సాక్షి, హైదరాబాద్ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నిర్యాణం పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంతాపం తెలిపారు. జయేంద్ర సరస్వతి మృతి ఆయన భక్తులకు తీరని లోటు అని మోదీ పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తుల హృదయాల్లో జయేంద్ర సరస్వతి ఉంటారని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. జయేంద్ర సరస్వతి మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని అమిత్ షా తెలిపారు.
Deeply anguished by the passing away of Acharya of Sri Kanchi Kamakoti Peetam Jagadguru Pujyashri Jayendra Saraswathi Shankaracharya. He will live on in the hearts and minds of lakhs of devotees due to his exemplary service and noblest thoughts. Om Shanti to the departed soul. pic.twitter.com/pXqDPxS1Ki
— Narendra Modi (@narendramodi) February 28, 2018
జయేంద్ర సరస్వతి ఆత్మకు శాంతి చేకూరాలని గవర్నర్ నరసింహన్ ప్రార్థించారు. జయేంద్ర సరస్వతి నిర్యాణం ఆయన భక్తులకు తీరని లోటు అని పేర్కొన్నారు.
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహానిర్యాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంచి పీఠం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
హిందూత్వంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా ఉన్న జయేంద్ర సరస్వతి శివైక్యం పొందడం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన తన మార్గదర్శకత్వంలో కంచి పీఠాన్ని బలమైన సంస్ధగా తీర్చిదిద్దారు. పాఠశాలలు, కంటి ఆస్పత్రులు, పిల్లల వైద్యశాలలను నడుపుతూ ప్రజాసేవలో పునీతులయ్యారు.
జయేంద్ర సరస్వతి స్వామి బుధవారం శివైక్యం చెందడంపై టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సంతాపం వ్యక్తం చేశారు. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలకు కంచి స్వామి అందించిన సహకారాన్ని మరువలేమన్నారు. ఈ సందర్భంగా వారితో గల అనుబంధాన్ని ఈవో గుర్తు చేసుకున్నారు.
గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్న కంచి పీఠాధిపతి మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం ఉదయం సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1935 జూలై 18న తమిళనాడులోని తంజావురు జిల్లా ఇరునీకల్ గ్రామంలో జయేంద్ర సరస్వతి జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యర్. 1954 మార్చి 24న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ అధిపతి. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి బాధ్యతలు చేపట్టారు.
కాగా జయేంద్ర సరస్వతి స్వామి భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి కంచి మఠానికి తీసుకుని వచ్చారు. అనంతరం ఆయన పార్థివదేహానికి శాంతి పూజ తదితర శాస్త్రోక్తమైన పూజలు నిర్వహించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మరణ వార్త తెలియగానే కాంచీపురం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి భక్తులు కడసారి దర్శనానికి పెద్ద ఎత్తున మఠానికి తరలివస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment