Keshava Reddy School
-
కేశవరెడ్డి హాస్టల్‌పై నుంచి పడి విద్యార్థిని మృతి
సాక్షి, కర్నూలు: పాణ్యం కేశవరెడ్డి స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న సుష్మా అనే విద్యార్ధిని మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందారు. హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి సుష్మా పడిపోవడంతో.. స్కూల్ యాజమాన్యం ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించింది. అయితే ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని హాస్టల్ పై నుంచి దూకి కింద పడ్డారా లేదా అనే దానిపై విచారణ చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందటంపై.. బాధితురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థినిని యాజమాన్యమే హత్య చేసి మేడపై నుంచి తోసేసి ఉంటారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తెలితే.. స్కూల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
'కేశవరెడ్డి' ఆస్తుల అటాచ్మెంట్
హైదరాబాద్: కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రూ. 24.50 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సీఐడీకి ఏపీ హోం శాఖ ఆదేశించింది. అధిక వడ్డీల ఆశ చూపి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసినట్టు ప్రముఖ విద్యాసంస్థల యజమాని నాగిరెడ్డి కేశవరెడ్డిపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏపీ హోంశాఖ కేశవరెడ్డి స్కూల్ యాజమాన్య ఆస్తల అటాచ్మెంట్ చేయాలని సీఐడీని ఆదేశించింది. కాగా, నంద్యాల పట్టణం బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న కేశవరెడ్డికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ఉన్నాయి. వాటికి అవసరమైన పెట్టుబడుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, వ్యాపారుల నుంచి డిపాజిట్లు సేకరించినట్టు గతంలో కేశవరెడ్డిపై ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి
-
అనుమానాస్పదస్థితిలో విద్యార్థి మృతి
రంగారెడ్డి (పూడూరు) : రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మన్నెగూడలోని కేశవరెడ్డి పాఠశాలలో చదువుతున్న నవీన్(14) అనే విద్యార్థి అనుమానాస్పదస్థితిలో శనివారం రాత్రి మృతిచెందాడు. స్కూల్లో అపస్మారకస్థితిలో పడి ఉండటంతో నవీన్‌ను స్కూల్ యాజమాన్యం హైదరాబాద్‌లోని నీస్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే సమయంలో స్కూల్ యాజమాన్యం కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని, నవీన్ చనిపోయిన తర్వాత మార్చురీకి తరలించే సమయంలో సమాచారం ఇచ్చారని కుటుంబీకులు చెబుతున్నారు. నవీన్‌ను టీచర్లు కొట్టడం వల్లే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నవీన్ మృతదేహం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.