Karpuri Thakur
-
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..!
మునుపెన్నడూ లేని రీతిలో.. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది. ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపీ నరసింహరావు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న చరణ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో పుట్టిన పెరిగిన చరణ్ సింగ్.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ.. చరణ్ సింగ్ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్ సింగ్‌కు అవార్డు ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్ ఎం.ఎస్ స్వామినాథ్.. భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కన్నమూశారు. ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త కర్పూరి ఠాకూర్ బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు ఎల్కే అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు -
నితీష్ కుమార్‌పై లాలూ కూతురు ఫైర్
పాట్నా: బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వంశపారంపర్య రాజకీయాలపై సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ర్జేడీ అధినేత లాలూ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గాను కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ప్రభుత్వ చర్యను స్వాగతించిన నితీష్ కుమార్.. కర్పూరి ఠాకూర్ తన కుటుంబ సభ్యులను పార్టీలో ఎన్నడూ తీసుకురాలేదని చెప్పారు. దివంగత నేత చూపిన బాటలోనే తమ పార్టీ పయనించిందని నితీష్ కుమార్ అన్నారు. జేడీయూ కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. బీహార్‌లోని మహాకూటమి (మహాగత్బంధన్) ప్రభుత్వంలో జేడీయూకి మిత్రపక్షంగా ఉన్న ఆర్జేడీని ఉద్దేశించి పరోక్షంగా నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు ఆర్జేడీ నేత లాలూ కుమార్తె ఘాటుగా స్పందించారు. కొందరు తమ సొంత లోపాలను చూసుకోలేరు.. ఇతరులపై బురద జల్లుతారు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నితీష్ కుమార్ పేరును ప్రస్తావించనప్పటికీ.. అర్హత లేని వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఏం ప్రయోజనం? ఒకరి ఉద్దేశ్యంలో మోసం ఉన్నప్పుడు ఆ పద్ధతిని ఎవరు ప్రశ్నించగలరు? అంటూ ట్వీట్ చేశారు. ఆ వెంటనే ఆ ట్వీట్లను డిలీట్ చేశారు. ఇదీ చదవండి: అస్సాంలో రాహుల్ గాంధీపై నమోదైన కేసు సీఐడీకి బదిలీ -
Bharat Ratna: నిరుపేదలకు గౌరవం: అమిత్ షా
న్యూఢిల్లీ: బిహార్ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడం దేశంలోని కోట్లాది మంది నిరుపేదలు, వెనకబడ్డ వర్గాలు, దళితులకు నిజంగా గొప్ప గౌరవమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన ద్వారా వందలాది ఏళ్ల నిరీక్షణకు తెర దించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ మర్నాడే ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా అభినందనీయమన్నారు. బుధవారం ఇక్కడ ఠాకూర్ శతజయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. కర్పూరి స్ఫూర్తితో అన్ని వర్గాలనూ సమాదరిస్తూ మోదీ ప్రభుత్వం సాగుతోందన్నారు. ముఖ్యంగా ఓబీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలేనన్నారు. -
‘భారత రత్న’ అందుకున్న ప్రముఖులెవరు?
