ధర్మమే నిలుస్తుంది.. సత్యమే గెలుస్తుంది
ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా మా గురువులు నన్ను తీర్చిదిద్దారు. కష్టం అన్న పరిస్థితే ఎదురుకాదు
– జయేంద్ర సరస్వతి
తిరువళ్లూరు (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంచి కామకోటి 69వ పీఠాధిపతిగా సేవలు కొనసాగించిన స్వామి జయేంద్రసరస్వతి శివైక్యం చెందడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీఠాధిపతిగా తన సేవలను ఆధ్యాత్మికకే పరిమితం కాకుండా నిరుపేదలకు సేవ చేస్తూ సేవల స్వామీజీగా పేరు సంపాదించుకున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో వైద్యశాలలు, పాఠశాలలు డీమ్డ్ యూనివర్సిటీ, గోశాల, వృద్ధాశ్రమం ప్రారంభించి తమ సేవలను అన్ని వైపులా విస్తరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకున్న పలు ప్రసిద్ధ ఆలయాలను పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు.
సేవలు చిరస్మరణీయం
కంచి మఠం పీఠాధిపతిగా బాధ్యతను నిర్వహిస్తూనే సేవలకు అపరిమత ప్రాధాన్యతను ఇచ్చారు. కాంచీపురం సమీపంలోని ఏనత్తూరు గ్రామం వద్ద 1993లో కంచి మఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ విద్యాలయం ద్వారా తక్కువ ఫీజుతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు. 1994లో ఎడ్యుకేషన్ వింగ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో 22 పాఠశాలలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు.
నిరుపేదలకు వైద్య సేవలు
మానవ సేవే మాధవసేవ అన్నది జయేంద్రసరస్వతి నినాదం. 1978లోనే శంకరనేత్రాలయం ప్రారంభమైనా, జయేంద్రసరస్వతి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాతే సేవలు విస్తృతమయ్యాయి. శంకరనేత్రాలయ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్‌తో పాటు కంటి అద్దాలు, భోజనం, రవాణా సదుపాయాలను సైతం అందిస్తున్నారు. ఈ వైద్యశాలలో రోజుకు 1,200 మందికి చిక్సిత, రెండు వందల మందికి ఆపరేషన్‌లు నిర్వహిస్తున్నారు. ఇండియన్ మిషన్ వైద్యశాల, చెన్నైలోని నుంగంబాక్కం వద్ద ఉన్న చైల్డ్ హాస్పిటల్, కోల్‌కతా, గువాహుటి, రామేశ్వరం, తిరుపతిలోని వైద్యశాలలు సైతం జయేంద్రసరస్వతి ప్రత్యేక చొరవతోనే నిరుపేదలకు వైద్య సేవలను అందిస్తున్నాయి.
ఆయన జీవన విధానం ఆదర్శనీయం
- కొన ఊపిరి వరకూ ధర్మం కోసం పోరాటం చేశారు
- విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ
పెందుర్తి: కంచికామకోటి పీఠాధిపతి జగద్గురువు జయేంద్ర సరస్వతి మహాస్వామి పరమపదించడం తనను ఎంతో బాధకు, దిగ్బ్రాంతికి గురి చేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. జయేంద్ర సరస్వతి లేకపోవడం భారతదేశానికి తీరనిలోటని పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో స్వామీజీ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో జయేంద్రసరస్వతి చేసిన ధర్మప్రచారం ఏ పీఠాధిపతి చేయలేదన్నారు. ధర్మం కోసం కొన ఊపిరి వరకు ఆయన పోరాటం చేశారని, తనలాంటి వారికి ఆయన జీవనవిధానం ఎంతో ఆదర్శప్రాయమన్నారు. వారి మార్గంలోనే శారదాపీఠం వంటి పీఠాలు ఆమోదయోగ్యంగా నడుస్తున్నాయని చెప్పారు. ఆదిశంకరాచార్యులు అనుసరించిన మార్గంలోనే కేవలం ఆధ్యాత్మిక చింతనే కాకుండా సామాజిక దృక్పథంతో పేదలకు సహాయం చేయాలన్న సదుద్దేశంతో కంటి ఆసుపత్రి, వైద్యశిబిరాలు, వేదపాఠశాలలు నడుపుతూ సమాజానికి మేలు చేకూర్చుతున్న జీవన్ముక్తులు జయేంద్రసరస్వతి అని కొనియాడారు. విశాఖ శ్రీశారదాపీఠానికి, కంచికామకోటి పీఠానికి ఎంతో అవినావభావ సంబంధం ఉందన్నారు. జయేంద్ర సరస్వతి ఎప్పుడు విశాఖ వచ్చినా శారదాపీఠానికి వచ్చి తమకు ఆశీర్వచనం అందించేవారని గుర్తు చేశారు. వారు (జయేంద్ర) మరికొంతకాలం ఈ లోకంలో ఉండి మా అందరినీ నడిపించాలని ఆకాంక్షించామని.. కానీ దైవం మరోలా తలచిందని విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు ఆదిశంకరాచార్యుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆ శంకరులను ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.
19 ఏళ్ల వయస్సులో యువ పీఠాధిపతిగా..
సాక్షి, చెన్నై: జయేంద్ర సరస్వతి 19 ఏళ్ల వయస్సులోనే కంచి మఠానికి యువ పీఠాధిపతిగా పట్టాభిషిక్తులయ్యారు. 1935 జూలై 18వ తేదీ తమిళనాడులోని నేటి తంజావూరు జిల్లాలోని ఇరుల్‌నీక్కి గ్రామంలో జన్మించిన జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మాదే అయ్యర్. చిన్న తనంలోనే హిందూ మత పెద్దలతో కలిసి ఆధ్యాత్మిక బాటలో నడిచారు. అప్పటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి సుబ్రహ్మణ్య మాదే అయ్యర్‌ను 19 ఏళ్ల వయస్సుల్లో జయేంద్ర సరస్వతిగా నామకరణం చేస్తూ 1954లో మార్చి 22న కంచిమఠానికి యువ పీఠాధిపతిని చేశారు.
విదేశాల్లోనూ: 1988లో నేపాల్ పర్యటించారు. మానస సరోవరణాన్ని, ముక్తినాథ్‌ను సందర్శించారు. ఇక్కడకు అడుగు పెట్టిన తొలి ఆచార్యులు జయేంద్ర సర్వతి. మానస సరోవరంలో శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్‌లో పర్యటించారు.
ఆశీస్సుల కోసం : జయేంద్ర సరస్వతి పాదాన్ని తాకి పునీతులయ్యేందుకు ఎదురుచూసే భక్తులు దేశ విదేశాల్లోనూ ఎక్కువే. కంచిలోని కామాక్షి అమ్మవారిని దర్శించిన భక్తులు పక్కనే ఉన్న కంచి మఠంలో జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సుల కోసం బారులుతీరే వారు.
చివరి పూజ: కామాక్షి అమ్మవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మ వారి సేవలో జయేంద్ర సరస్వతి పాల్గొంటూ వచ్చారు. మంగళవారం రాత్రి 9 గంటలకు అమ్మవారికి దీపారాధన చేసి మండపానికి వెళ్లారు. ఇదే స్వామి వారి చివరి పూజ.
దేశం గొప్ప ఆధ్యాత్మిక నేతను కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందటం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. గొప్ప ఆధ్యాత్మిక నేతను, సాంఘిక సంస్కర్తను మన దేశం కోల్పోయిందన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్‌లో సందేశం పోస్ట్ చేశారు.
ఆదర్శప్రాయులు: ఉపరాష్ట్రపతి వెంకయ్య
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవాళి సంక్షేమానికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.
చిరస్థాయిగా నిలిచిపోతారు: ప్రధాని మోదీ
శ్రీ కంచి కామకోటి పీఠం జగద్గురు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య శివైక్యం చెందడం తనను తీవ్ర ఆవేదన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉన్నతమైన ఆలోచనలు, విశిష్టమైన సేవల ద్వారా ఆయన లక్షలాది మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని ట్వీట్ చేశారు.
దిగ్భ్రాంతి కలిగించింది: రాహుల్ గాంధీ
కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించినట్లు బుధవారం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
స్వామీజీ మరణం బాధాకరం: పన్నీరు సెల్వం
కంచి కామకోటి పీఠం మఠాధిపతి శ్రీ జయేంద్రస్వామి సరస్వతి అకాల మరణం తమిళనాట ప్రజలందరికీ తీరని లోటని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం అన్నారు. స్వామీజీ మరణం అత్యంత బాధాకరమన్నారు. బుధవారం సాయంత్రం హుటాహుటిన కాంచీపురం చేరుకున్న డిప్యూటీ సీఎం సెల్వం, మంత్రులు స్వామీజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
జయేంద్ర సరస్వతి లేని లోటు తీరనిది: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ విచారంవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశేష భక్తజనానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయేంద్ర సరస్వతి లేని లోటు తీరనిదని అన్నారు.
చంద్రబాబు సంతాపం
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీవ్ర విచారకరమన్నారు.
కేసీఆర్ సంతాపం
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవలను గుర్తు చేసుకున్నారు. జయేంద్ర సరస్వతి అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు తెలంగాణ దేవాదాయశాఖ అధికారులు కంచికి బయల్దేరారు.
Comments
Please login to add a commentAdd a comment