేసే బృంద సభ్యులు ఈ భక్తుల తాకిడిని నియంత్రించడానికి, భోజనాలు అయ్యాక వారిని పంపడానికి చాలా తంటాలు పడుతున్నారు. వారి సమస్యను స్వామివారికి చెప్పి, భోజనానికి వచ్చే భక్తులకు పంక్తి భోజనం కాకుండా ఆహార పొట్లాలను ఇచ్చే విషయమై స్వామివారికి తెలిపారు. పరమాచార్య ఆ కమిటీ సభ్యులను ముందర కూర్చోబెట్టుకుని రెండు ప్రశ్నలను అడిగారు. మొదటిది: ఆహార పొట్లాంలోని పదార్థాన్ని తిన్న తరువాత ఆ అరటి ఆకులను వారు ఎక్కడ పడవేస్తారు? రెండవది: దాహాన్ని తీర్చుకోవడానికి నీళ్ళకోసం వారు ఎక్కడకు వెళతారు? ఈ ప్రశ్నలకు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేకపోవడంతో స్వామివారే చెప్పారు. ‘‘నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్లినప్పుడు, భోజనం తరువాత ఆ అరటి ఆకులను ఒక తొట్టెలో పడవేస్తారు. నేను చూశాను– ఆ ఆకులలో మిగిలిపోయిన పదార్థాలను నారికురవలు సేకరిస్తారు. ఆ ఆకులకు అంటుకున్న ఆహార పదార్థాలను ఆవులు తింటాయి. మీరు గమనించండి, ఆకులు వేసి భోజనం పెట్టడం వల్ల ఎందరో ఇతరుల ఆకలి కూడా తీరుతోంది’’. ‘‘ఆహార పొట్లాలను తయారు చెయ్యాలన్న మీ ఆలోచనను విరమించుకొని, అందరికీ అరటి ఆకులు వేసి భోజనం పెట్టండి. ఇంతమంది ప్రజలు ఆహారం స్వీకరించడాన్ని చూడటం, దానికోసం ఖర్చు పెట్టుకోవడం కూడా మీకు పుణ్యం. నాకు ఆనందం కూడా’’ అన్న సమారాధనలు చెయ్యడం చూశాము కానీ, దాని గొప్పదనాన్ని ఇటువంటి మహాత్ములు చెప్పిన తరువాతనే అర్థం చేసుకున్నాము. – రా. వేంకటసామి ‘శక్తి వికటన్’ నుంచి -
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశం
-
మానవతా విలువలకు మారుపేరు
సాక్షి, హైదరాబాద్: కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ధార్మికత, ఆధ్యాత్మిక చింతన, అత్యున్నత మానవతా విలువలను జీవితమంతా ఆచరించి ప్రబోధించిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు జగద్గురువుగా ఖ్యాతిపొందారని జగన్ అన్నారు. ఆదిశంకరుల వారసునిగా దాదాపు రెండున్నర దశాబ్దాలు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి కంచిపీఠానికి అందించిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జ్ఞాని అయిన శ్రీజయేంద్ర సర్వస్వతి శివైక్యం తీవ్ర దుఖానికి గురి చేసిందని పేర్కొంటూ జగన్ ఒక ట్వీట్ కూడా చేశారు. Deeply saddened by the demise of Sri Sri Sri Kanchi Sankaracharya Jayendra Saraswati garu, the senior seer of Kanchi Kamakoti Peetham. — YS Jagan Mohan Reddy (@ysjagan) 28 February 2018 -
కంచి మఠం ఆస్తులు వేల కోట్లు
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శివైక్యం చెందిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి హయాంలో కంచి మఠం ఆస్తులు గణనీయంగా వృద్ధి చెందాయి. వేలకోట్ల ఆస్తులు పెరిగి మఠం పేరు ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తిచెందాయి. ప్రస్తుతం ఉన్న శిష్యగణంలో 40% అదనంగా శిష్యులు, భక్తులు పెరిగారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థిర, చరాస్తులు పెరిగాయి. అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లోనూ స్వామీజీ భక్తులు పెరిగారు. జయేంద్ర సరస్వతి కంటే ముందు 68 మంది పీథాధిపతులు పనిచేయగా వీరంతా హిందూమత ప్రచారానికే పరిమితమయ్యారు. జయేంద్ర సరస్వతి మాత్రం కంచి కామకోటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మత ప్రచారంతో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించారు. పారిశ్రామికవేత్తలను శిష్యులుగా చేర్చుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అధిక మొత్తంలో విరాళాలు రాబట్టారు. ఆయుర్వేద ఆస్పత్రి, వర్సిటీలు నిర్మించి.. గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించారు. దేశవ్యాప్తంగా 38 శాఖలను ప్రారంభించి భక్తుల నుంచి వేల కోట్ల విరాళాలను ట్రస్ట్‌కు రాబట్టారు. ఈ సొమ్ములతో సేవా కార్యక్రమాలను చేపట్టడంతో ప్రముఖుల దృష్టి కంచి మఠం వైపు మళ్లింది. ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.. మఠం మేనేజర్ సుందరేశ్ అయ్యర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల సీఎంలు, ప్రధాని కార్యాలయం నుంచి తమకు ఫోన్లు వచ్చినట్లు చెప్పారు. స్వామీజీ అధిష్టానం గురించి వారు వాకబు చేశారని వివరించారు. దీనికి ఎవరెవరు వస్తున్నారో తెలియపర్చలేదని తెలిపారు. బుధవారం రాత్రి తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కంచి మఠానికి చేరుకుని జయేంద్రసరస్వతి పార్థీవదేహానికి నమస్కరించారు. స్వామీజీ ఆకస్మిక మరణం మనస్సును కలచివేసిందని చెప్పారు. -
సేవల స్వామీజీ
ధర్మమే నిలుస్తుంది.. సత్యమే గెలుస్తుంది ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా మా గురువులు నన్ను తీర్చిదిద్దారు. కష్టం అన్న పరిస్థితే ఎదురుకాదు – జయేంద్ర సరస్వతి తిరువళ్లూరు (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంచి కామకోటి 69వ పీఠాధిపతిగా సేవలు కొనసాగించిన స్వామి జయేంద్రసరస్వతి శివైక్యం చెందడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీఠాధిపతిగా తన సేవలను ఆధ్యాత్మికకే పరిమితం కాకుండా నిరుపేదలకు సేవ చేస్తూ సేవల స్వామీజీగా పేరు సంపాదించుకున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో వైద్యశాలలు, పాఠశాలలు డీమ్డ్ యూనివర్సిటీ, గోశాల, వృద్ధాశ్రమం ప్రారంభించి తమ సేవలను అన్ని వైపులా విస్తరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకున్న పలు ప్రసిద్ధ ఆలయాలను పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. సేవలు చిరస్మరణీయం కంచి మఠం పీఠాధిపతిగా బాధ్యతను నిర్వహిస్తూనే సేవలకు అపరిమత ప్రాధాన్యతను ఇచ్చారు. కాంచీపురం సమీపంలోని ఏనత్తూరు గ్రామం వద్ద 1993లో కంచి మఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ విద్యాలయం ద్వారా తక్కువ ఫీజుతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు. 1994లో ఎడ్యుకేషన్ వింగ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో 22 పాఠశాలలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. నిరుపేదలకు వైద్య సేవలు మానవ సేవే మాధవసేవ అన్నది జయేంద్రసరస్వతి నినాదం. 1978లోనే శంకరనేత్రాలయం ప్రారంభమైనా, జయేంద్రసరస్వతి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాతే సేవలు విస్తృతమయ్యాయి. శంకరనేత్రాలయ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్‌తో పాటు కంటి అద్దాలు, భోజనం, రవాణా సదుపాయాలను సైతం అందిస్తున్నారు. ఈ వైద్యశాలలో రోజుకు 1,200 మందికి చిక్సిత, రెండు వందల మందికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇండియన్ మిషన్ వైద్యశాల, చెన్నైలోని నుంగంబాక్కం వద్ద ఉన్న చైల్డ్ హాస్పిటల్, కోల్‌కతా, గువాహుటి, రామేశ్వరం, తిరుపతిలోని వైద్యశాలలు సైతం జయేంద్రసరస్వతి ప్రత్యేక చొరవతోనే నిరుపేదలకు వైద్య సేవలను అందిస్తున్నాయి. ఆయన జీవన విధానం ఆదర్శనీయం - కొన ఊపిరి వరకూ ధర్మం కోసం పోరాటం చేశారు - విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పెందుర్తి: కంచికామకోటి పీఠాధిపతి జగద్గురువు జయేంద్ర సరస్వతి మహాస్వామి పరమపదించడం తనను ఎంతో బాధకు, దిగ్బ్రాంతికి గురి చేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. జయేంద్ర సరస్వతి లేకపోవడం భారతదేశానికి తీరనిలోటని పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో స్వామీజీ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో జయేంద్రసరస్వతి చేసిన ధర్మప్రచారం ఏ పీఠాధిపతి చేయలేదన్నారు. ధర్మం కోసం కొన ఊపిరి వరకు ఆయన పోరాటం చేశారని, తనలాంటి వారికి ఆయన జీవనవిధానం ఎంతో ఆదర్శప్రాయమన్నారు. వారి మార్గంలోనే శారదాపీఠం వంటి పీఠాలు ఆమోదయోగ్యంగా నడుస్తున్నాయని చెప్పారు. ఆదిశంకరాచార్యులు అనుసరించిన మార్గంలోనే కేవలం ఆధ్యాత్మిక చింతనే కాకుండా సామాజిక దృక్పథంతో పేదలకు సహాయం చేయాలన్న సదుద్దేశంతో కంటి ఆసుపత్రి, వైద్యశిబిరాలు, వేదపాఠశాలలు నడుపుతూ సమాజానికి మేలు చేకూర్చుతున్న జీవన్ముక్తులు జయేంద్రసరస్వతి అని కొనియాడారు. విశాఖ శ్రీశారదాపీఠానికి, కంచికామకోటి పీఠానికి ఎంతో అవినావభావ సంబంధం ఉందన్నారు. జయేంద్ర సరస్వతి ఎప్పుడు విశాఖ వచ్చినా శారదాపీఠానికి వచ్చి తమకు ఆశీర్వచనం అందించేవారని గుర్తు చేశారు. వారు (జయేంద్ర) మరికొంతకాలం ఈ లోకంలో ఉండి మా అందరినీ నడిపించాలని ఆకాంక్షించామని.. కానీ దైవం మరోలా తలచిందని విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు ఆదిశంకరాచార్యుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆ శంకరులను ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. 19 ఏళ్ల వయస్సులో యువ పీఠాధిపతిగా.. సాక్షి, చెన్నై: జయేంద్ర సరస్వతి 19 ఏళ్ల వయస్సులోనే కంచి మఠానికి యువ పీఠాధిపతిగా పట్టాభిషిక్తులయ్యారు. 1935 జూలై 18వ తేదీ తమిళనాడులోని నేటి తంజావూరు జిల్లాలోని ఇరుల్నీక్కి గ్రామంలో జన్మించిన జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మాదే అయ్యర్. చిన్న తనంలోనే హిందూ మత పెద్దలతో కలిసి ఆధ్యాత్మిక బాటలో నడిచారు. అప్పటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి సుబ్రహ్మణ్య మాదే అయ్యర్‌ను 19 ఏళ్ల వయస్సుల్లో జయేంద్ర సరస్వతిగా నామకరణం చేస్తూ 1954లో మార్చి 22న కంచిమఠానికి యువ పీఠాధిపతిని చేశారు. విదేశాల్లోనూ: 1988లో నేపాల్ పర్యటించారు. మానస సరోవరణాన్ని, ముక్తినాథ్ను సందర్శించారు. ఇక్కడకు అడుగు పెట్టిన తొలి ఆచార్యులు జయేంద్ర సర్వతి. మానస సరోవరంలో శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఆశీస్సుల కోసం : జయేంద్ర సరస్వతి పాదాన్ని తాకి పునీతులయ్యేందుకు ఎదురుచూసే భక్తులు దేశ విదేశాల్లోనూ ఎక్కువే. కంచిలోని కామాక్షి అమ్మవారిని దర్శించిన భక్తులు పక్కనే ఉన్న కంచి మఠంలో జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సుల కోసం బారులుతీరే వారు. చివరి పూజ: కామాక్షి అమ్మవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మ వారి సేవలో జయేంద్ర సరస్వతి పాల్గొంటూ వచ్చారు. మంగళవారం రాత్రి 9 గంటలకు అమ్మవారికి దీపారాధన చేసి మండపానికి వెళ్లారు. ఇదే స్వామి వారి చివరి పూజ. దేశం గొప్ప ఆధ్యాత్మిక నేతను కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందటం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. గొప్ప ఆధ్యాత్మిక నేతను, సాంఘిక సంస్కర్తను మన దేశం కోల్పోయిందన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్లో సందేశం పోస్ట్ చేశారు. ఆదర్శప్రాయులు: ఉపరాష్ట్రపతి వెంకయ్య కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవాళి సంక్షేమానికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. చిరస్థాయిగా నిలిచిపోతారు: ప్రధాని మోదీ శ్రీ కంచి కామకోటి పీఠం