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజానేత కర్పూరి ఠాకూర్‌ను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. ఇప్పటివరకూ 49 మంది ప్రముఖులు ‘భారతరత్న’ను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారతరత్న పొందిన వారిలో క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు... ఇలా పలువురు ‘భారతరత్న’ అందుకున్నారు. భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 26న అంటే గణతంత్ర దినోత్సవం రోజున దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ జాబితాలో తాజాగా ప్రముఖ గాంధేయ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ పేరు కూడా చేరింది. కర్పూరి ఠాకూర్ 1970, డిసెంబర్ నుండి 1971 జూన్ వరకు తిరిగి 1977 డిసెంబర్ నుండి 1979 ఏప్రిల్ వరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న కన్నుమూశారు. భారతరత్నను ప్రదానం చేయడం 1954లో ప్రారంభమైంది. కులం, వృత్తి, హోదా, లింగ భేదం లేకుండా ఆయారంగాల్లో విశేష కృషి చేసినవారికి ఈ గౌరవం దక్కుతుంది. ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు 1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు)- 1954 2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, రాజకీయవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)- 1954 3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954 4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)- 1955 5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త, మైసూర్ దివాన్)- 1955 6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత, భారత మాజీ ప్రధాని)- 1955 7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957 8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుడు)- 1958 9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, రాజకీయ నేత , పరోపకారి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త) - 1961 10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961 11. రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్ర్య సమర యోధుడు, న్యాయవాది, రాజకీయవేత్త, పండితుడు, భారత మాజీ రాష్ట్రపతి)- 1962 12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963 13. పాండురంగ్ వామన్ కేన్ (ఇండాలజిస్ట్, సంస్కృత పండితుడు)-1963 14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు, భారత మాజీ ప్రధాని) – 1966 15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారత మాజీ ప్రధానమంత్రి)-1971 16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్ర్య సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)-1975 17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) - 1976 18. మదర్ మేరీ థెరిసా బోజాక్షియు (మదర్ థెరిసా) (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980 19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)-1983 20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987 21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం) (రాజకీయనేతగా మారిన నటుడు)-1988 22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990 23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)- 1990 24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)-1991 25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991 26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (స్వాతంత్ర్య పోరాట వీరుడు, భారత ప్రధాని)- 1991 27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992 28. జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992 29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992 30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997 31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు)- 1997 32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997 33. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998 34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998 35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)- 1999 36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999 37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999 38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999 39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001 40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001 41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009 42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014 43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014 44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015 45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యా సంస్కర్త)- 2015 46. నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019 47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్లేబాక్ సింగర్, గేయ రచయిత, సంగీతకారుడు, కవి, చలనచిత్ర నిర్మాత) - 2019 48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)- 2019 49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024 -
కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న.. ప్రధాని మోదీ, సీఎం జగన్ హర్షం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’తో గౌరవించింది. నేడు ఆయన వందో జయంతి. ఠాకూర్ శతాబ్ది జయంతి ఉత్సవాల ప్రారంభానికి ఒకరోజు ముందే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం ఈ ప్రకటన వెలువరించడం విశేషం. జననాయకుడిగా అందరికీ చిరపరిచితుడైన ఠాకూర్ బిహార్‌లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికారు. భారతరత్న పొందిన వారిలో ఠాకూర్ 49వ వ్యక్తి. చివరిసారిగా 2019 ఏడాదిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేసింది. బిహార్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తొలి కాంగ్రెసేతర సోషలిస్ట్ నేతగా చరిత్ర సృష్టించారు. బిహార్‌కు ఆయన రెండుసార్లు సీఎంగా సేవలందించారు. తొలిసారిగా సీఎంగా 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు పనిచేశారు. 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో డెప్యూటీ సీఎంగానూ చేశారు. ‘ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయానికి ప్రతిరూపం ఠాకూర్. అణగారిన వర్గాల తరఫున పోరాడి వారిలో మార్పు రావడానికి ఎంతగానో కృషిచేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని జీవన విధానంగా మార్చుకున్న మహానుభావుడు. ఈ పురస్కారం ఆయన చేసిన కృషికి మాత్రమే కాదు భావితరాలకు స్ఫూర్తిగా, గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. విద్యార్థి దశలోనే స్వతంత్రపోరాటంలోకి.. ఠాకూర్ బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో కర్పూరిగ్రామ్‌లో 1924 జనవరి 24వ తేదీన జన్మించారు. ఈ గ్రామం పూర్వం బ్రిటిష్ ఇండియా పాలనలో బిహార్–ఒడిశా ప్రావిన్స్‌లో పితౌజియా పేరుతో పిలవబడేది. పితౌజియా గ్రామం పేరును ఈయన పేరిట కర్పూరిగ్రామ్‌గా మార్చారు. అతి సామాన్య నాయీ బ్రాహ్మణ రైతు కుటుంబంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. ఠాకూర్‌కు చిన్నప్పటి నుంచి విప్లవభావాలు ఎక్కువే. కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసి భారత స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఠాకూర్‌ను 1942, 1945లో అరెస్ట్‌చేసి జైలులో పడేసింది. స్వాతంత్య్రం సిద్ధించాక మొదట్లో గ్రామంలోని పాఠశాలలో టీచర్‌గా పనిచేశారు. రామ్ మనోహర్ లోహియాకు ప్రభావితులై రాజకీయాల్లో చేరారు. జయప్రకాశ్ నారాయణ్‌కు సన్నిహితంగా మెలిగేవారు. ఎమర్జెన్సీ కాలంలో ఆయనతో కలసి పోరాటం చేశారు. జననాయకుడు బిహార్‌లో బీసీలకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరీ లాల్ కమిషన్ సిఫార్సులను 1978లో అమలుచేశారు. మండల్ కమిషన్‌కు ఈ సిఫార్సులే ప్రేరణగా నిలిచాయి. అత్యంత వెనుకబడిన కులాలు అనే భావనను తొలిసారిగా మంగేరీ కమిషనే తీసుకొచ్చింది. 1952లో తొలిసారిగా సోషలిస్ట్ పార్టీ తరఫున తేజ్‌పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి బిహార్ శాసనసభకు ఎన్నికయ్యారు. తుదిశ్వాస విడిచేదాకా ఎమ్మెల్యేగానే కొనసాగారు. 1970లో బిహార్ రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం అమలుచేసి అందరి మన్ననలు పొందారు. రాష్ట్రంలో ఓబీసీలు రాజకీయాల్లో కీలకంగా మారడం వెనక ఈయన పాత్ర ఉంది. జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లకు ఠాకూర్ రాజకీయ గురువు. 1988లో తుదిశ్వాస విడిచారు. ఈయన కుమారుడు ప్రస్తుతం రామ్‌నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. అణగారిన వర్గాల పెన్నిధి: మోదీ ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ‘ పేద, అణగారిన, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా అంకితభావంతో పనిచేశారు. సమాజంలోని వివక్ష, అసమానతలు పారద్రోలి వెనకబడిన వర్గాలకు అన్నింటి అవకాశాలు దక్కేందుకు జీవితాంతం కృషిచేశారు. ఆయన నాయకత్వ దార్శనికత భారత సామాజిక, రాజకీయ ముఖచిత్రంపై చెరగని ముద్ర వేసింది. ఈ పురస్కారం ఆయన కృషి మాత్రమేకాదు సమున్నతమైన సమసమాజ స్థాపన కోసం మనం చేసే ప్రయత్నాలకు చక్కని ప్రేరణ’’ అని మోదీ శ్లాఘించారు. సీఎం జగన్ హర్షం సామాజిక న్యాయం, వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన సోషలిస్టు నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు ఆయన మరణానంతరం భారతరత్న ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. -
కర్పూరి ఠాకూర్‌కు ఘన నివాళులు
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు: బిహార్ మాజీ ముఖ్యమంత్రి 'జననాయక్' కర్పూరి ఠాకూర్ 95వ జయంతి సందర్భంగా తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ఘన నివాళులు అర్పించింది. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ నివాళి అర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కర్పూరి ఠాకూర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎంబీసీల గౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. 'జననాయక్' స్ఫూర్తితో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. నాయీ బ్రాహ్మణ నాయకులు రమేశ్, జి. శ్రీనివాస్ తదితరులు కూడా కర్పూరి ఠాకూర్‌కు నివాళులు అర్పించారు. పరిపాలనాదక్షుడు కర్పూరి ఠాకూర్ రాజకీయాల్లో విలువలకు నిలువుటద్దంగా నిలిచిన పరిపాలనాదక్షుడు కర్పూరి ఠాకూర్ అని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక పేర్కొంది. ఒంగోలులోని బీసీ కులాల ఆరామ క్షేత్రాల సముదాయంలో కర్పూరి ఠాకూర్ 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాధారణ మంగలి కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన కర్పూరి ఠాకూర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడ్డారని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు పిల్లుట్ల సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, మిరియాల రాఘవ, ఏల్చూరి రమేశ్, బత్తుల కృష్ణమూర్తి, కొణిజేటి రామకృష్ణ, ఏల్చూరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.