కర్మఫలం
ఒకసారి ఓ రాజుగారు తన ముగ్గురు మంత్రుల్నీ పిలిచి, అడవికి వెళ్లి ముగ్గురినీ మూడు సంచులనిండా పండ్లు తెమ్మన్నారు. రాజాజ్ఞ మేరకు, మొదటి మంత్రి అడవంతా గాలించి మంచి మంచి పండ్లను, మాగిన పండ్లను, తియ్యటి పండ్లను సేకరించాడు. రెండో మంత్రి, అంత శ్రమకోర్వలేక ‘మనమేం తెచ్చామో రాజుగారు చూస్తారా ఏంటి?’ అనుకుని పండ్లూ, కాయలూ, పిందెలూ అన్నీ ఏరి సంచీ నింపాడు. మూడో మంత్రి ‘రాజుగారు నేను తీసుకువెళ్లే సంచి ఎంత పెద్దదిగా ఉందో చూస్తారుగానీ, సంచిలో ఏమున్నాయో చూడరుగా’ అనుకుని సంచిని రాళ్లూరప్పలూ, ఆకులూ అలములతో నింపాడు.
రాజుగారు మంత్రులు తెచ్చిన సంచుల్లో ఏమున్నాయో చూడకుం డానే ముగ్గురినీ మూడేసి మాసాలపాటు జైలులో ఉంచమని అధికారులను ఆదేశించారు. జైల్లో ఉన్న సమయంలో వాళ్లు అడవినుంచి సేకరించి తెచ్చుకున్న ఫలాలే తినాలి తప్ప బయటి ఆహారమేదీ వాళ్లకు సరఫరా చేయరాదని కూడా హుకుం జారీ చేశారు.
మొదటి మంత్రి జైలులో ఉన్న మూడు నెలలూ తను సేకరించి తెచ్చుకున్న మధుర ఫలాలు తింటూ సుఖంగా ప్రాణాలు నిలుపుకున్నాడు. రెండో అతను– కొన్నాళ్లు మంచి పండ్లు తిన్నాడు. ఆ తర్వాత ఆకలికి తాళలేక పచ్చిపండ్లు, పిచ్చి పండ్లు అన్నీ తిన్నాడు. దాంతో అనారోగ్యం పాలయ్యాడు. మూడోమంత్రి సంగతి ఇంక చెప్పేదేముంది? తినడానికి ఏమీలేక, ఆకులూ అలములూ తినలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మనం చేసిన కర్మల ఫలితాలను మనమే అను భవించాలి.
భవన నిర్మాణ పనుల్లో సమర్థుడని పేరుగాంచిన ఒక మేస్త్రీ ఇంక ఆ పనులు చేయదలుచుకోక అదే మాట తన యజమానితో చెప్పాడు. యజమాని ఎంత నచ్చ చెప్పినా వినలేదు మేస్త్రీ. ‘సరే ఒప్పుకున్న ఇళ్లలో ఒకే ఒకటి మిగిలిపోయింది. ఆ ఒక్కటీ కట్టి ఆపైన విరమించుకో’ అన్నాడు యజమాని. మేస్త్రీ సరేనన్నాడు. మొక్కుబడిగా అయిందనిపించాడు కూడా.
ఇదివరకు అతను ఇల్లుకడితే నల్లరాతి మీద నగిషీలు చెక్కినట్టుండేది. ఇప్పుడు ఈ ఇల్లు చూస్తే తలదాచుకునేందుకు మొండిగోడలమీద పైకప్పు వేసినట్లుగా ఉంది. ఇల్లు కట్టడం పూర్తయ్యాక సెలవు తీసుకుందామని యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘నీ కోసమే ఆ ఇల్లును కట్టమన్నాను. ఇన్నాళ్లూ నువ్వు చేసిన సేవలకు గుర్తుగా ఆ ఇంటిని నీకు బహుమతిగా ఇవ్వదలుచుకున్నాను. ఆ ఇల్లు నీదే! నువ్వూ నీ కుటుంబం సుఖంగా ఉండండి’ అన్నాడు యజమాని, తాళం చేతులు మేస్త్రీ చేతికిస్తూ. మేస్త్రీ అవాక్కయ్యాడు. ఈ సంగతి ముందే తెలిసుంటే ఎంత బాగుండేది అనుకుని తలపట్టుకున్నాడు. గుర్తుంచుకోండి. మనం చేసిన కర్మల ఫలాన్ని మనమే అనుభవించాలి. మంచైనా చెడైనా..!
– ప్రయాగ రామకృష్ణ