జగద్గురు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య శివైక్యం చెందడం తనను తీవ్ర ఆవేదన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉన్నతమైన ఆలోచనలు, విశిష్టమైన సేవల ద్వారా ఆయన లక్షలాది మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని ట్వీట్ చేశారు. దిగ్భ్రాంతి కలిగించింది: రాహుల్ గాంధీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించినట్లు బుధవారం ఓ ట్వీట్లో పేర్కొన్నారు. స్వామీజీ మరణం బాధాకరం: పన్నీరు సెల్వం కంచి కామకోటి పీఠం మఠాధిపతి శ్రీ జయేంద్రస్వామి సరస్వతి అకాల మరణం తమిళనాట ప్రజలందరికీ తీరని లోటని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం అన్నారు. స్వామీజీ మరణం అత్యంత బాధాకరమన్నారు. బుధవారం సాయంత్రం హుటాహుటిన కాంచీపురం చేరుకున్న డిప్యూటీ సీఎం సెల్వం, మంత్రులు స్వామీజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయేంద్ర సరస్వతి లేని లోటు తీరనిది: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ విచారంవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశేష భక్తజనానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయేంద్ర సరస్వతి లేని లోటు తీరనిదని అన్నారు. చంద్రబాబు సంతాపం కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీవ్ర విచారకరమన్నారు. కేసీఆర్ సంతాపం కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవలను గుర్తు చేసుకున్నారు. జయేంద్ర సరస్వతి అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు తెలంగాణ దేవాదాయశాఖ అధికారులు కంచికి బయల్దేరారు. -
జయేంద్ర సరస్వతి నిర్యాణంపై ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నిర్యాణం పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంతాపం తెలిపారు. జయేంద్ర సరస్వతి మృతి ఆయన భక్తులకు తీరని లోటు అని మోదీ పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తుల హృదయాల్లో జయేంద్ర సరస్వతి ఉంటారని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. జయేంద్ర సరస్వతి మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని అమిత్ షా తెలిపారు. Deeply anguished by the passing away of Acharya of Sri Kanchi Kamakoti Peetam Jagadguru Pujyashri Jayendra Saraswathi Shankaracharya. He will live on in the hearts and minds of lakhs of devotees due to his exemplary service and noblest thoughts. Om Shanti to the departed soul. pic.twitter.com/pXqDPxS1Ki — Narendra Modi (@narendramodi) February 28, 2018 జయేంద్ర సరస్వతి ఆత్మకు శాంతి చేకూరాలని గవర్నర్ నరసింహన్ ప్రార్థించారు. జయేంద్ర సరస్వతి నిర్యాణం ఆయన భక్తులకు తీరని లోటు అని పేర్కొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహానిర్యాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంచి పీఠం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. హిందూత్వంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా ఉన్న జయేంద్ర సరస్వతి శివైక్యం పొందడం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన తన మార్గదర్శకత్వంలో కంచి పీఠాన్ని బలమైన సంస్ధగా తీర్చిదిద్దారు. పాఠశాలలు, కంటి ఆస్పత్రులు, పిల్లల వైద్యశాలలను నడుపుతూ ప్రజాసేవలో పునీతులయ్యారు. జయేంద్ర సరస్వతి స్వామి బుధవారం శివైక్యం చెందడంపై టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సంతాపం వ్యక్తం చేశారు. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలకు కంచి స్వామి అందించిన సహకారాన్ని మరువలేమన్నారు. ఈ సందర్భంగా వారితో గల అనుబంధాన్ని ఈవో గుర్తు చేసుకున్నారు. గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్న కంచి పీఠాధిపతి మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం ఉదయం సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1935 జూలై 18న తమిళనాడులోని తంజావురు జిల్లా ఇరునీకల్ గ్రామంలో జయేంద్ర సరస్వతి జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యర్. 1954 మార్చి 24న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ అధిపతి. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి బాధ్యతలు చేపట్టారు. కాగా జయేంద్ర సరస్వతి స్వామి భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి కంచి మఠానికి తీసుకుని వచ్చారు. అనంతరం ఆయన పార్థివదేహానికి శాంతి పూజ తదితర శాస్త్రోక్తమైన పూజలు నిర్వహించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మరణ వార్త తెలియగానే కాంచీపురం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి భక్తులు కడసారి దర్శనానికి పెద్ద ఎత్తున మఠానికి తరలివస్తున్నారు. -
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం
-
జయేంద్ర సరస్వతి శివైక్యం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి కంచి పీఠాధిపతి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమవడంతో జయేంద్ర సరస్వతి బుధవారం శివైక్యం చెందినట్లు సమాచారం. కాగా, గత నెలలోనూ శ్వాసకోశ ఇబ్బందులతో అస్వస్థతకు గురైన జయేంద్ర సరస్వతిని చెన్నై పోరూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కంచి పీఠాధిపతి కోలుకున్న విషయం తెలిసిందే. జయేంద్ర సరస్వతి 1935 జూలై 18న తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకిలో జన్మించారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ. 1954 మార్చి 22న కంచి పీఠంలో చేరిన ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి పీఠానికి ఆయన 69వ పీఠాధిపతిగా సేవలు అందించారు. -
చల్లారని తమిళ సంఘాల ఆగ్రహం!
సాక్షి, చెన్నై: కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామిపై తమిళ సంఘాల ఆగ్రహం చల్లారడం లేదు. తమిళతల్లి గీతాన్నీ ఆయన అవమానించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కంచిలోని శంకరమఠం ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళతల్లి గీతం ఆలాపిస్తున్నప్పుడు విజయేంద్ర సరస్వతి ధ్యానంలో ఉండి నిలబడలేకపోయారని, అది తమిళ భాషను అవమానించినట్టుగా భావించవద్దని శంకరమఠం కోరింది. కానీ జాతీయగీతం ఆలాపన సమయంలో గౌరవంగా లేచి నిలబడిన విజయేంద్ర సరస్వతి.. తమిళతల్లి గీతాన్ని ఆలాపిస్తున్నప్పుడు లేచినిలడకపోవడం.. అవమానించడమేనని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంచీపురంలోని శంకరమఠం ముట్టడికి తమిళ విద్యార్థి సంఘాలు ఆదివారం ప్రయత్నించాయి. ముందస్తు సమాచారం లేకుండా విద్యార్థి సంఘాలు మఠం ముందు గుమికూడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారుల నడుమ తోపులాట జరిగింది. ఆధ్యాత్మికతకు నిలయమైన శంకరమఠం ముట్టడికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. -
కృష్ణా పుష్కరాలు పవిత్రమైనవని: జయేంద్ర సరస్వతి
విజయవాడ : వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాలు చాలా పవిత్రమైనవని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. పుష్కర స్నానమాచరించి ప్రతి ఒక్కరూ పుణ్యం పొందాలన్నారు. పుష్కర సమయంలో 33 కోట్ల మంది దేవతలు స్నానమాచరిస్తారని తెలిపారు.